పదిహేనేళ్ళ ప్రరవే ప్రయాణం

Feb 5,2024 08:55 #sahityam

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఏర్పడి పదిహేనేళ్ళు. అంతకు ముందు ‘మనలో మనం’ ఏడాది ప్రయత్నంతో కలిపి పదహారేళ్లు. 2024 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ‘స్త్రీలపై ట్రోలింగ్‌’ అంశంగా ఖమ్మంలో ఏడవ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సమాజ చలనంలో ప్రరవే నిర్వహించిన పాత్ర గురించి కొంతమంది రచయిత్రుల అభిప్రాయాలూ సూచనలూ ఇవీ …

గ్రామీణ స్త్రీలని చైతన్య పరచాలి

ప్రరవే కలెక్టివ్‌గా చేసే పని తీరు బాగుంటుంది. గత ఏడాది జూమ్‌ ద్వారా నిర్వహించిన 35 వారాల ప్రపంచ ఫెమినిస్ట్‌ రచయిత్రులపై ధారావాహిక ప్రసంగాల పరంపర ఎంతో ఉపయోగపడేదిగా ఉంది. ఇలాంటివి పాఠ్యాంశాల్లో చేర్చాలని మనం డిమాండ్‌ చేయాలి. స్త్రీలపై జరిగే అత్యాచారాలు, హింస ఇలాంటి అంశాలపై పబ్లిక్‌ మీటింగులు ఎక్కువగా జరగాలి. ఎలిమెంటరీ పాఠశాలల నుంచి కళాశాలల వరకు బాలికలను చైతన్య పరచాలి. గ్రామీణ స్త్రీలకు లోకజ్ఞానం తక్కువగా ఉండి అనేక బాధలు, కష్టాలు పడ్తుంటారు. వారిని చైతన్యపరిచే దిశగా అడుగులు వేయాలి.

                                                                                                                                                – డా. బి.విజయభారతి

ప్రతిఘటన నేటి అవసరం

ఇది పదిహేనేళ్లగా నిర్మాణాత్మకంగా నిబద్ధతతో పనిచేస్తున్న వేదిక. ఏడవ మహాసభల్లో సామాజిక మాధ్యమాల్లో స్త్రీలపై జరుగుతున్న అమానవీయ దాడుల గురించి మాట్లాడతారు. ఈ దాడులు సామాజిక అలజడికి కారణమవుతున్నాయి. దాన్ని కలంతో గళంతో ఎదుర్కోవడం నేటి అవసరం.                                                                                                                                – డా. ముదిగంటి సుజాత రెడ్డి

 

వీలైనంత మందిని కలుపుకుంటూ …

నేను అయిదారుసార్లు ప్రరవే సభల్లో వేదిక పంచుకుని నా అభిప్రాయాలు వినిపించాను. మొదట్లో అన్ని ప్రాంతాల్లోనూ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను కూడా కలుపుకుంటూ సభలు జరిపిన ప్రరవే నాకు గుర్తుంది. గుంటూరులో జరిగిన అనువాదాల సదస్సులో కూడా పాల్గొన్నాను. ప్రరవే పలు అంశాలను చర్చకు పెడుతూ, సమకాలీన సమస్యలను అందరి దష్టికి తీసుకొస్తూ సభలు నిర్వహిస్తున్న తీరు ముదావహం. ఈ విధంగా పదిహేనేళ్ల ప్రరవే స్త్రీల రచనల వైపుగా చేసిన కషి ప్రశంసనీయం.    – వాడ్రేవు వీరలక్ష్మీదేవి

యాభై ఏళ్ల సభలో పాల్గొనాలని …

ఈ వేదిక ప్రయాణం అంత సులువు కాదు. మనం మననే కాదు సాటి వారిని కూడా అక్కున చేర్చుకోవాలి. మెదడుని కదిలించే ఉపన్యాసాలు ఎంతో కొంత సమాజానికి కొత్త ఆలోచనని ఇచ్చాయి. సమాజంలో నిర్మాణాత్మకమైన ప్రరవే పాత్ర మరువలేనిది. నిబద్ధత ఉన్న బలమైన నారీలోకపు కొత్త ఆలోచనలకి ఆహ్వానం పలుకున్న సంస్థకి మేలు తలపులు. యాభై ఏళ్ల సభలో పాల్గొని నా అనుభవాలు చెప్పాలని కలలు కంటాను.                                                                                                                                                                      – మన్నం సింధు మాధురి

 

తమ చూపుని నలుదిశలా సారిస్తూ …

ప్రరవే యీ సమాజంలోని అన్ని సమూహాలని కలుపుకుంటూ సాగుతున్న వొక డెమొక్రటిక్‌ ప్లేస్‌. యెప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పుల్ని, వాటితోపాటు వస్తున్న అభివృద్ధిని, సమస్యలను చర్చించి పరిష్కారాలని కనుగొనడానికి ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారి వుపన్యాసాలని, రచనల్ని అందిస్తోంది. విభిన్న అంశాలపై అందరి గొంతునీ వింటూ, వినిపిస్తూ, అన్ని తరాల సమ్మిళితమైన రచనా సంకలనాలని ప్రచురిస్తూ కొత్త రచయితలకి వుత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి అంశాన్ని తడుతూ అన్ని సమూహాల్ని, వ్యక్తులని కలుపుకుంటూ నిత్య నూతనంగా ప్రయాణిస్తోంది.               – కుప్పిలి పద్మ

 

పసిడి రెక్కల మీది బాధ్యత

ఇరవై ఏళ్ల క్రితం సాహిత్యంలో సామాజిక జీవనంలో ఒక స్తబ్దత ఏర్పడింది. ఆ సమయంలోనే ఒక కర్తవ్యాన్ని వెతుక్కుంటూ ప్రరవే ఏర్పడింది. అన్ని అస్తిత్వాలకి ఈ వేదిక ప్రాతినిధ్యం వహించలేకపోవచ్చు. కానీ, అస్తిత్వాన్ని స్థిరపరుచుకోవడానికి అవసరమైన మేధోసామగ్రిని అందిస్తున్నది. వేయి అస్తిత్వాలు వికసించాలి. వైవిధ్యం వైపు దారి తీయాలి. బహుళతకు అర్థం తెలియాలి. ప్రరవే పసిడి రెక్కల మీద ఈ బాధ్యతని మోయాలి.                                                                                                                                                                – గోపరాజు సుధ

ఇటువంటి స్పేస్‌ అవసరం

ఈ వేదిక గురించి తెలుసుకుని ఒకటిన్నర దశాబ్దమైంది. వివిధ అస్తిత్వాలకు చెందిన మహిళల అంతర్బాహిర్‌ ప్రపంచాలన్నింటిని కలుపుకు పోయే ప్రరవే ఒక జ్ఞాన భాండారం. ప్రతి ఏడూ జరిగే వార్షిక సదస్సులు, రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలు, మహిళా సాహిత్య కోణాలను విశ్లేషించడమే కాక గుర్తించాల్సిన జెండర్‌ అంశాలను హైలైట్‌ చేస్తాయి. మహిళల కొరకు, మహిళలచే సష్టించబడిన ఈ సాహితీ కూడికలో భాగమైన ప్రతిసారీ ఇటువంటి స్పేస్‌ ఆవశ్యకత అర్థమవుతుంటుంది.   – అపర్ణ తోట

ట్రోలింగ్‌పై చర్చ సాహసమే !

ఇప్పటికీ చాలామంది మహిళలు తమ ఇంట్లో కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి అననుకూల వాతావరణంలో ప్రరవే మహిళల గొంతుకైంది. ప్రతి ఏడు కొత్త అంశాలతో ముందుకొచ్చి మహిళలు ఇంటా బయటా నిర్ణయాధికారం వైపు అడుగులేసే విధంగా చైతన్య పరుస్తోంది. మహిళలను అత్యంత ఇబ్బంది పెడుతున్న ట్రోలింగ్‌ పై చర్చ లేవనెత్తడం నిజంగా పెద్ద సాహసమే. ఈ సారి నేను ఇందులో భాగమై అందరితో గొంతు కలపాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. – రూబీనా పర్వీన్‌

అభిప్రాయ సేకరణ : మానస ఎండ్లూరి

➡️