సిపిఎం, ఇండియా వేదిక గెలిస్తేనే ప్రభుత్వరంగ సంస్థలకు రక్షణ

May 10,2024 00:14 #bike rally, #cpm, #visakhapatnam

-స్టీల్‌ప్లాంట్‌ నిలబడాలంటే వైసిపి, టిడిపి ఓడాలి : బివి రాఘవులు
-గాజువాకలో సిపిఎం భారీ బైకు ర్యాలీ
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :ఈ ఎన్నికల్లో సిపిఎం, ఇండియా వేదిక గెలిస్తేనే ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ ఉంటుందని, ప్రజాస్వామ్య హక్కులు నిలబడతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. టిడిపి, వైసిపిలకు ఓట్లేస్తే వారు స్టీల్‌ప్లాంట్‌ను మాయం చేస్తారని తెలిపారు. సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు, కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి పి.సత్యారెడ్డి గెలుపును కాంక్షిస్తూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీల కార్యకర్తలు గాజువాక నియోజకవర్గమంతటా గురువారం భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల జరిగిన సభల్లో రాఘవులు మాట్లాడుతూ సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌పై కార్పొరేట్ల పాదం పడకుండా చూస్తామన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికలపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఎవరిని గెలిపించుకుంటే దేశానికి, రాష్ట్రానికి, స్టీల్‌ప్లాంట్‌కు మేలు జరుగుతుందో ప్రజలే నిర్ణయించాలన్నారు. రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని రాఘవులు వివరించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన విధానాలు ఒక్కటేనన్నారు. ఆ పార్టీలు బిజెపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. మూడేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరినీ రాఘవులు అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కుకు రాష్ట్రంలో కేటాయించిన గనులను రెన్యువల్‌ చేయకుండా ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మేస్తాం లేదా మూసేస్తామని ప్రకటించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే నేడు అదానీ గంగవరం పోర్టు ద్వారా అనేక ఆటంకాలను సృష్టిస్తూ ఉక్కు పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు పాల్పడుతుంటే రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు చిత్తశుద్ధితో వ్యతిరేకించలేదని వివరించారు. అన్నింటా బిజెపికే మద్దతుగా నిలిచాయన్నారు. ఇటీవల గాజువాక సభలో ముఖ్యమంత్రి జగన్‌… స్టీల్‌ ప్లాంట్‌పై మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని విమర్శించారు. బిజెపి అండతో అదానీని రాష్ట్రానికి రప్పించి అతనికి గంగవరం పోర్టును అప్పజెప్పి తద్వారా స్టీల్‌ప్లాంట్‌ను కబళించేందుకు కుట్ర పన్నింది జగన్‌ కాదా? అని ప్రశ్నించారు. కార్మికుల పోరాటాలే ఉక్కు ప్రయివేటీకరణను అడ్డుకున్నాయి తప్ప, దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాఘవులు వివరించారు. కార్మికుల పోరాటాన్ని అణచివేశారే తప్ప, జగన్‌ ఏనాడూ సహకరించలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా ఆగిన విషయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న జగన్‌ ప్రయత్నాన్ని సిపిఎం ఖండిస్తోందన్నారు. వైసిపి, టిడిపిలను ఓడిస్తేనే ఉక్కుకు రక్షణ అని తెలిపారు. సిపిఎం సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ త్యాగాలతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడిందని, నాడు 63 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. 32 మంది ప్రాణార్పణతో ఈ ప్లాంట్‌ నిర్మితమైందన్నారు. అటువంటి విశిష్ట చరిత్ర ఉన్న ప్లాంట్‌ను పోరాటాలతోనే నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎజె.స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఇండియా బ్లాక్‌ గెలుపు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ శీర రమేష్‌ పాల్గన్నారు.
ఎర్రబారిన గాజువాక
జింక్‌ ఫ్యాక్టరీ గేటు వద్ద ఉదయం 6.30 గంటలకు భారీ బైకు ర్యాలీ ప్రారంభమైంది. ఓపెన్‌ టాప్‌ జీపులో అభ్యర్థులు నిల్చని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కొత్త గాజువాక, బిసి రోడ్‌, భానోజీ తోట, వికాస్‌ నగర్‌, యాతపాలెం, సత్యనారాయణపురం, కొంగపాలెం, అయ్యన్నపాలెం, పాత అయ్యన్నపాలెం, పెదగంట్యాడ జంక్షన్‌, సిద్ధేశ్వరం, సమతా నగర్‌, బాల చెరువు, నడుపూరు, నెల్లిముక్కు, సనత్‌ నగర్‌, మామిడి తోట, వంటిల్లు జంక్షన్‌, పాత గాజువాక, అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, శ్రీనగర్‌, సుందరయ్యకాలనీ సహా పలు ప్రాంతాల్లో సాగుతూ స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌ షిప్‌లో రాత్రి ఏడు గంటల వరకూ సాగింది. ఈ భారీ ర్యాలీతో గాజువాక ఎర్రబారింది. కమ్యూనిస్టులు ఎంత పెద్ద ర్యాలీ తీస్తున్నారో అంటూ పలువురు అనుకోవడం కనిపించింది.

➡️