ప్రజాస్వామ్యమా, రెపరెపలాడు!

May 27,2024 04:18 #kavithalu, #sahityam

బద్దలైన బేలెట్‌ బాక్సుల్లోనో
బిర్యానీ పేకెట్‌ లోనో
నిశ్చలంగా నిదురపోనీ!
ఏదో ఒక రంగు జెండాలానో
ఏ మాయా మేనిఫెస్ట్‌ లానో
మార్మికంగా ఒదిగిపోనీ!
నీ నిర్వచనాలన్నీ
మణిపూర్‌ మంటల్లోనో
వాకపల్లి ఆర్తనాదాల్లోనో
బిల్కిస్‌ బానో నెత్తుటి చారికల్లోనో
నిర్లజ్జగా నిద్రపోనీ!

నిన్నెగరెయ్యడానికి
నా చూపుడు వేలిని బలిస్తూనే
ఇండెలిబుల్‌ ఇంకుతో
నన్ను నేను నల్లబరుచుకుంటూనే ఉన్నా!
నీ స్వర్ణోత్సవాల వెలుగులకోసం
నేను డోలీలోనే తరతరాలుగా
ఆరిపోతూనే వున్నా!

నువ్వు మాత్రం భద్రం తల్లీ!
అడవినీ అంతమొందించే
నీ అధికారం చల్లగుండనీ!
నీ వేట వర్ధిల్లనీ!
కొమ్మకొక డ్రోన్ని వేలాడదీసి
అడివంతటినీ జల్లెడ పట్టనీ!
నా పాదం కింది సంపదనంతా
ఏ బడాబాబుకో సమర్పించనీ!

నీ తళుకులలో
హక్కుల కోసం
బాధ్యతలా నేలరాలుతున్నవాణ్ణి!
నీ మెరుపుల కోసం
వాక్స్వాతంత్రపు వీధుల్లో
మౌనంగా రక్తమోడుతున్న క్షతగాత్రుణ్ణి!

ఇప్పుడు…
నా నేలొక జలియన్‌ వాలాబాగ్‌
నీ మేజిక్‌ నంబరొక డయ్యర్‌ తూటా!
స్వాతంత్రం ఒక మృతదేహాల కుప్ప!

– మల్లిపురం జగదీష్‌

➡️