అలరించిన ‘గదా యుద్ధ’ నాటకం

Feb 8,2024 09:59 #Arts, #Vijayawada
An entertaining 'Gada Yuddha' drama

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : గదాయుద్ధ (దుర్యోధన వధ) నాటకం విశేషంగా అలరించింది. భారత ప్రభుత్వ సాంస్కతిక శాఖ, సాంస్కతిక శాఖ అనుబంధ సంస్థ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంస్కతి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ నాటక ప్రదర్శనలలో భాగంగా రెండో రోజు బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘గదాయుద్ధ’ (దుర్యోధన వధ) యక్షగాన నాటకం ప్రదర్శించారు. కర్ణాటక రాష్ట్రం కెరెమనె ప్రాంతానికి చెందిన శ్రీ ఇడగుమ్‌ జీ మహాగణపతి యక్షగాన మండలి బందం ప్రదర్శించిన ఈ నాటకం యక్షగాన శైలిలో కన్నడ ఆలయ సంప్రదాయ నృత్యంతో శాస్త్రీయ సంగీత మేళవింపలో నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోతగా కనువిందు చేసింది. ప్రముఖ రచయిత, దర్శకుడు శివానంద హెగ్దే రచన, దర్శకత్వంలో కురుక్షేత్ర యుద్ధ చివరి అంకాన్నీ అత్యద్భుతంగా ఆవిష్కరించారు. కౌరవు, పాండవుల మధ్య శత్రుత్వం కురుక్షేత్ర యుద్ధంతో ముగుస్తుంది. ఈ యుద్ధంలో దుర్యోధనుడు 17 రోజుల్లో యుద్ధంలో అందరినీ పోగొట్టుకోవడం, చివరి రోజున పాండవులు, దుర్యోధనుని కోసం వెతుకడం, తీవ్రంగా కలత చెందిన దుర్యోధనుడు. పాండవుల నుంచి తనను తాను రక్షించుకునే నేపథ్యంలో అతడిని దెయ్యాలు వెంటాడడం. ద్వైపాయన సరస్సులో దాక్కోవడం, కష్ణుడి సమేతంగా పాండవులు అక్కడికి వచ్చి దుర్యోధనుడిని రెచ్చగొట్టటం, సరస్సు నుంచి బయటకు వచ్చి గదా యుద్ధంలో భీముణ్ణి కొట్టి, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, కష్ణుని స్పర్శతో భీముడు మేల్కోవడం .తిరిగి గదాయుద్ధంలో కష్ణుడు ఇచ్చిన సూచన తో భీముడు దుర్యోధనుడి తొడపైన కొట్టి . దుర్యోధనుడు నేల కూల్చేయటం,. గత అవమానాలకు ప్రతీకారంగా భీముడు దుర్యోధనుడిని తన్నడాన్ని ధర్మరాజు వారించటం శ్రీకష్ణుని ఆశీస్సులు అందుకోవటంతో నాటకం ముగిసింది. హారతితో జయ మంగళం అంటూ నాటకానికి ముక్తాయింపు పలకడం ఆకట్టుకుంది. శివానంద హెగ్డే – ధుర్యోధనునిగా, ధర్మరాజు -శిరాలగి తిమ్మప్ప, హెగ్డే భీమ-ఈశ్వర్‌ భట్‌, కష్ణునిగా -సదాశివ్‌ భట్‌, ఎల్లాపుర విఘ్నేశ్వర్‌, హవగోడి సీతారాం హెగ్డే, ముదరె కెరెమనే, శ్రీధర్‌ హెగ్డే, చంద్రశేఖర్‌, ఎన్‌. వినాయక్‌ నాయక్‌, నకుల గౌడ్‌, గణపతి కునబి, కష్ణ జి.మరాఠి తదితరులు నటించి తమపాత్రాలతో కథను రక్తి కట్టించారు. అనంతరం కళాకారులను నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ప్రతినిధి ఇమ్మినేని వివేక్‌ సత్కరించి అభినందించారు.

➡️