మానవ నేస్తాలు సూక్తులు

Nov 27,2023 08:39 #sahityam

”మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్న వాడు’ అని డా.అందెశ్రీ అన్నట్లు – ఒకవైపు చంద్రయాన్‌ లాంటి ప్రయోగాలతో అంతరిక్షంలోకి దూసుకుపోతుంటే, మరోవైపు మణిపూర్‌ లాంటి అమానుష సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నత విద్యలు చదివి విలువలు కోల్పోతూ, ఆదిమ నాగరికత ఆరంభాన్ని తలపిస్తున్న నేటి సమాజానికి సూక్తులు అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.’నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి’ అని డా.సి. నారాయణ రెడ్డి గారన్నట్లు, నేటి సమాజానికి రచయితలు, మేధావుల ఆలోచనలు, సూక్తులు చాలా అవసరం. అలాంటి సదభిప్రాయంతో రాసినవే గార రంగనాధం మాస్టారి ‘సూక్తి రత్నమంజరి.’ 150 శ్లోకాలకు 150 ఆటవెలది పద్యాలతో అనువదించిన ఈ సూక్తి రత్నామంజరి ప్రతి పద్యం సామాజిక దక్పథంతో రాయబడింది.

‘పరదారాన్‌ పరద్రవ్యం,/ పరీవాద పరస్య చ/ పరీహాసం గుర్ణో స్థానే,/ చాపల్యం చ విసర్జయేత్‌’ అన్న శ్లోకానికి తెలుగులో ఈ కింది విధంగా ఆటవెలది పద్యంలో అనువదించారు.

పరధనము కోర్కె పరకాంత నాశింత

పరులనింద, గురుల పరిహసనము,

విషపుచెట్టు పండ్లు విడిచిన మేలౌను

రంగడనువదించె రక్తి వినుమ’.

చెడు అలవాట్లను మానుకోమని నేటి తరానికి సూచించారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ ఏ విధంగా ఉండాలో కింది పద్యంలో హృద్యంగా చెప్పారు.

‘పెంచు రాజు వలెను మంచిగా నైదేళ్లు

పదియు నేళ్లు మరియు బానిసగను

మిత్రు కరణి పెంచు పుత్రుని కడదాక

‘శ్రద్ధ లేని చోట విద్య నేర్పడం చవిటి నేలలో విత్తనాలు చల్లినట్లుగా ఉంటుందని నేటి విద్యా విధానం గురించి తెలియచెప్పే తీరు అద్భుతంగా ఉంది. తన జీవితానుభవంతో ప్రాణమున్న వరకు జ్ఞానార్జన చేయడం మంచిది అని, జ్ఞానానికి ఉన్న విలువ ధనానికి ఉండదన్న నగ సత్యాన్ని చెప్పారు. మనిషి చేసే పనులు బట్టే మంచి చెడులు చేకూరుతాయని వాస్తవ పరిస్థితిని తెలిపారు.

‘గొయ్యి తవ్వు వాడు గోతిలోనికి పోవుగోడ కట్టు వాడు మేడ జేరు’ అన్నారొక పద్యంలో.ద్ణుఖం చాలా ప్రమాదకరమని, కాబట్టి చింత లేని జీవితాన్ని గడపాలని సూచించారు. విజ్ఞాని వినయ వంతుడగుచూ, విద్య లేని వాడేవిర్రవీగడాన్ని నిండు కుండ తొనకదు అనే లోకోక్తితో పోల్చి చెప్పారు. మరొక శ్లోకాన్ని ‘బీజములనునాటి భేషుగా రక్షింప/ ఫలము లిచ్చు గాదె భావియందు/ మంచి నాటవలయు మనుజ లోకమున/ రంగడనువదించె రక్తి వినుమ.’ అని అర్ధవంతంగా కూర్చి చెప్పారు. సమాజంపై తన కర్తవ్యాన్ని ప్రకటించారు. సాధారణంగా మనం ఎవరికైనా ధనం ఇచ్చినపుడు మంచిగా ఉండి, ఇవ్వనపుడు నిందించడం పాలిచ్చిన ఆవు చుట్టూ తిరిగిన దూడ, పాలింకిన తర్వాత పట్టించుకోకపోవడం అనే లోకరీతిని తెలిపారు. మనం చేసే పనుల బట్టి ఫలితాలు ఉంటాయని, వాటిని భూమి మీద అనుభవిస్తారు తప్ప మరో జన్మంటూ ఉండదని, కావున సరియైన దారిలో జీవించాలని చెప్పడం మాస్టారి వాస్తవిక దృష్టికి తార్కాణం. చలి కాచుకోడానికి దాపకర్రని కాల్చి వేడి పొందితే పైకి ఎక్కలేని విధంగా, క్షణకాల ఆవేశాలకు విలువలను మంట గలపడం మంచిది కాదని సూచించారు. నల్లబల్ల అక్షర జ్ఞానాన్ని గల్గించి, జీవితాన్ని చక్కదిద్ది ఉన్నత స్థాయిలో నిలుపుతుంది, కాని మనం నలుపు అజ్ఞానానికి ప్రతీకగా చూడడం మూఢవిశ్వాసమే కదా!

పుస్తకాలు లేని గది ప్రాణం లేని శరీరం లాంటిదని, అన్నిటికంటే ఆత్మ విశ్వాసం గొప్పదని, గురువులందరి కంటే అంతరాత్మ గొప్ప గురువు అని చెప్పి గురుత్వాన్ని చూపించారు. వింటినారిని వెనుకకు లాగి వదిలితే వేగంగా ముందుకు పోయినట్లు, వీలుకాని చోట వెనకకు తగ్గడం సందర్భానుగుణంగా ప్రవర్తించాలని చెప్పడం గొప్ప విషయం. అన్ని విషయాలు అందరికీ చెప్పి, తాను ఆచరించకపోతే వాసన లేని గన్నేరు పువ్వులా వ్యర్థం అని చెప్పడం రంగనాధం మాస్టారి సునిశిత మేధకు నిదర్శనం. Stop learning, Because life never stops Teaching అనే ఆంగ్ల వాక్యాలకు –

‘జీవితమ్ము నేర్పు జీవన పాఠాలు

మానవలదు నేర్వ మనుజు డెపుడు

మహిని మనుజన్మ మహిమాన్వితమ్ము రా

రంగడనువదించే రక్తి వినుమ.’  అని అను వదించడం నిరంతర సాహిత్యాధ్యయన శీలి అని, పుస్తక పఠంనంపై మక్కువ కలిగినవారని తెలుస్తుంది. భావి తరాలు నిరంతర అధ్యనం అలవాటుగా చేసు కోవాలని మార్గదర్శనం చేయడం సంతోషించదగ్గ విషయమే కదా. ‘సంసార విష వృక్షానికి రెండు అమృత తుల్యములు. కావ్యామృత రసపానం సజ్జన సాంగత్యము’ అనే చిన్నయ సూరి మాటలు ఇందుకు నిదర్శనం కదా! ఈ విధంగా సూక్తి రత్న మంజరిలో ప్రతి పద్యం మనసుకు హత్తుకునేలా ఉంది. ప్రతి సూక్తీ మానవ మనుగడకు దోహదపడేదిగా ఉంది. ఈ పుస్తకం కోసం రచయితను 98857 58123 మొబైల్‌ నెంబరుపై సంప్రదించొచ్చు. – రాజాపు శాంతారావు 77022 41896

➡️