కోడ్‌ కూసింది!

Mar 19,2024 06:05 #election code, #sahityam

ఎట్టకేలకు దేశమంతా
ఎన్నికల కోడ్‌ కూసింది..!
ప్రారంభాలు ఆగి పోయాయి
పాలకులకు పవర్‌ కట్‌ అయింది
విగ్రహాలకు ముసుగులు పడ్డాయి
నిగ్రహాలు లేని నేతలు స్వగహాలు వీడుతున్నారు..!

కోట్లను ఇచ్చి సీట్లు తెచ్చుకుంటున్నారు
గెలుపు కోసం గంపెడు కలలు కంటున్నారు
ఏసీ కార్లలో పయనించిన నేతలు
ఎర్రటి ఎండలో పరుగులు తీస్తున్నారు
ఉచితాలతో జనతను ఊరిస్తున్నారు
తాయిలాలను చాటుగా అందిస్తున్నారు.!

చిరకాల శత్రువుతోనైనా చేతులు కలుపుతున్నారు
గడప గడపలోన కుడి కాలు పెడుతూ
దండాలు పెడుతున్నారు మందహాసాలతో..!

ఉదయం నుంచి అర్థ రాత్రి వరకూ
రాజకీయ నేతల రణగొణ ప్రచార యాత్ర
వాడ వాడలో మొదలయ్యేను ఎన్నికల జాతర
సీట్లు వచ్చిన వారికి అసమ్మతి కుంపట్లు
బీఫారాలు దక్కని నేతలు బైఠాయింపులు
అయిదేళ్ళ కొకసారి వచ్చిన ఈ ఎన్నికలలో
రహస్య బూత్‌ లలో పవిత్ర మైన ఓట్లు వేసి
నేతల జాతకాలను తిరగ రాస్తారు ప్రజలు..!?

జి.సూర్యనారాయణ,
6281725659.

➡️