పతన దృశ్యం

Feb 26,2024 09:42 #sahityam

పనికిరాని వార్తలు

పతాక శీర్షికలై తళుకులీనుతున్నవి

బట్టబయలు కావలసిన వార్తలు

బుట్ట దాఖలవుతున్నవి

పత్రికల కంటే కరపత్రాలే నయం

మీడియా ప్రయాణం ప్రహసనమవుతున్నది

 

అసంబద్ధ చర్చలు

అనవసర రాద్ధాంతాలు

మాట్లాడాల్సిన అంశాలన్నీ మరుగు పరిచి

ఎక్స్‌క్లూజివ్‌ పేరా కాలయాపన చేస్తూ

టీఆర్పీల ఉచ్చులో చిక్కి

ఉరి బిగించుకున్న మైకు గొంతులు

 

కాలనేత్రమై వెలిగాల్సిన కెమెరా కన్ను

కుహన రాజకీయ కుతంత్రంలో

కూలుతున్నదా? కుములుతున్నదా?

లేక కులుకుతున్నదా?

ఆస్తులపై ఆకలితో ఆత్మను అమ్ముకున్నదా?

 

యూట్యూబర్ల మనసుల్లో

దొంగలు పడ్డారా?

సామాజిక మాధ్యమాలు

భలే స్తబ్దుగున్నాయి ఎందుకు?

 

ప్రళయకాల పాలనేత్రుడై

ప్రభవించాల్సిన పాత్రికేయ రంగం

పుడమి పుత్రుల పాలిట

పక్షపాత వైఖరి న్యాయమా?

 

రామ ప్రాణ ప్రతిష్టకు జరిగిన ప్రచార పర్వం

రైతు పోరాటపథంలో కనబడటం లేదెందుకు?

పెట్టుబడిదారీ పంజరంలో చిలుకైందా? లేక

పాలకుల పాదాల వద్ద పావనమౌతుందా?

పాలను నీళ్లను వేరు చేసేది కదా పాత్రికేయం!

– డా.ఎడ్ల కల్లేశ్‌ 98667 65126

➡️