లైంగిక వేధింపుల కేసులో బెంగాల్‌ గవర్నర్‌

  •  రాజ్‌భవన్‌ ఉద్యోగిని ఫిర్యాదు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. గవర్నరు తనను లైంగికంగా వేధించినట్లు రాజ్‌భవన్‌లో పని చేస్తున్న ఉద్యోగిని కోల్‌కతాలోని హేర్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోడీ శుక్రవారం ఎన్నికల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం బాధిత మహిళ 2019 నుంచి రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. రెండు సందర్భాల్లో గవర్నర్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గత నెల 24న గవర్నర్‌ ముందుకు వెళ్ళినప్పుడు లైంగికంగా వేధించారని, మళ్లీ గురువారం కూడా ఇదే పరిస్థితులు ఎదురుకావడంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల్ని ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ల నుంచి గవర్నర్‌కు మినహాయింపు ఉండటంతో ఈ అంశంపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన బోస్‌ గత ఏడాది నవంబర్‌లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు ఓ కట్టు కథ అని కొట్టిపారేశారు. ఎవరైనా తనను అవమానపర్చడం ద్వారా ఎన్నికల లబ్ధి పొందాలనుకుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని వ్యాఖ్యానించారు.

➡️