Bangalore : రేవ్‌ పార్టీ కలకలం

  •  తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు?
  •  పోలీసుల అదుపులో 100 మంది
  • కాకాణి స్టిక్కర్‌తో కారు!
  • సంబంధం లేదన్న మంత్రి

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : బెంగళూరులో జరిగిన ఒక రేవ్‌ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, వారి కుటుంబాలకు చెందిన వారు ఉండటమే దీనికి కారణం. అధికారికంగా పేర్లు వెల్లడించకపోవడంతో పోలీసుల అదుపులో ఉన్నారంటూ పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. రేవ్‌పార్టీ వద్ద రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌ స్టిక్కర్‌ తో ఉన్న ఒక కారు దొరికినట్లు ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారమైంది. దీనిని ఆయన ఖండించారు. ఆ కారుతో తనకు సంబంధంలేదని, స్టిక్కర్‌ అసలైనదా, కాదా అన్నది పోలీసులు తేలుస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ వాహనంలో ఒక పాస్‌పోర్టు కూడా దొరికిందని చెబుతున్నారు. ఆ పాస్‌పోర్లు ఎవరిదన్న విషయాన్ని పోలీసులు ప్రకటించలేదు.

ఏం జరిగింది?
బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి ఒక బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్‌పార్టీని నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. పార్టీ తెల్లవారుజామున మూడు వరకు కొనసాగడంతో బెంగళూరు నగర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పక్కా వ్యూహం ప్రకారం దాడి చేశారు. బృందాలుగా విడిపోయి జరిపిన దాడిలో మద్యంతో పాటు, పెద్దఎత్తున డ్రగ్స్‌, కొకైన్‌ , ఎండిఎంఎ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీ ని నిర్వహించారని, హైదరాబాద్‌ కాన్‌కార్డు సంస్థ గోపాల్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. మొత్తం వందమందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిలో 25 మంది యువతులున్నారు.

విమానంలో తరలింపు
ఈ పార్టీ కోసం యువతీయవకులను విమానంలో తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. హాజరైన వారిలో పలువురు ఖరీదైన కార్లలో వచ్చారు.సంఘటన స్థలంలో 15 విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హేమ… శ్రీకాంత్‌ ఉన్నారా…?
ఈ పార్టీలో సినీ నటి హేమ ఉన్నట్లు మీడియాలో ప్రసారమైంది. దీనిని ఆమె ఖండించారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అయితే, ఈ వీడియో విడుదలైన కాసేపటికే హేమ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం. ఇదే విధమైన ప్రచారం శ్రీకాంత్‌పై కూడా జరిగింది. ఆయన కూడా దీనిని ఖండించారు. తానెప్పుడు అటువంటి పార్టీలకు వెళ్లలేదని, ఆ సంస్కృతి తనది కాదని పేర్కొన్నారు. జానీ మాస్టర్‌ పై కూడా ఇటువంటి ప్రచారమే జరగ్గా ఆయన కూడా ఖండించారు.

➡️