రేపు మీ ఆఫీస్‌కు వస్తాం జైల్లో పెట్టండి.. : బిజెపిపై కేజ్రీవాల్‌ ఆగ్రహం

May 19,2024 08:40 #Arvind Kejriwal, #delhi cm

న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేతలను అణగతొక్కేయడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. బిజెపి బెదిరింపులకు ఆమ్‌ ఆద్మీ పార్టీ లొంగకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు, ఢిల్లీ మాజీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో తన పిఎ బిబవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసిన అనంతరం కేజ్రీవాల్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ముఖ్య నేతలందరినీ తీసుకుని ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయానికి వస్తానని, అక్కడ మీకు కావాల్సిన వాళ్లను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టవచ్చని కేజ్రీవాల్‌ సవాల్‌ చేశారు. బిజెపి ఇప్పటికే మనీశ్‌ సిసోడియాను, సంజరు సింగ్‌ను జైల్లో పెట్టిందని, ఇప్పుడు తన పిఎను కూడా అరెస్ట్‌ చేసిందని ఆయన అన్నారు. రాఘవ్‌ చద్దా లండన్‌ నుంచి వస్తున్నాడని వాళ్లే చెబుతున్నారని, తనను కూడా వీళ్లు జైల్లో పెడతారని చెప్పారు. ఆప్‌ నేతలు సౌరభ్‌ భరద్వాజ్‌ను, అతిషిని కూడా జైల్లో పెడతామని చెబుతున్నారని కేజ్రీవాల్‌ వెల్లడించారు. కేంద్రం ఇలా తమ వెంట పడుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘బిజెపి చేయలేని విధంగా ఢిల్లీలో నాణ్యమైన విద్యను అందించడమే మేం చేసిన తప్పు. నగర పౌరుల కోసం మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేసి మంచి వైద్యం, మందులు అందించడమే మేం చేసిన తప్పు. బిజెపి అలా చేయలేదు. అందుకే మొహల్లా క్లినిక్‌లను బంద్‌ చేయాలని చూస్తోంది’ అని కేజ్రీవాల్‌ విమర్శించారు.
స్వాతి చెప్పేవన్నీ అసత్యాలే.. : అతిషి
స్వాతిమలివాల్‌ తనపై జరిగిన దాడి కేసులో చెప్పేవన్నీ అసత్యాలేనని ఆప్‌ మంత్రి అతిషి అన్నారు. స్వాతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకోవడానికే స్వాతి బిజెపితో కుమ్మక్కై బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారని అతిషి మండిపడ్డారు. కేజ్రీవాల్‌ ఇంట్లో రికార్డయిన సిసిటివి ఫుటేజ్‌ వీడియోను శనివారం ఆప్‌ బయటపెట్టింది. ఈ వీడియోపై ఆప్‌ మంత్రి అతిషి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సిసి టివి ఫుటేజీ ప్రకారం.. స్వాతి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా ఆమెనే పోలీసుల్ని బెదిరించడం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్‌ కుమార్‌ని సైతం ఆమె తీవ్రంగా దూషించారు. కేజ్రీవాల్‌ నివాసం నుంచి ఆమె బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది.’ అని తెలిపారు.

➡️