మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

ప్రజాశక్తి – యంత్రాంగం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి (74) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు మండలం కోడూరు గ్రామం. ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి 1985,1994లో టిడిపి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్‌టిఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సీతాదేవి భౌతికాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడే మంగళవారం అంత్యక్రియలు నిర్వహించునున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యెర్నేని సీతాదేవిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం.ఆమె భర్త నాగేంద్రనాథ్‌ (చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య అధ్యక్షులుగా, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. నాగేంద్రనాథ్‌ గతేడాది కన్నుమూశారు. నాగేంద్రనాథ్‌ సోదరుడు కీర్తిశేషులు యెర్నేని రాజారామచందర్‌ రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు

పలువురు సంతాపం
సీతాదేవి మృతిపట్ల గవర్నర్‌ జస్టిస్‌ మహ్మద్‌ అబ్దుల్‌ నజీర్‌, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. సీతాదేవి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. సీతాదేవి భర్త నాగేంద్రనాథ్‌తో కలిసి రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

➡️