మేడ మీద మేలైన సాగు

Apr 29,2024 04:15 #Jeevana Stories

చాలామంది తమ ఇంటి మిద్దెలను సాయంత్రపు చల్లగాలికో, వేసవి రాత్రి పడక సీనుకో, వడియాల ఆరవేతకో వేదికలుగా ఉపయోగిస్తారు. కొంతమంది వాటిని కూరగాయల సాగు కేంద్రాలుగా, పండ్ల చెట్ల పెంపకం స్థావరాలుగా మార్చేస్తున్నారు. గొప్ప ఫలితాలు సాధించి, మిద్దెతోటల విస్తరణకు పచ్చ తోరణాలు రెపరెపలాడిస్తున్నారు. భువనేశ్వర్‌లో నివసిస్తున్న జయంతి సాహూ ఆకుకూరలు, కూరగాయలను మాత్రమే కాదు; 17 రకాల పండ్లచెట్లనూ పెంచుతున్నారు. ఆయా కాలాలకు తగ్గట్టుగా ఫలాలనూ అందుకుంటున్నారు.

మొక్కలను పెంచటం ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం. మానసికంగా, శారీరకంగా ఆనందాన్నిచ్చే దినచర్య. చిన్న చిన్న తొట్టెల్లో పూలమొక్కలను పెంచటం ఒకప్పటి పద్ధతి. అంతకన్నా కాస్త పెద్ద తొట్టెల్లో పండ్ల తోటలనే సాగు చేయొచ్చన్నది ఇప్పటి ఆచరణ. జయంతికి చిన్నప్పటినుంచి మొక్కలు పెంచటం అంటే ఇష్టం. తమ ఇంటి వద్ద కొంత భాగంలో తండ్రి కూరగాయల మొక్కలూ, పాదులూ పెంచేవాడు. వాటికి నీళ్లు పోయడం, ఎరువులు వేయడం వంటి పనులు జయంతి చేసేది. మొక్కలు మొగ్గలు తొడిగి, పూలుగా వికసించి, పిందెలుగా మారి, కాయలుగా ఎదుగుతూ ఉంటే- చూడటానికి చాలా ఆనందంగా ఉండేది. ఆ మొక్కల వరుసలోనే పూలమొక్కలు నాటాలని, అవి అందంగా వికసిస్తే చూడాలని తపన పడేది. ఆమె తండ్రి ఏమో కూరగాయల మొక్కల సాగుకే ప్రాధాన్యం ఇచ్చేవాడు. జయంతి కొంచెం పెద్దయ్యాక సొంతంగా గులాబి, ఇతర పూలమొక్కలను పెంచింది. అవి పూసి, అందంగా వికసించినప్పుడు ఇంటిల్లిపాదీ చాలా సంతోషించారు. ఇంటికి ఎవరైనా బంధుమిత్రులు వస్తే ఆమె తండ్రి ఆ పూలమొక్కలను చూపించి, ‘ఇది మా అమ్మాయి తోట’ అని ఆనందంగా చెప్పేవాడు. అప్పటి ఉత్సాహాన్ని జయంతి ఇప్పటికీ మరచిపోలేదు. పుట్టినింట మొగ్గ తొడిగిన ఇష్టమే ఇప్పుడు వందలాది మొక్కలను పెంచటానికి ప్రేరణగా ఉందని ఆమె చెబుతారు.

”1989లో నేను బిఎస్సీ డిగ్రీ పూర్తి చేశాను. ఆ కొద్దిరోజులకే వివాహం జరిగి, భువనేశ్వర్‌లోని అత్తారింటికి చేరాను. అక్కడా రకరకాల మొక్కలు పెంచటం ఒక అలవాటుగా కొనసాగించాను. ఒకసారి మేము పుష్ప, ఫల మొక్కల ప్రదర్శన చూట్టానికి వెళ్లాం. అక్కడ ఒక మాదిరి తొట్టెల్లో ఉన్న పండ్ల మొక్కలను చూసి, ఆశ్చర్యపోయాను. పొలాల్లో, నేలలో పెద్ద పెద్దగా ఉండే పండ్ల చెట్లను ఇలా కూడా సాగు చేయొచ్చని అప్పుడే ప్రత్యక్షంగా చూశాను. ఆ తరువాత మా మిద్దె మీదికి పండ్లమొక్కలు వచ్చి చేరాయి.” అని చెప్పారు జయంతి.
ఇంటి మిద్దె మీద 350 చదరపు అడుగులతో సహా ఇంటి చుట్టూ ఎక్కడ వీలైతే అక్కడ రకరకాల మొక్కలు పెంచుతున్నారు జయంతి. మొత్తం 1500 చదరపు గజాల స్థలంలో ఆమె సాగు చేస్తున్నారు. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు ఇంట్లోనే పండిస్తున్నారు. బజారుకు వెళ్లి కొనాల్సిన అవసరం లేదు. కాస్త ఎక్కువగా పండినప్పుడే ఆమెనే ‘మా ఇంటి పంట’ అంటూ బంధుమిత్రులకు అందిస్తున్నారు. వంగ, బెండ, దొండ, కాకర, సొరకాయ, బంగాళాదుంప, చిలగడ దుంప, క్యారెట్‌, బీట్‌రూట్‌, బచ్చలి, తోటకూర, పాలకూర, కరివేప … ఇలా మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో అవన్నీ జయంతి ఇంట్లోనే పండిస్తున్నారు.
ఇప్పుడు పండ్ల చెట్లు కూడా ఆ మిద్దెతోటను ఒక చిట్టడవిలా మార్చేశాయి. బప్పాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోటా, జామ, నారింజ, స్టార్‌ ఫ్రూట్‌, వాటర్‌ ఆపిల్‌, యాపిల్‌ బేర్‌ … ఇలా 17 రకాల పండ్ల చెట్లు కొద్ది సంవత్సరాలుగా ఫలాలనిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇంటిని సందర్శించటం అంటే ఒక ఉద్యానవనాన్ని దర్శించటమే! అలా చూస్తూ చూస్తూ చెట్టునే పండిన ఏదొక తాజా ఫలాన్ని రుచి చూడొచ్చు కూడా! ఇప్పుడు ఇతర చెట్లతో పాటు మామిడి విరగగాచి ఉంది. ఇంకొద్ది రోజుల్లో కోతకు రావొచ్చు. ఆ రోజు కోసం జయంతి ఆశగా ఎదురుచూస్తున్నారు.

మిద్దెతోటతో ఆరోగ్యం, ఆనందం
ఇలా మనమే స్వయంగా సాగు చేసుకోవటం వల్ల చాలా ఆనందం ఉంది. సేంద్రియ ఎరువులతో పండించుకోవటం వల్ల చాలా ఆరోగ్యం కూడా. నిజానికి ఓపిక, తీరిక ఉంటే ఇది గొప్ప ఆహ్లాదాన్ని ఇచ్చే పని. మొక్కలను పసిపాపల్లా చూసుకోవాలి. అవి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మన కళ్ల ముందే ఎదిగిన మొక్కలు మనకు ఫలాలను ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి మానసిక తృప్తితోనే మిద్దెతోటను దాదాపు 30 ఏళ్ల నుంచి సాగుచేస్తున్నాను.
– జయంతి సాహూ

మిద్దె సాగుకు ఎనిమిది సూత్రాలు
మిద్దెలపై సాగు ఎలా చేయాలో జయంతి తన అనుభవంలో గ్రహించిన 8 విలువైన సూత్రాలను వివరించారు. అవి :
1. మొక్కలకు నీరు పోయటం ఎంత అవసరమో, ఆ నీరు నిల్వ ఉండకుండా చేయటమూ అంతే ముఖ్యం. కాబట్టి, నీరు సక్రమంగా పంపిణీ అయ్యే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.
2. తొట్టెలకు ఎక్కువ ఖర్చు పెట్టద్దు. నేను చేపల నిల్వకు ఉపయోగించే బాక్సులు పాతవి కొన్నాను. 20 ఏళ్ల నుంచి పాడవకుండా నాణ్యంగా ఉన్నాయి. ఆ తరహా వృథా తొట్టెలు మీకూ దొరకొచ్చు.
3. అంటు కట్టిన మొక్కలను, వేగంగా కాపునకు వచ్చే మొక్కలను ఎంచుకొండి.
4. మొక్క నాటటానికి వీలైన సారవంతమైన మట్టి తయారీ అన్నిటికన్నా ముఖ్యం. 30 శాతం సారవంతమైన మట్టి, 30 శాతం కంపోస్టు, 30 శాతం కోక్‌పిట్‌, 5 శాతం వేపపిండి, 5 శాతం బోన్‌మిల్‌ కలిపి, మట్టిని సిద్ధం చేయాలి.
5. మొక్క పెరుగుతున్న క్రమంలో పోషకాలతో కూడిన ద్రవ ఎరువులు అందించాలి. కిలో ఆవాలు, పావు కిలో వేపపిండి ఐదు లీటర్ల నీటితో కలిపి, ఐదు రోజుల పాటు నీడలో ఉంచి, తరువాత ద్రవ ఎరువుగా వాడొచ్చు.
6. తెగుళ్లను, హాని చేసే క్రిమికీటకాలను ఆదిలోనే గమనించాలి. తెగులు సోకిన ఆకులు తదితర భాగాలను వేరు చేసి, దూరంగా పారేయాలి. ప్రతి మొక్కనూ ప్రతి పూటా జాగ్రత్తగా గమనించి, తగిన సహకారం అందించాలి.
7. పండ్ల మొక్కలు మంచి దిగుబడి ఇవ్వటానికి ఏడాదికి ఒకటి రెండు సార్లు కాపు లేని సమయంలో కొమ్మలను కత్తిరించాలి.
8. రెండు మూడేళ్లకు ఒకసారి వేరు భాగంలో తవ్వి, మట్టి పొరని మార్చాలి. సారం పెంచే పోషకాలను అందివ్వాలి.

➡️