స్వార్థపు బజారులో …

Mar 11,2024 08:28 #sahityam

స్నేహితులు కూడా వారి
ఆకాంక్షల రహదారిపై
అడ్డంకి అనుకుంటారు నన్ను
నేననుకునేవాడిని ఎన్నటికైనా
నా స్నేహితులు నన్నర్థం చేసుకుంటారని..

అంధకార బంధురంలో
వెలుగురేఖయై వికసిద్దామనుకుంటే
బంధువులు తమ అభివృద్ధిరథానికి
వేగ నిరోధకమనీ భావిస్తున్నారు
పుణ్య పురుషులు నన్ను
పుణ్యాత్ముల జాబితాలో చేర్చితే
పాపులు తప్పొప్పుల దీపం వెలిగించి
మరీ నన్ను వారి చిట్టాలో
చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు..

వేర్లు బలహీనమైనా
కొమ్మలు కొంతమేర ఒంగిపోతే
దూరమునుండి చూసినవారు
ఫలదారి అనుకున్నారు..
కొన్ని పత్రాలు రాలినంతనే
శిశిరమనుకున్నారంతా
కాలచక్రాన్ని గిర్రున తిప్పి
వసంతాన్ని నే తిరిగి ధరిస్తానని
మరిచారు వారంతా..

నా లోపలంతా శూన్యం నిండి
అంతర్గతంలో విహరిస్తుంటే
సమూహంలో కూడా ఏకాంతంగా
నుంచుంటే గర్వమనుకున్నారు
నిజాయితీ బజారులో బేజారయి
స్వార్థపు బజారులో నన్ను నేను
అమ్మకానికై పెడ్దామనుకుంటే
నన్నో ఖరీదుదారు అనుకుంటున్నారు!

– సర్ఫరాజ్‌ అన్వర్‌
94409 81198

➡️