నీ ఓటెవరికి …?

May 2,2024 08:03 #2024 election, #edit page, #song

సాకీ:
ఓటే ఓ ఆయుధం నమ్ముకుంటే
ఏం లాభం లేదు దాన్ని అమ్ముకుంటే
అందుకే చేతులు కలిపి ఒకటౌదాం
ఒక్కో ఓటు చేర్చుకునీ
ప్రజా బలం చూపుదాం
ప్రజా రాజ్యం కాంచుదాం
పల్లవి:
ఓటరూ చెప్పవా
ఓటెవరికి నీ ఓటెవరికి
ఓ ఓటరూ చెప్పవా
ఓటెవరికి నీ ఓటెవరికి
ఇకనైనా విప్పవా చిక్కుముడి
ఓటెవరికె నీ ఓటెవరికి
ఓటెవరికె నీ ఓటెవరికి //ఓ//
చరణం 1:
తీపి తీపి మాటలే
చెప్పువారొక వైపు
చెప్పువారొక వైపు
ఘాటు ఘాటు మాటలతో
యుద్ధం ఒక వైపు
యుద్ధం ఒక వైపు
గందరగోళమైన ఈ మాటల యుద్ధాలను
దాటితే చాలనే నిర్ణయానికొచ్చావా
నిశ్చలంగ వున్నావా //ఓ//
చరణం 2:
మతం మహమ్మారినే
నమ్ముకున్న కొందరు
నమ్ముకున్న కొందరు
జనులందరి మధ్య
విషపు గీతలే గీసి
విషపు గీతలే గీసి
తమ పబ్బం గడుపుకొనగ గంతులే వేస్తుంటే
జాలిగా చూసేసి మౌనంగా వున్నావా
మాటలే వద్దని మౌనంగా వున్నావా //ఓ//
చరణం 3:
డబ్బు రాజ్యమేలుతుంది
రంగులే మార్చుతుంది
రంగులే మార్చుతుంది
తాత్కాలిక అవసరాలు
తీర్చకనే తీరుస్తుంది
తీర్చకనే తీరుస్తుంది
పదవులొచ్చి కుర్చీలో
కూర్చున్న మరుక్షణం
మనసు మారిపోతుంది
మనుషులనే మార్చుతుంది //ఓ//
చరణం 4:
సామ్యవాద శాస్త్రీయపు
ఆలోచనలున్న వారి
ఆలోచనలున్న వారి
మాటలకు చేతలకు
కట్టుబడీ వున్నోళ్ళకు
కట్టుబడీ వున్నోళ్ళకు
డబ్బులూ మందును
ముట్టకుండ నిలబడి
ఒక్కసారి గెలిపిద్దాం
తేడాను గమనిద్దాం
ఒక్కసారి గెలిపిద్దాం
తేడాను గమనిద్దాం //ఓ//
చరణం 5:
ప్రజల పక్షాన వారు
నిలబడి పోరుతారు
నిలబడి పోరుతారు
నికరంగా వుంటారు
నిఖార్సుగా వుంటారు
మాట తప్పరు వారు
మడమ తిప్పరు వారు
మడమ తిప్పరు వారు
ముక్కు సూటిగా పోయి
ముందే నిలబడతారు
ముత్యాల్లా మెరుస్తారు
రత్నాల్లా వెలుగుతారు. //ఓ//

– జంధ్యాల రఘుబాబు

➡️