స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రతపై ఇసి ఫోకస్‌

  • మూడంచెల భద్రతతో కట్టుదిట్టం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, ఎచ్చెర్ల,ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఇవిఎమ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్‌ భద్రతపై ఎన్నికల కమిషన్‌ ఫోకస్‌ పెట్టింది. తిరుపతి, పల్నాడు, మాచర్ల, గురజాల,నరసరావుపేట, తాడిపత్రిలో చోటుచేసుకున్న సంఘటనలో నేపథ్యంలో ఇసి అప్రమత్తమైంది. మరోవైపు ప్రతిపక్షం నుండి కూడా ఇసికి ఫిర్యాదులు అందుతున్నాయి నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్స్‌ పక్కనే ఉన్న సెమినార్‌ హాల్‌లో భారీ సంఖ్యలో పోలీస్‌ సిబ్బందితో సిఎం సెక్యూరిటీ ఆఫీసరు అట్టాడ బాబ్జీ నేతృత్వంలో జరిగిన సభ వివాదామైంది. ఈ సభలో సిద్ధం పోస్టర్‌ను ప్రదర్శించారని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రతను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రధాన ధ్వారం వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర బలగాలు గార్డు డ్యూటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వీరితో పాటు జిల్లా ఆర్డ్మ్‌ పోలీస్‌ గార్డు, సివిల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించే విధంగా ఇసి చర్యలు చేపట్టింది. అనధికార వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్‌ రూమ్స్‌లు ఉన్న ప్రాంతానికి అనుమతించరాదని ఎన్నికల కమిషన్‌ సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్వయంగా జిల్లాలు తిరుగుతూ స్రాంగ్‌ రూమ్‌ల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

శ్రీకాకుళం, విశాఖలో స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన ముకేశ్‌ కుమార్‌
ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శ్రీకాకుళం పార్లమెంట్‌, ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌లను, ఎయు ఇంజినీరింగ్‌ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఇవిఎం స్ట్రాంగ్‌ రూమ్‌లను శనివారం ఆయన పరిశీలించారు. తలుపులకు వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు. అన్ని చోట్లా సిసి కెమెరాలు ఉన్నాయా ? లేదా ?, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా ? అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముకేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమా అన్సారియా, టెక్కలి రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, ఆయా నియోజకవర్గాల ఆర్‌ఒలు, తదితరులు పాల్గొన్నారు.

➡️