విద్యాప్రాంగణంలో అద్భుత ప్రయోగం !

Feb 19,2024 11:16 #sahityam

               12.2.2024వ తేదీ సాయంత్రం రాజమండ్రి లారెల్‌ హై గ్లోబల్‌ స్కూల్‌ ఫౌండేషన్‌ డే సందర్భంగా ఓ అద్భుత ప్రదర్శన ఆవిష్కారం అయింది. తల్లిదండ్రులు, స్కూలు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మొత్తం 900 మంది ఒకే వేదిక మీద 150 నిమిషాల నిడివి గల ‘లిబారక్‌ పూర్‌ సే లాల్‌ ఖిలాలి’ అనే రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. సాంకేతిక పరంగా ఖర్చుకు వెనకాడకుండా విశాల మైదానంలో ఆరుబయలు రంగస్థలం మీద దాదాపు 2000 మంది ప్రేక్షకుల సమక్షంలో చిరకాలం గుర్తుండిపోయే వేడుకగా ‘ఫెస్టివ్‌ థియేటర్‌’ పద్ధతిలో నిర్వహించారు. కిండర్‌ గార్డెన్‌ పసిపిల్లల నుంచి పెద్ద వయస్కుల వరకు స్వాతంత్ర సమరయోధులు, జాతీయస్థాయి నాయకులు, బ్రిటిష్‌ పాలకులతో, పాటు తెలుగు నేలకు చెందిన ఆరుగురు స్వాతంత్య్ర ఉద్యమ నాయకులకు సముచిత స్థానం కల్పించారు. ఇందులో ప్రసిద్ధమైన దేశభక్తి గీతాలు, జానపద గీతాలతో పాటు ప్రజాదరణ పొందిన హిందీ, పంజాబీ గీతాలు, అందుకు తగ్గ నృత్యాలు ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోనివ్వలేదు. 600 ఏళ్ల నాటి చారిత్రక ఘట్టాలతో తొలినాటి అజ్ఞాత స్వాతంత్య్ర పిపాస కలిగిన వ్యక్తులను ఆహార్య ఆంగిక అభినయాలతో ఆవిష్కరించి మంత్రముగ్ధులను చేశారు. ఒక దృశ్యానికి మరో దృశ్యానికి అనుసంధానం చేస్తూ ఉపాధ్యాయులు కథను నడిపించారు. ఎలాంటి అంతరాయం, ఆలస్యం లేకుండా ఎంతో క్రమశిక్షణతో ప్రదర్శన సాగింది. అన్ని వయసుల విద్యార్థులు రిహార్సల్స్‌ ద్వారా వచ్చిన క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ, తమ తమ స్థానాలకు రావడం, అక్కడి నుంచి నిష్క్రమించడం అలవోకగా జరిగిపోయాయి. ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని కలిగించే ఘట్టాల్లో ప్రతి ఒక్కరూ లీనమై మహౌజ్వల ఘట్టాలను కళ్ళ ముందు నిలబెట్టారు.

సూరత్‌లో సుగంధ ద్రవ్యాల గోదాముకు మహారాజు నుంచి అనుమతి పొంది, అందుకు బదులుగా సైనిక శిక్షణ, ఆయుధాల ఆశ చూపుతూ ఈస్టిండియా కంపెనీ కాళ్లూనుకొంది. ఆ పరంపర గురించి చెబుతూ, విక్టోరియా మహారాణి ఆధిపత్యంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి బానిస వలస రాజ్యంగా ఇండియా మారడం; రాబర్ట్‌ క్లైవ్‌ నుంచి వైస్రారు పాలన మీదుగా మౌంట్‌ బాటెన్‌, రాడ్‌ క్లిఫ్‌ వరకు; జహంగీర్‌ అక్బర్‌ పాదుషాల పాలన మీదుగా బహదూర్‌ షా జఫర్‌ వరకు; మంగళ్‌ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి, ఉయ్యాలవాడ, ఉద్దం సింగ్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ల వరకు; తిలక్‌, లాల్‌ బాల్‌ పాల్‌, వివేకానంద, అరవింద్‌ ఘోష్‌ మొదలైన వారిని ఆయా సందర్భాల్లో వేదిక మీద చూపిస్తూ, రంగస్థలాన్ని అపూర్వ చారిత్రిక క్షేత్రంగా మార్చారు. ప్రథమ సిపాయి పితూరి, జలియన్‌ వాలాబాగ్‌, దండి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా, సైమన్‌ గో బ్యాక్‌, కాకోరి, సహాయ నిరాకరణ ఉద్యమ ఘట్టాలను కళ్లకు కట్టించారు. జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం, ముస్లిం లీగ్‌, పూనా ఒప్పందం, రౌలెట్‌ చట్టం, బెంగాల్‌ విభజన, రాజ్యాంగ పరిషత్‌ సభ ఏర్పాటు, 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జాతీయ పతాక ఆవిష్కరణ, ఆపై నెహ్రూ చేసిన ప్రసంగం, విభజన అల్లర్లు, గాంధీ ఆమరణ నిరాహార దీక్ష వరకు ఘట్టాలను ప్రదర్శించారు. ఆఖరును భవిష్యత్‌ భారతంపై యువతీ యువకుల్లో కర్తవ్య పాలన దిశగా కార్యోన్ముఖులను చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌ను అగ్రగామి దేశంగా నిలబెట్టడంలో పునరంకితం కావడానికి ప్రతిజ్ఞ బూనడంతో ఈ ప్రదర్శన ముగిసింది.

ఈ ప్రదర్శనకు దర్శకుడు వాల్టర్‌ పీటర్‌. రంగస్థలం ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనేది ఆయన ఫెస్టివ్‌ డ్రామా ఆంతర్యం. గత 30 సంవత్సరాలుగా రంగస్థలానికే అంకితమై పని చేస్తున్నారు. ఇప్పటివరకు 2 లక్షల మంది పిల్లలతో, 30 వేల మంది విద్యార్థులతో, 50 వేల మంది తల్లిదండ్రులతో, 400 స్వచ్ఛంద సంస్థలతో రెండు వేల పాఠశాలల్లో ఐదు వేల శిక్షణా శిబిరాలను నిర్వహించారు. బాలికా విద్య, జాతి సమైక్యత, బాలల సంరక్షణ, సాంఘిక దురాచారాల ప్రతిఘటన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలతో ప్రదర్శనలు ఇచ్చారు. పిల్లలుగా నటన నేర్చుకుంటూ తమ గురించి తెలుసుకోవటం, ‘యువత కోసం రంగస్థలం’, థియేటర్‌ అప్రిసియేషన్‌ నేర్పటం, రంగస్థల అవసరాలు- అవకాశాలు మొదలైన వాటిని ప్రత్యక్షంగానూ, ఆన్లైన్‌ కోర్సుల ద్వారా నేర్పిస్తూ, జాతీయ అంతర్జాతీయ సమావేశాలు చర్చాగోష్ఠుల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు వాల్టర్‌ పీటర్‌. యూనిసెఫ్‌ సహకారంతో కోవిడ్‌- 19 సందర్భంలో 400 మందికి అవగాహన పెంపొందించే కార్యక్రమాలతో వారిని సమాచార వితరణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులు, గోష్ఠులు, కార్యశాలల్లో నిర్విరామంగా పాల్గొంటున్నారు. లిమ్కా భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి, వివిధ రాష్ట్రాల, జాతీయ అకాడమీల గుర్తింపు గౌరవం సన్మానాలు పొందారు. ఒక క్రిస్టియన్‌ కుటుంబం నుంచి, పాత ఢిల్లీ మురికివాడ నుంచి అహ్మదాబాద్‌ వరకు ఆయన ప్రస్థానం సాగింది. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా 1989లో ప్రారంభించిన ‘ధియేటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ విభాగంలో విద్యార్థిగా శిక్షణ పొందారు. కొన్నాళ్లు అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసి బయటకు వచ్చారు. కాశ్మీర్‌ నుంచి కేరళ వరకు నాలుగు వేలకు పైగా శిక్షణా శిబిరాలు, ఫెస్టివ్‌ థియేటర్లు నిర్వహించారు. ఎస్సీఈఆర్టీ, ఎన్సిఈఆర్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఆర్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ పద్ధతిలో విద్యా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ‘లా పో లా’ అంటే భౌతిక భాగస్వామ్యంతో పాటు ఎమోషనల్‌ పార్టిసిపేషన్‌ని ఇది ప్రోత్సహిస్తుంది. సమ వయస్కులైన పిల్లలు, యువత ఇంటరాక్షన్‌, ఇంటిగ్రేషన్‌తో అన్ని రకాల కళారూపాలను వినియోగిం చుకుంటూ, సమాజంలో మార్పు తీసుకురావడమే ‘లా పో లా’ ఆశయం. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి నటించడం వల్ల ఇద్దరి మధ్యలో అంతకుముందు లేని దగ్గరతనం, తెలుసుకోవడం, నేర్చుకోవడం సాధ్యమవుతాయి. థియేటర్‌ని క్లాస్‌ రూమ్‌గా, క్లాస్‌ రూమ్‌ని థియేటర్‌గా మార్చి నేర్చుకోవడం, ఒకే పాఠశాలలోని వేర్వేరు విద్యార్థులతో కలిసిపోవడం ఇందులోని ప్రత్యేకత.

వాల్టర్‌ పీటర్‌ని ఆహ్వానించి, సర్వం సమకూర్చి, విద్యార్థి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మూడు వారాలపాటు మమేకమయ్యే అవకాశం ఇచ్చి, ఇంత ప్రదర్శన జరపటం లారెల్‌ హై గ్లోబల్‌ డైరెక్టర్లు సుంకర రవికుమార్‌, మల్లికార్జున రావు, సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ సీఈవో, ఐఐటిఎన్‌ గురునాథరావు తదితరుల గొప్ప తనం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను మరింత చేరువ చేసిన ఈ ధియేటర్‌ ఫెస్టివల్‌ ఓ గొప్ప ప్రయోగం. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా జరిగిన ఈ కార్యక్రమం తెలుగు రంగస్థల భవిష్యత్తును ప్రభావితం చేయగలదని అనిపిస్తోంది.

– మల్లేశ్వరరావు ఆకుల79818 72655

➡️