చట్ట ప్రకారమే సమ్మె

Jan 19,2024 10:12 #legal, #strike
  • సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం
  • షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీల వివరణ
  • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : ‘చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నాం.. మా సమస్యలను తక్షణం పరిష్కరిస్తేనే ఆందోళనను విరమిస్తాం, అంతవరకూ ఆపే ప్రసక్తిలేదు.. షోకాజ్‌ నోటీసులకు ఇదే మా సమాధానం’ అంటూ అంగన్‌వాడీలు సామూహికంగా వివరణ ఇచ్చారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులతో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు. ఐసిడిఎస్‌, సిడిపిఒ కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం అధికారులకు వివరణ పత్రాలను అందజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని భారీ ప్రదర్శన చేశారు. అనంతరం ధర్నా చేసి కార్యాలయంలో లేఖలను అందించారు. నాదెండ్లలో వ్యక్తిగత లేఖలతో ప్రదర్శన చేసి సిడిపిఒ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వీరికి కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మద్దతు తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.కుమార్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. మంగళగిరిలో అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చుని, పెదనందిపాడులో తలపై కుర్చీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు.

పెదకాకాని, కొల్లిపర, దుగ్గిరాలలో సంతకాల సేకరణ చేపట్టారు. విశాఖలోని భీమిలిలో జిఒ 2 ప్రతులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. పెందుర్తిలో అంగన్‌వాడీల సమ్మెకు ఐద్వా, ప్రజానాట్యమండలి, పౌర సంఘం నాయకులు మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో షోకాజ్‌ నోటీసులకు సమాధానమిచ్చారు. పరవాడలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అల్లూరి జిల్లాలోని అడ్డతీగల, విఆర్‌.పురం, రాజవొమ్మంగి కేంద్రాల్లో మూకుమ్మడిగా షోకాజ్‌ నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పిఒ నాగరాణి షోకాజ్‌ నోటీసులకు సామూహిక సమాధాన పత్రాలను తీసుకోకపోవడంతో ప్రాజెక్టు కార్యాలయం గోడకు అంటించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు, ముమ్మిడివరంలో ప్రభుత్వ షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీలు వివరణ ఇచ్చారు. ముమ్మిడివరం, మామిడికుదురులో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కాకినాడ జిల్లా పెద్దాపురం, పిఠాపురంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్‌ నిర్మల్‌ కుమారి కళ్లు తిరిగి పడిపోయారు. తోటి కార్యకర్తలు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు తలపై చేతులు పెట్టుకుని నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. విజయనగరం కలెక్టరేట్‌ నుంచి ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు అంగన్‌వాడీలు ర్యాలీ చేపట్టారు. విజయనగరం, శృంగవరపుకోటలో సమ్మె శిబిరాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు సందర్శించి అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బొబ్బిలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సాలూరులో కళ్లు, చెవులు, నోరు మూసుకుని, సీతంపేట, పాలకొండలో షోకాజ్‌ నోటీసులతో నిరసన తెలిపారు. సీతానగరంలో అంగన్‌వాడీలకు పలువురు సర్పంచులు ఆర్థిక సాయం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో షాకాజ్‌ నోటీసులతో నిరసన ప్రదర్శన చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో షోకాజ్‌ నోటీసులతో ప్రదర్శగా నిర్వహించి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి సావిత్రికి సమాధాన పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో నిరసన ప్రదర్శన, కనిగిరిలో ర్యాలీ చేపట్టారు. బాపట్ల, తూర్పుగోదావరి, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ప్రభుత్వం పంపిన షోకాజ్‌ నోటీలకు వివరణలిస్తూ ఆయా మండలాల్లో సిడిపిఒ, ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణలో అంగన్‌వాడీ వేతనాల పెంపుదల ప్రకటించాలి : దళిత, గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా అంగన్‌వాడీల పెంపుదలపై ప్రకటన చేయాలని దళిత, గిరిజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయా సంఘాల నేతలు గురువారం లేఖ రాశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేసి గత్యంతరం లేక నిరవధిక దీక్ష చేస్తున్నారని తెలిపారు. వీరంతా దళిత, గిరిజన బలహీనవర్గాలకు చెందిన ఆడపడుచులని, విగ్రహావిష్కరణలో వీరు కూడా పాల్గొనాల్సిన వారని వివరించారు. అంగన్‌వాడీల కోర్కెలు న్యాయమైనవని అన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత వేతనాలు సరిపోవడం లేదని తెలిపారు. రూ.26 వేలు వేతనం ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీల సమ్మె, నిరవధిక దీక్షకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ సభలో వారి వేతనాలపై ప్రకటన చేసి వారు సంతోషంగా ఇంటికెళ్లేలా చేయాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో అండ్ర మాల్యాద్రి (కెవిపిఎస్‌), జి క్రాంతి కుమార్‌ (ఎపిడికెఎస్‌), కరవది సుబ్బారావు (డిహెచ్‌పిఎస్‌), మేళం భాగ్యారావు (డిబిఎఫ్‌), పేరుపోగు వెంకటేశ్వరరావు (ఎపిఎంఆర్‌పిఎస్‌), మల్లెల వెంకట్రావు (మాలమహాసభ), చిట్టిబాబు (డిబిఎస్‌యు), కాసాని గణేష్‌ బాబు (దళిత జాగృతి సేన), జికెడి వరప్రసాద్‌ (పవర్‌ గ్రిడ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం), సిహెచ్‌ నాగేంద్ర (రెల్లి సంక్షేమ సంఘం) నల్లపు నీలాంబరం (భీమ్‌సేన సేవాదళ్‌), అల్లడి దేవకుమార్‌ (డిబిఆర్‌సి), జి రమణకుమారి (దళిత మహిళా సంఘం) ఉన్నారు.

➡️