చకోర పక్షులు

Jan 12,2024 08:44 #sahityam

నిరుద్యోగుల చిరు జీవితాలు

నిరంతరం రగిలే వేదనాగ్నులు !

ఉపాధి వెన్నెల కోసం ఆకాశం లోకి

ఆశగా ఎదురు చూసే చకోర పక్షులు..!

ఏళ్ల తరబడి ఉద్యోగాలు దొరకక

ఉదర పోషణార్థం ఉన్న ఊర్లు విడిచి

వలస పోతున్నారు కలతల కూలీలై..!?

ఉన్నత చదువు పూర్తి కాగానే

డిగ్రీ పట్టాలు చేతికి అందగానే

విద్యార్థులు నిరుద్యోగులుగా మారి

చిరుద్యోగాలు కోసం వెతుకులాట ..!

కంపెనీలు చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా

పోటీ పరీక్షలను కష్టపడి తెగ రాసినా

ఉద్యోగ యోగం వారిని వరించక

నిర్వేదంతో బతుకుతున్న నిర్భాగ్యులెందరో..?

పాలకులు ప్రతి ఏటా ప్రకటిస్తామన్న

జాబ్‌ కాలెండర్‌ ప్రకటనకు జవాబుదారీ

లేదు..?

రాష్టాలలో పారిశ్రామికీకరణ విస్తరణ

మృగ్యం ..?

హోదా లేదా రికమండేషన్‌ వుంటే తప్ప

జాబ్‌ జవరాలు జాడ తెలియని పరిస్థితి..!?

స్వర్ణ భారతంలో ఏటేటా చదువుకుని

నిరుద్యోగుల శాతం నిలువెత్తుగా

పెరుగుతున్నది..!

ఏలికల కున్న రెండు నాలుకల విధానాల వల్ల

ప్రభుత్వ సంస్థలు పర్మినెంట్‌గా మూత

పడుతుంటే

నిరుద్యోగులు అనునిత్యం పెరుగుతూ

భారతమ్మకు పెను భారంగా మారారు..!?

ఇదేనా..మన నవయుగ భారతం..?

ఇంతేనా..నిరుద్యోగుల జీవితాలు..!?

వారి విలువైన చదువులు చివరికి

చట్టుబండలేనా..?

– జి.సూర్యనారాయణ, సెల్‌ : 6281725659.

➡️