పరాభవం తప్పదనే కాశ్మీర్‌ బరిలో బిజెపి ఔట్‌

Apr 20,2024 10:43 #BJP, #defeat, #Jammu Kashmir
  • ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దుతో సహా పదేపదే అత్యం త అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి నందున కాశ్మీరీల్లో బిజెపి పట్ల తీవ్ర మైన వ్యతిరేకత గూడుకట్టుకుందని, ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాభవం తప్పదు అని నిర్ధారణకు వచ్చినందును కాషాయ పార్టీ కాశ్మీర్‌లో కనీసం అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా సాహసించలేకపోయిందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఉపాధ్యక్షులు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కాశ్మీరీల హృదయాలను బిజెపి గెలుచుకోవడానికి ఏమీ ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే కాశ్మీర్‌లోయలోని మూడు లోక్‌సభ స్థానాల్లోనూ బిజెపి అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని ఆయన తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసిన బిజెపి ఇప్పుడు పోటీ చేయడం లేదన్నారు. దానికి కారణాన్ని ఒమర్‌ వివరిస్తూ ఇలా అన్నారు..’ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ తాము అభ్యర్థులను నిలబెట్టడం కంటే ముందుగా ప్రజల హృదయాలను గెలుచుకుంటాం అన్నారు. ఇప్పుడు వారు అభ్యర్థులను నిలపలేదంటే దాని అర్థం కాశ్మీరీ ప్రజల హృదయాలను గెలవలేదనే కదా’ అని అబ్దుల్లా తెలిపారు. అయితే నేరుగా పోటీ చేసే చేవ లేని ఆ పార్టీ వెనుక నుంచి కుట్రలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌ చుగ్‌ ఇదే పనిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కొన్ని పార్టీలతో తరుణ్‌ సమావేశమయ్యారని అబ్దుల్లా గుర్తు చేశారు. అలాగే, ‘ఎన్‌సిని, ఇండియా వేదికను ఓడిస్తామని అమిత్‌ షా చెబుతారని, కానీ మిగిలిన రాజకీయ పార్టీలను ఓడిస్తామని ఆయన చెప్పరు. దీనిని బట్టే బిజెపికి ఎవరితో బంధం ఉందో మీరే ఊహించుకోండి’ అని అబ్దుల్లా అన్నారు. పిపుల్స్‌ కాన్ఫరెన్స్‌ (పిసి) చీఫ్‌ సజద్‌ లోన్‌ తనను ‘టూరిస్ట్‌’ అని విమర్శించడంపై అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ‘బిజెపి నాయకులు శ్రీనగర్‌కు రాగానే లోన్‌ కు ఫోన్‌ చేస్తారు. ఇతను వారిని కలవడానికి పరుగులు పెడతాడు’ అని అబ్దు ల్లా విమర్శించారు. తమ పార్టీకి, పిసి వంటి ఇతర పార్టీలకు మధ్య తేడా ఏమి టంటే ‘మేం బిజెపికి తలుపు మూసివేశాం’అని ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు.

➡️