అడగండో.. మీరు అడగండోయ్…

May 13,2024 04:45 #aksharam

పాట… హాయిగా జోకొట్టి నిద్ర బుచ్చగలదు. అగ్గి బరాటై పెను నిద్దుర వదిలించనూ గలదు. అలాంటి నిద్దురొదలగొట్టే పాటలన్నీ కలిసి ఒకచోట పోగై జనావళికి పండగ చేశాయి. శ్రమైక జీవన మాధుర్యాన్ని, సమతా, మానవతా పరిమళాలను వెదజల్లాయి. అన్యాయంపై గొంతెత్తి ‘అడగండోరు… మీరు అడగండోరు..” అని ప్రేక్షకుని గుండెలపై డప్పుకొట్టి నినదించాయి. మేడే సందర్భాన్ని పురస్కరించుకొని, ఏప్రిల్‌ 27వ తేదీన ”మానవుడే మహనీయుడు” అన్న మకుటంతో విజయవాడ ఎంబి విజ్ఞానకేంద్రంలో శ్రామిక సంగీత విభావరి నిర్వహించారు. పేరెన్నిక గన్న గాయనీ గాయకులు 32 శ్రామిక గీతాలను, అభ్యుదయ గీతాలను ఆలపించి, శ్రోతలను అలరించారు. శ్రమ ప్రాధాన్యాన్ని, సమైక్య బలాన్ని తమ గళాల్లో అద్భుతంగా వినిపించి, ఉత్తేజపరిచారు.
నేడు ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతోంది. నియంతృత్వం విరగబడి నవ్వుతోంది. లాఠీలు, తూటాలు, ఈడీలు, బేడీలు, బారికేడ్లు, బాష్ప వాయువులు మట్టి మనిషిపై, అభ్యుదయంపై విరుచుకు పడుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, తెగ … ఏదైతేనేం? అన్నీ దుష్టశక్తుల చేతిలో మాయల మంత్రదండంలా మారిపోయి, జనం మధ్య అగ్ని పెట్టేస్తున్నాయి. కార్మికుడు సృష్టించిన సంపదంతా ఒళ్లు వంచని, చెమట పట్టని కొంతమంది ఖాతాల్లోకి చేరి, పోగు పడుతోంది. ఈ దురాగతాలను ఆది నుంచీ ప్రశ్నించాయి ఎన్నో మహోన్నత కలాలు. అలాంటి కలాల నుంచి జాలువారిన సాహిత్యం నిండిన మేల్కొల్పే పాటలను జనం ముందుకు తెచ్చింది జాషువా సాంస్కతిక వేదిక.
శ్రామిక జనావళికి అరుణాంజలి ఘటిస్తూ సినీ సంగీత విభావరిని దిగ్విజయంగా నిర్వహించింది. శ్రీశ్రీ, ఆత్రేయ, సముద్రాల, ఆరుద్ర వంటి ఎందరో మహానుభావులు రచించిన ఆణిముత్యాల వంటి అభ్యుదయ, దేశభక్తి, విప్లవ గీతాలను విభావరి గొంతెత్తి గానం చేసింది. ప్రేక్షకుల మదిని మైమరిపించి, ఉర్రూతలుగించి, సమరోత్సాహం నింపింది. సినీ కలాల సమతాక్షరాలను, సర్వమత సామరస్య భావాలను మనసులోకి ఇంకింపజేశారు. మేడేకు ఎర్రెర్రని సమర స్వరనీరాజనం అర్పించారు.
”భలేభలే అందాలు సృష్టించావు” అనే వేటూరి పాటతో విభావరి జనరంజకంగా మొదలైంది. ”మాటలు రాని మృగాలు సైతం – మంచిగ కలిసి జీవించేను/ మాటలు నేర్చిన మా నరజాతి – మారణ హోమం సాగించేను” అంటూ… సమాజ కుళ్లు కుతంత్రాలను వేలెత్తి చూపిస్తూ ‘భలే భలే అందం’గా సాగింది తొలి పాట.
”పాడిపంటలు” సినిమాలోని ‘మన జన్మభూమి’ పాట ఇది. ”రైతుపాదమే రామపాదమని – రైతు లేనిదే రాజ్యం లేదని / నీలాకాశం నుదుటిన తిలకం – నిండుగ దిద్దుకుంటుంది” అంటున్న ఈ గేయం అన్నదాతపై యుద్ధం చేస్తున్న నేటి పాలనకు సూటి ప్రశ్న. ”రాజకీయంలో కాదు. రైతు స్వేదంలో రాముణ్ని చూడమంటోంది.
ప్రేక్షకుల మదిని మైమరపించింది ఆత్రేయ రచించిన ”కారులో షికారు కెళ్లే” గేయం. ”మేడగట్టిన చలవరాయి – ఎలా వచ్చెనో చెప్పగలవా?/ కడుపు కాలే కష్టజీవులు – ఒడలు విరిచి గనులూ తొలిచి/ చెమట చలువను చేర్చిరాళ్లను – పేర్చినారు తెలుసుకో” అంటూ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్రను కళ్లకుకట్టింది. ”చాకిరొకరిదీ సౌఖ్యమొకరిది సాగదింక తెలుకో” అనే చారిత్రక సత్యాన్ని హెచ్చరికగా జారీ చేసింది.
”కుర్రాళ్లోరు కర్రాళ్ళూ …” పాటతో గాయకుడు సత్యవర్ధన్‌ ఆడిటోరియం మొత్తాన్ని ఉత్తేజంతో ఉరకలెత్తించారు. ”గతమును పూడ్చేది వీళ్లు – చరితను మార్చేది వీళ్లు/ మనుషులే మన నేస్తాలు – మనసులే మన కోవెళ్లు/ దులుపేరు ఆనాటి బూజులు – మార్చి రాయి శాస్త్రాలు” అంటూ నవీన భావజాలం నిండిన ఈ గీతం ఉర్రూతలూగించి, ప్రేక్షకులచే స్టెప్పులేయించింది. ప్రజానాట్యమండలి జగన్‌, గుండు నారాయణరావు తదితరులు ఈ పాటకు స్టెప్పులేసి, ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. సనాతనం పేరిట ప్రచారమవుతున్న పాచిపట్టిన ప్రమాదకర భావాలను కడిగి పారేసిందీ పాట. ”మంచిగతమున కొంచెమేనోరు మందగించక ముందుకడుగెయ్యమన్న గురజాడ పిలుపును గుర్తుచేసింది.
”ఎవడిదిరా ఈ భూమి/ ఎవ్వడురా భూస్వామి” గీతం చాలా హుషారుగా సాగింది. ”విశాఖ ఉక్కును.. ఆంధ్రుల హక్కును … ఎవ్వడురా అమ్మేదీ… ఎవ్వడురా కొనేది..” అని ప్రస్తుతం రాష్ట్రంలో మార్మోగుతున్న సుద్దాల అశోక్‌ తేజ ఉద్యమ గీతాన్ని గుర్తు చేసింది.
”పంచముణ్ని సృష్టించిన ఆ వంచుకుడెవడని అడగండోయ్…/ నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా/ తెగిపడిన ఏకలవ్య బొటనవేలు సాక్షిగా/ అడగండోయ్… మీరు అడగండోయ్..” కులం కుతంత్రాన్ని నిలబెట్టి నిలెయ్యాలని పిలుపునిచ్చిందీ ఈ రచన.
”నీ సంఘం, నీ ధర్మం, నీ దేశం నువు మరువద్దు” అంటూ సాగిన పాట అభ్యుదయ భావాలను పలికించింది. ”చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న/ మేడిపండులా మెరిసే సంఘం గుట్టువిప్పెను వేమన్న/ వింతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించె కందుకూరి/ తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ” అని సంఘ సంస్కర్తల త్యాగాలనురాగాలను గుర్తు చేసింది. వారి కృషి ఫలాలను నేడు అనుభవిస్తున్న నువ్వు నీ మానవతా ధర్మాన్ని మరువొద్దని మనిషిని మేల్కొల్పింది.
”ఎవరికీ తల వంచకు” పాట కర్తవ్యాన్ని బోధించింది. ”చాలీచాలని జీతంతో – మిడిమేలపు కొలువులు కొలవకు / ముడుచుకుపోయిన ఆశలతో – మిడిమిడి బతుకును గడపకు/ చిరునవ్వులతో విష వలయాలను ఛేదించు” అంటూ దినదినమూ ఆశనిరాశల మెరుపులో పరుగులు తీసి, అలసి నాలుగు గోడల మధ్య, నాలుగు కోళ్ల మంచంపై ముసుగేసుకు నిద్దరోతున్న పౌరుణ్ని తట్టిలేపింది ఈ పాట. నీకు నువ్వే అనుకోక సంఘటిత శక్తిలో కలవమని, అదే నీకు నిజమైన బలమని గుర్తెరగమని ప్రబోధించింది.
‘నాంపల్లీ టేసను కాడా రాజాలింగో’ పాట సోలో గీతంగా సాగి, ప్రేక్షకులను అలరించింది. ”తిందామంటే తిండీలేదు – ఉందామంటే ఇల్లూలేదు/ చేద్దామంటే కొలువూ లేదు – పోదామంటే నెలవూ లేదు” అంటూ ప్రస్తుత ‘రామరాజ్యం’ తీరును చూడమంది. మరి ”ఉలకావేమీ పలకావేమీ – బండారాయిగ మారిన సామీ …” అని మానవ నిస్తేజానికి రెండు చురకలు కూడా వేసింది.
శ్రీశ్రీ విరచిత గీతం ”పాడవోయి భారతీయుడా”ను ఉత్తేజకరంగా పాడి వినిపించారు గాయకులు. ”సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం / సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం/ ఏకదీక్షతో గమ్యం చేరిననాడే/ లోకానికి మన భారతదేశం / అందించునులే శుభ సందేశం” భావయుక్తంగా పాడారు. సకల జనులు సుఖసంతోషాలతో ఉన్ననాడే నిజంగా భారత్‌ వెలిగిపోతుందని బల్లగుద్ది చెప్పిందీ గేయం. అలాంటి సమాజాన్ని నిర్మించుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని ఉద్బోధించింది.
ఇంకా ఎన్నో ఉత్తేజకరమైన, ఉత్సాహపూరితమైన గీతాలతో జనరంజకంగా సాగింది శ్రామిక సినీగీతాల సంగీత విభావరి. ”ఆడవే జలకమ్ములాడవే”, ”వందేమాతర గీతం వరస మారుతున్నది”, ”నేడే మేడే”, ”నీ పాదమ్మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా”, ”పుణ్యభూమి నా దేశం నమో నమామి”, ”మనవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా”, ”అదిగో నవలోకం”, ”ఏరువాకా సాగరో రన్నో చిన్నన్నా”, ”నమ్మకు నమ్మకు ఈ రేయిని” వంటి ఎన్నో జానపదాలు, అభ్యుదయ గీతాలను వినసొంపుగా వినిపించి, ప్రేక్షకుల మదిలో సమరోత్సాహం నింపింది విభావరి. పాటల నేపథ్యాన్ని, ఆ సినిమా విశేషాలను చక్కగా పరిచయం చేస్తూ, అద్భుత వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని నడిపించారు కళా వాచస్పతి డాక్టర్‌ అశోక్‌ ఆనంద్‌ కొప్పుల. మధుర గాయనీగాయకులు సత్యవర్ధన్‌, రసూల్‌ బాబు, వాసిరెడ్డి శ్రీనివాస్‌, గొట్టిపాటి రామారావు, పావని, విష్ణుప్రియ తమ గళసీమల్లో పాటలను ప్రవహింపజేశారు. సమయోచితంగా సాధిస్తూ, చక్కని సంగీత సహకారాన్ని అందించారు వాయిద్య కళాకారులు. కీ బోర్డుతో రవి, ప్యాడ్స్‌తో రమణ, తబలాతో వెంకట్‌, జాజ్‌ డ్రమ్స్‌తో బాలు, రిథమ్స్‌తో రామ్మోహన్‌ సంగీత విభావరిని రక్తి కట్టించారు. సౌండ్‌ సిస్టమ్‌ని నరేష్‌ నిర్వహించారు. జాషువా సాంస్క ృతిక వేదిక ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి డ్రీమ్‌ ఆడియో నిర్వహణ నేతృత్వం వహించింది. పాపులర్‌ షూమార్టు, తాళ్‌, సుశీల్‌ మీడియా, కామ్రేడ్‌ గోళ్ల రాధాకృష్ణమూర్తి, పోలవరపు కోటేశ్వరరావు సాంస్కతిక సమితి సహకారం అందించాయి. కార్యక్రమాన్ని పాపులర్‌ షూమార్టు అధినేత చుక్కపల్లి అరుణ్‌ కుమార్‌ ప్రారంభించారు. గుండు నారాయణరావు, రాజు తదితరుల నిర్వహణలో మధ్య మధ్య గోళ్ల నారాయణరావు, పిన్నమనేని మురళీకృష్ణ వంటి అభ్యుదయకాముకులు సందేశాలను వినిపించారు. కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక వర్గపు సౌభాగ్యానికి, సమర్పణంగా, సమర్చనంగా సాగిన ఈ శ్రామిక గీతాల సంగీత విభావరి ఒక ఉత్తేజకర ప్రయోగం. అభ్యుదయ గీతాలకు అరుదైన నీరాజనం!

– ఎల్‌.శాంతి
76800 86787

➡️