మానిఫెస్టోలో మోడీ ”మిస్సింగ్‌ ”

May 1,2024 02:05 #BJP manifesto, #JanaSena, #modi, #TDP
  •  2014లో ముగ్గురి ఫోటోలు
  •  ఇప్పుడు చంద్రబాబు, పవన్‌లవే

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమి విడుదల చేసిన మానిఫెస్టోలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బొమ్మ కనపడకపోవడం రాజకీయాల్లో వర్గాల్లో చర్చంశనీయంగా మారింది. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలే కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో విడుదల చేసిన మానిఫెస్టోలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అప్పటి బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను ముద్రించారు. ప్రస్తుతం విడుదల చేసిన మానిఫెస్టోలో చంద్రబాబు, పవన్‌ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. బిజెపి జాతీయ స్థాయిలో మానిఫెస్టో విడుదల చేసిందని, కాబట్టి ఇది తమ రెండు పార్టీలదేనని చంద్రబాబు అన్నారు. తమ మానిఫెస్టోకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. సోమవారం రాత్రే మానిఫెస్టోను పూర్తిచేసిన కూటమి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మానిఫెస్టో విడుదల చేస్తామని మీడియాకు చెప్పారు. చంద్రబాబు ఇంటికి ఉదయం 11.30 గంటలకు పవన్‌, బిజెపి ఎన్నికల రాష్ట్ర సహాఇన్‌చార్జి సిద్థార్ధనాథ్‌ సింగ్‌ చేరుకున్నారు. అయితే ముందుగా రూపొందించిన మానిఫెస్టోపై ముగ్గురు నేతలు సుమారు 3 గంటలు తీవ్ర కసరత్తు చేశారు. అనంతరం విలేకరుల వద్దకు వచ్చిన ముగ్గురు నేతలు విడుదల చేశారు. అయితే సిద్ధార్ధ సింగ్‌ మానిఫెస్టోను కనీసం పట్టుకోలేదు. మీడియా కోసం పట్టుకోవాలని చెప్పినా ఆయన తిరస్కరించారు. దీంతో చర్చల్లో ఏం జరిగిందోననే ఆసక్తి నెలకొంది.
ప్రధాని మోడీ ఫోటో లేక పోవడం వ్యూహాత్మకమా? లేదా మైనార్టీ ఓట్ల కోసమే అలా చేశారా అనే చర్చ జరుగుతోంది. లేక కేంద్రం నుంచి తమ ఫోటోలు మేనిఫెస్టోలో పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలందాయా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పథకాలకు ప్రధాని మోడీ పేరు, బొమ్మలేదని కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనల నేపథ్యంలో పలు మార్లు ప్రశ్నించిన బిజెపి నేతలు , కీలకమైన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాని మోడీ ఫోటో లేకుండా విడుదల చేయడం దేనిని సూచిస్తుంది?. మోడీ ఫోటోతో మేనిఫెస్టో విడుదల చేస్తే ప్రత్యేకహోదా, రాజధానికి పూర్తి స్ధాయిలో నిధులు కేటాయించడం, పోలవరం పూర్తి చేయడంతో పాటు విశాఖ ఉక్కును ప్రైవేటుకు కట్టబెట్టమని నిర్ధిష్టమైన హామీలివ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా సిఎఎ (సిటిజన్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌) అమలుతో ముస్లిం మైనార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. అదే విధంగా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీని ఇవ్వక పోతే మైనార్టీ ఓట్లు ఎన్‌డిఎ కూటమికి బదిలీ అయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో ఇప్పటికే మైనార్టీల్లో కొంత మేర అభద్రత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో బిజెపి ఆనవాళ్లు లేకుండా టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదన కూడా వినబడుతోంది.

➡️