‘వాన’జల్లు.. ఊరడిల్లు..!

May 3,2024 01:23 #heavy rains
  •  మండు వేసవిలో కురిసింది వాన
  •  ఉక్కబోత నుంచి ఊపిరి పీల్చుకున్న జనం
  •  చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్లు

ప్రజాశక్తి – రామచంద్రాపురం, తవణంపల్లి, రామకుప్పం : మండు వేసవి.. ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుకుంది. రికార్డులను బద్దలు కొడుతోందన్న వార్తలు.. భరించలేని ఉక్కపోత.. వడగాలులు.. రోడ్డుపై నడవలేని పరిస్థితి.. అలాగని ఇంట్లోనూ ఉక్కపోత భయంకరం.. ‘వర్షసూచన’ జిల్లాకు ఇన్నాళ్లూ లేకపోవడంతో జనం బెంబేలెత్తిపోయారు.. వాన కోసం ఎదురు చూశారు. ఈ తరుణంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో పిల్లలు వానా వానా వల్లప్ప.. అంటూ రోడ్లపై చిందులేశారు. తొలకరి జల్లుగా ప్రారంభమై ఓ మోస్తరుగా కురిసింది. ఎండ తీవ్రతలో కొంతమేర ఉపశమనం లభించింది. బంగారుపాళ్యం మండలంలోనూ గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. వేసవి తాపానికి ఉపశమనం కలిగిందని జనం ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులకు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. అరటిచెట్లు నేలకూలాయి. తవణంపల్లిలో చింతచెట్టు మాను రోడ్డుపై పడి కొంతసేపు వాహనాలకు అంతరాయం కలిగింది. వడగళ్ల వాన మామిడిపంటను ఇబ్బందులకు గురిచసింది.
తవణంపల్లి మండలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి చిత్తూరు అరగొండ ప్రధాన రహదారి రోడ్డు మార్గాన ముత్తరపల్లి క్రాస్‌ రోడ్డు పక్కన భారీ చింతచెట్టు కూలి విద్యుత్‌ తీగలపై పడి రోడ్డు మీద అడ్డంగా పడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకొని వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్‌ కార్యాలయ సిబ్బందికి ఫోను ద్వారా తెలిపారు. వెంటనే సిబ్బంది కరెంటు తీగలను తొలగించారు. చింతచెట్టు మాను రోడ్డుపైనే ఉండడంతో వాహన ప్రయాణికులు ఒకింత ఇబ్బంది పడ్డారు.
రామకుప్పంలో ఈదురుగాలుల వర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. వ్యవసాయ పంటలను పెనుగాలుల బీభత్సం వల్ల లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. లింగాపురం, సాగినేకుప్పం, గోరివిమాకులపల్లి తదితర పరిసరాల్లో ఈదురుగాలుల వల్ల అరటి తోటలు నేల కూలాయి. వడగండ్లు వల్ల అరకొరగా కాసిన మామిడి కాయలు నేలరాలి, దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బగల నతం గ్రామంలో రామచంద్ర రెడ్డి కి చెందిన ఇంటి పైకప్పు కు వేసిన సిమెంట్‌ రేకులు పెనుగాలులకు ఎగిరి పడ్డాయి.
తిరుమలలో గురువారం కురిసిన వాన తీవ్ర వేడిని తగ్గించింది. అడపాదడపా మెరుపులు, ఉరుములతో దాదాపు 30 నిమిషాల పాటు వర్షం కురుస్తుండగా, కొండలు మొత్తం మబ్బులతో కూడిన ఆకాశంతో చల్లగా మారాయి. వేడిగాలులు వీస్తున్న యాత్రికులు వాతావరణం చల్లగా మారడంతో సంతోషం వ్యక్తం చేశారు. కొండల దిగువన కూడా పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తిరుపతిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పెరగడం గమనార్హం. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సమయంలో వర్షాలు అధిక ఉష్ణోగ్రత నుండి చాలా ఉపశమనం ప్రజలకు అందింది.

➡️