మన్య విప్లవ స్ఫూర్తితో ఆదివాసీ ఉద్యమం

తెలుగు జాతి స్ఫూర్తి ప్రదాత, ఆదివాసీల ఆరాధ్య నేత అల్లూరి సీతారామరాజు అమరుడై వందేళ్ళు అయ్యింది. అల్లూరి నేతృత్వంలో… ఆదివాసీల మౌలిక సమస్యల పరిష్కారం కోసం, బ్రిటిష్‌ వలస పాలన అంతం కోసం 1922 ఆగష్టు నుండి 1924 జూన్‌ వరకు విశాఖ, గోదావరి మన్య ప్రాంతంలో మహోధృత పోరాటం సాగింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన ఈ పోరు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మన్య విప్లవంగా ప్రాచుర్యం పొందింది. మన్య విప్లవం ప్రారంభమై వంద సంవత్సరాలయింది. ఆ పోరాట లక్ష్యాలు నేటికీ నెరవేరలేదు.
అల్లూరి 1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో తన తల్లి పుట్టింట పుట్టాడు. తండ్రి స్వగ్రామం భీమవరం (ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం) పట్టణానికి 10 కి.మీ. దూరంలో వున్న మోగల్లు గ్రామం. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే నిరంతరం ఏదో ఆలోచనలు చేస్తున్న విలక్షణమైన విద్యార్ధిగా ఉండేవాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆయన సహధ్యాయి మద్దూరి అన్నపూర్ణయ్య…అల్లూరి ఆలోచనలను కొన్నింటిని తన గ్రంథంలో పేర్కొన్నారు. అల్లూరి హైస్కూల్‌ విద్యార్ధిగా ఉన్నప్పుడే ”లోకోద్ధరణకు ఉపకరించే విద్యయే నిజమైన విద్య” అన్నారని అన్నపూర్ణయ్య రాశారు. అర్హతలు, అవకాశాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలు, డబ్బు సంపాదన గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఏదో చేయాలనే నిరంతరం తపన పడేవాడు. ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టడం కోసమే 1913-17 మధ్య తుని సమీప ప్రాంతంలో ఉన్న ఆటవీ ప్రాంతంలో సంచారం చేశాడు. ఆదివాసీ జీవితాలను తొలిసారిగా పరిశీలించాడు. 1916 ఏప్రిల్‌ 26న దేశ యాత్ర ప్రారంభించి ఉత్తర భారత దేశంలో విస్తృతంగా పర్యటించాడు. తొలి తరం కాంగ్రెస్‌ ఉద్యమ నాయకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీని కలకత్తాలో కలిసి చర్చించాడు. స్వాతంత్య్ర సమరయోధుడు పృధ్వీసింగ్‌తో పరిచయం చేసుకున్నాడు. చిట్టగాంగ్‌ విప్లవ వీరులతో పరిచయాలు చేసుకొని ఆ పోరాట అనుభవాలను అవగాహన చేసుకున్నాడు. ఉత్తర దేశ యాత్రలు ముగించుకొని 1917 జులై 17న విశాఖ మన్యం కృష్ణదేవి పేటకు చేరుకున్నాడు. అప్పటికి ఆయన తన భవిష్యత్తు జీవిత మార్గాన్ని నిర్దేశించుకున్నట్టు స్పష్టమవుతుంది. మొదట విశాఖ మన్య ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించి ఆదివాసీలకు బాగా చేరువయ్యాడు. కృష్ణదేవి పేట లోని ఓ కుటీరంలో ఆకులు, మూలికలతో ఆయుర్వేద వైద్యం చేయనారంభించాడు. తాండవ నది గట్టుపైన చిన్ని కుటీరం ఏర్పరచి ఆదివాసీలకు రాత్రి పాఠశాల నిర్వహించాడు. ఆదివాసీ గూడేలలో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మీ మధ్య వచ్చే వివాదాలను పోలీస్‌ స్టేషన్లు, కోర్టులకు పోకుండా మీ గ్రామాలలో మీరే పంచాయితీలు పెట్టుకొని పరిష్కరించుకోమని ఆదివాసీలకు చెప్పాడు.
మొదటి దశలో ప్రజా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించిన అల్లూరి మలి దశలో సాయుధ పోరాటానికి సమాయత్తం కావాల్సిన పరిస్థితులు విశాఖ-గోదావరి మన్యంలో ముందుకు వచ్చాయి. మొదట దేశయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ సంస్థ ప్రభావంలో ఉన్నాడు. లక్నో కాంగ్రెస్‌ మహాసభకు కూడా హాజరయ్యాడు. 1922 ఫిబ్రవరి 12న గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమం హఠాత్తుగా నిలిపివేశారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్న ఈ ఉద్యమం అర్ధంతరంగా నిలిపివేయడంతో భారత దేశంలోని అనేక మంది యువ స్వాతంత్య్రోద్యమ నాయకులు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి ఆ విధంగా కొత్త మార్గాన్ని చేపట్టాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఓడించి దేశ స్వాతంత్య్రాన్ని సాధించాలంటే సాయుధ పోరాటమే మార్గమని, మన్యం విప్లవం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు.

బ్రిటిష్‌ ప్రభుత్వ అక్రమ చట్టాలు – తీవ్ర దోపిడి, పీడనలు
నాడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆదివాసీలతో రోడ్లు, ఘాట్‌ రోడ్లు వేయించేది. కూలీ చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించేవారు. బ్రిటిష్‌ అటవీ విధానాన్ని కఠినంగా అమలు జరిపి ఆదివాసీల సాంప్రదాయక పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. అటవీ ఉత్పత్తులను సేకరించడంపై ఆంక్షలు విధించారు. బ్రిటిష్‌ రెవెన్యూ చట్టాలు ఆదివాసీల స్వంత భూములు కోల్పోయే పరిస్థితి తీసుకు వచ్చింది. విశాఖ-గోదావరి మన్యంలో తమ జీవనానికి ఏకైక ఆధారమైన భూములను ఆదివాసీలు పెద్ద ఎత్తున కోల్పోయారు. దీనికి తోడు మైదాన ప్రాంతం నుండి వచ్చిన షావుకార్లు (వడ్డీ వ్యాపారులు), అటవీ కాంట్రాక్టర్ల్లు యథేచ్ఛగా దోపిడీ సాగించడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున భూముల్ని స్వాధీనం చేసుకోవడంతో ఆదివాసీల సాంప్రదాయ జీవన పరిస్థితిని అతలాకుతలం చేసింది. వారిలో తిరుగుబాటు ఆలోచనలకు కారణమైంది. ఆదివాసీ గూడేలన్నింటినీ పర్యటించి ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన అల్లూరి మన్య పోరాటానికి ఆదివాసీలను సమాయత్తం చేయనారంభించాడు. ఆదివాసీ యువకులను ఎంపిక చేసుకొని సాయుధ శిక్షణ ప్రారంభించాడు. తాను స్వయంగా విల్లును, తుపాకిని ఉపయోగించడం నేర్చుకున్నాడు.
1922 జనవరి నుండి ఆదివాసీలు వివిధ రూపాలలో తమ ధిక్కారాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి చూపించనారంభించారు. అలా మన్య తిరుగుబాటు మొదలైంది. అల్లూరి నాయకత్వ శిక్షణలో ఆగష్టు 22న 150 మంది ఆదివాసీ గెరిల్లాలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. ఇదే మన్య పోరాట తొలి ఘటనగా చరిత్రలో నిలిచి పోయింది. వెనువెంటనే కృష్ణదేవి పేట, రాజ వొమ్మంగి, దేవిపట్నం పోలీస్‌ స్టేషన్లను ముట్ట డించారు. ఈ పోరాట ఘటనల అనంతరం అన్నవరం పర్యటనకు వచ్చిన అల్లూరికి ప్రజలు జేజేలు పలికారు. మూడు సంవత్సరాల పాటు విశాఖ మన్యంలో ప్రారంభమైన పోరాటం గోదావరి మన్యం వరకూ పెద్దఎత్తున సాగింది. ఈ పోరాటాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్ర దమనకాండతో అణచివేసింది. 1924 మే7న అల్లూరి సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చి చంపారు. ఈ పోరాటం ఆనాడు అణచివేయబడినా పోరాట లక్ష్యాల సాధన కోసం ఆదివాసీలు అప్పటి నుండి ఈనాటి వరకూ అనేక ఉద్యమాలు సాగిస్తునే ఉన్నారు. ”అన్యాయమైన, చట్టవిరుద్ధమైన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల్ని పారద్రోలడం, ఆదివాసీల మౌలిక సమస్యల పరిష్కారం” లక్ష్యాలుగా మన్య పోరాటం సాగింది. ఈ రెండు మౌలిక లక్ష్యాల సాధనే మన్య విప్లవ పోరాట ధ్యేయంగా స్పష్టమవుతుంది.

మన్య పోరాట లక్ష్యాలు సాధిద్దాం
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళు అయ్యింది. కానీ దోపిడీ, పెత్తనం పోలేదు. తెల్లదొరలు పోయి నల్లదొరల పాలన వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. నేడున్న బిజెపి ప్రభుత్వం అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు మరింత చేరువై వ్యూహాత్మక భాగస్వామిగా, ఉపగ్రహంగా మారిపోయింది. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోంది. అల్లూరి మన్య విప్లవ పోరాట లక్ష్యమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం నేడు మరింతగా ముందుకు తీసుకోపోవాల్సి ఉంది. 100 సంవత్సరాల మన్య పోరాట లక్ష్యాల అమలు కోసం రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర-గోదావరి మన్యంలో పెద్ద ఎత్తున ఆదివాసీ పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు కొన్ని రక్షణలు, హక్కులు కల్పిస్తూ 5,6 షెడ్యూళ్లలో పొందుపర్చారు. షెడ్యూల్‌ ప్రాంతంలో ఎన్ని చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. 1/70 చట్టం ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర-గోదావరి మన్యంలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి. వీటిని గిరిజనేతర భూస్వాములు చట్టవిరుద్ధంగా అనుభవిస్తున్నారు. యుపిఎ-1 పాలనలో కేంద్ర ప్రభుత్వం అటవీ రక్షణ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ఆదివాసీలకు అటవీ హక్కులు కల్పించినప్పటికీ, వారి సాగు భూమికి, పోడు భూమికి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పోడు భూముల హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నాయి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. షెడ్యూల్‌ ప్రాంతంలో చట్టాలు వున్నప్పటికీ మైదాన ప్రాంత కాంట్రాక్టర్లు, పాలకపక్ష నేతలు యథేచ్ఛగా గనులు తవ్వి వందల కోట్లు ఆర్జిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రధానంగా ఆదివాసీ కుటుంబాలే భూమిని, ఊరును, ఉపాధిని కోల్పోతున్నాయి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా వారికి న్యాయమైన నష్టపరిహారం ఇవ్వడం లేదు. పునరావాసం ఊసే లేదు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు కనక ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కాని కేంద్ర బిజెపి సర్కారు డ్యాం నిర్మాణానికి (కాంట్రాక్టర్లకు) నిధులు ఇస్తాం కాని పునరావాసం బాధ్యత తమది కాదన్నట్లు వ్యవహరిస్తోంది. టిడిపి, వైసిపి కూడా అందుకు తలూపుతున్న పరిస్థితి. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం ప్రజలపైన సెస్‌ విధిస్తామని, అదీ చాలకపోతలే క్రౌడ్‌ ఫండింగ్‌ (బిచ్చమెత్తి) సేకరిస్తామని చెప్పడం కేంద్రానికి లొంగుబాటు, నిర్వాసితులను గాలికొదిలెయ్యడమే!
షెడ్యూల్‌ ప్రాంతంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు లేవు. షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీల ఉద్యోగాలకు జీవో నెం:3 రక్షణగా ఉండేది. దానిని సుప్రీం కోర్టు కొట్టివేసినా పునరుద్ధరణకు అటు కేంద్రం లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు లేవు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనేక ఆదివాసీ వ్యతిరేక చర్యలు చేపట్టి ఆదివాసీల అస్థిత్వానికే ప్రమాదం తెచ్చిపెడుతోంది. ఆదివాసీ చట్టాలను సవరించి, రద్దు పర్చి తీవ్ర అన్యాయం చేస్తోంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌ అనుబంధ మతోన్మాద సంస్థలు రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరాంధ్ర-గోదావరి జిల్లాల అటవీ ప్రాంతంలో మతోన్మాద ప్రచారం సాగిస్తున్నాయి. తెగల మధ్య అనైక్యతను పెంచే కుట్రలు చేస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రాంతంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించనేలేదు. షెడ్యూల్‌ ప్రాంత చట్టాలను అమలు చేయడం లేదు. షెడ్యూల్‌ ప్రాంతంలో పంచాయతీలకు పీసా చట్టం ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు. షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనేతర భూస్వాముల, వ్యాపారుల, కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్నాయి. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నాయి.
కనుక ఆనాటి మన్య విప్లవ లక్ష్యాలే ఈనాటికీి ఆదివాసీల ఉద్యమ లక్ష్యాలుగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ లక్ష్యాల సాధన కోసం ఉద్యమం పెద్ద ఎత్తున సాగాల్సి వుంది.

 వ్యాసకర్త సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

➡️