కీలకాంశాలపై మౌనం

May 7,2024 00:46 #2024 election, #meating, #PM Modi
  • హోదా, విభజన హామీలపై నోరు విప్పని మోడీ
  • విశాఖ ఉక్కుపైనా అదే తీరు
  • జగన్‌ పేరు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
  •  సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లని టిడిపి, జనసేన అధినేతలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం, అనకాపల్లి ప్రతినిధులు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్ర ప్రజలకు నిరాశనే మిగిల్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ వేమగిరిలోనూ, అనకాపల్లి జిల్లా కశింకోట మండలం ఉగ్గినపాలెంలోనూ నిర్వహించిన రెండు సభల్లోనూ ఆయన రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై మౌనం దాల్చారు. ఇటీవల జరిగిన చిలకలూరిపేట సభలో ప్రధాని ప్రత్యేకహాదా, విభజనహామీలు, విశాఖ ఉక్కు, అమరావతి అభివృద్ధి అంశాలను ప్రస్తావించని సంగతి తెలిసిందే. ఈ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రధాని తీరులో ఇసుమంత కూడా మార్పురాలేదు.
తాజా సభల్లోనూ ఆ అంశాలనన్నింటిని ఆయన విస్మరించారు ప్రత్యేకహోదాతో పాటువిభజన చట్టంలోని హామీలను నెరవేర్చే విషయమై ఆయన రాష్ట్ర ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంగా మారిన విశాఖ ఉక్కు అంశాన్ని కూడా మోడీ పట్టించుకోలేదు. సంవత్సరాల తరబడి ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళన తనకు తెలియనట్టుగా ఆయన వ్యవహరించారు. రెండుచోట్ల సుదీర్ఘ ఉపన్యాసాలు చేసిన మోడీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మూడు రాజధానుల పేరుతో మోసం చేసిందని చెప్పారు. అయితే, అమరావతి అభివృద్థిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో ప్రధాని వ్యూహాత్మకంగానే జగన్‌ పేరును ప్రస్తావించకపోవడంతో పాటు, రాజధాని అంశంపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. సభల్లో పాల్గొన్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు ప్రత్యేకహోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు అంశాలను తమ ప్రసంగాల్లో ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. మోడీని పొగడడానికి, జగన్‌ను విమర్శించడానికి మాత్రమే వారు పరిమితమైనారు.

ప్రధాని ఏం చెప్పారు…?
రెండు సభల్లోనూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని రాజకీయ అవినీతిని అరికట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. దోచుకున్న వారి నుంచే సొమ్ములను వసూలు చేస్తామన్నారు. ఎపిలో ఇసుక, మద్యం మాఫియా కోరలు చాస్తోందని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మోడీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్‌ విశ్వాసం ఉన్నాయన్నారు. అవినీతిని అరికట్టడానికి తాము ప్రయత్నిస్తుంటే ఇండియా ఫోరమ్‌ నాయకులు ఇడి, ఇడి అంటూ కేకలు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికడతామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఇలా..
ముఖ్యమంత్రి జగన్‌ పేరు ప్రస్తావించకుండా మోడీ వైసిపి పాలనలో రాష్ట్రం అవినీతి, అక్రమాల్లో ముందుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం  ముందుకు తీసుకువెళ్లలేకపోయిందన్నారు. విశాఖ రైల్వే జోన్‌ను మంజూరు చేసినా కార్యాలయానికి వైసిపి ప్రభుత్వం భూమి ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు ఇచ్చిన 21 లక్షల ఇళ్లలో సగం కూడా పూర్తి చేయలేదన్నారు. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ‘ఆయన వారసుడు’ పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఉగ్గినపాలెం సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్‌సిపైనా, రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపైనా చేస్తామన్నారు.
వేమగిరి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కేంద్ర పథకాలకు వైసిపి సర్కారు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేంద్రంలో ఎన్‌డిఎ సహకారంతో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఆలస్యంగా ప్రసంగం
వేమగిరి సభకు మధ్యాహ్నం రెండు గంటల వరకూ జనం రాకపోవడంతో సభా ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో, షెడ్యూల్‌ ప్రకారం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రధాని ప్రసంగం గంట ఆలస్యంగా నాలుగు గంటలకు మొదలైంది. భద్రతా కారణాల రీత్యా వాటర్‌ బాటిళ్లను కూడా సభా ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో, సభకు వచ్చిన వారు తాగునీటి కోసం అల్లాడారు.

➡️