ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్‌ నాటకోత్సవములు – 2004

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్‌ నాటకోత్సవములు – 2004, 19వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు నిర్వహిస్తున్నమని సమావేశంలో వి.ఎమ్‌.డి.ఎ., నాటకోత్సవాల అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. బుధవారం ఉదయం కళాభారతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ … గత 19 సంవత్సరాలుగా నిర్వహించబడుతన్న నాటకోత్సవాలు, ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీలలో నిర్వహంచబడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 40 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వాటినన్నింటిని ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, చివరి రోజు 16 వ తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి, ఆ తరువాత వెంటనే సీ ఏం ఆర్‌ సౌజన్యంతో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని వివరించారు.

వి.ఎమ్‌.డి.ఎ. ట్రస్టీ, నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.ఆర్‌.కె. ప్రసాద్‌ (రాంబాబు) మాట్లాడుతూ… ప్రదర్శించే ప్రతి నాటికకు రూ.13,000 పారితోషికం ఇవ్వటానికి నిర్ణయించారని, ప్రదర్శన రోజు స్థానికేతర సమాజాలములవారి భోజన ఖర్చులు , లోకల్‌ కన్వేయన్స్‌ నిమిత్తం రూ.4,000 అందజేయబడుతున్నదని, అదనంగా వసతి ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నదని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందినవారికి ఉత్తమ ప్రదర్శనకు రూ.18,000, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.15,000, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.12,000, చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ. 10,000 నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు ఒక్కొక్కరికి రూ.1500, జ్ఞాపికలు అందజేయబడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ.1000 నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ప్రోత్సాహక బహుమతుల కింద నాటికలలో పాల్గన్న ప్రతి బాల, నటీ నటులకు రూ. 1000 నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక రచయిత, దర్శకుడికి సర్టిఫికెట్‌ లు అందజేయబడుతాయని తెలియజేశారు.

నాటకోత్సవాల నిర్వాహకులు పైడా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, తెలుగునేల మీద ప్రఖ్యాతి గాంచిన ఈ నాటకోత్సవాలకు పోషకులుగా ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. అన్ని రోజులు నాటక ప్రదర్శనలకు ప్రవేశం ఉచితమని, వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు లాటరీ తీసి బహుమతులు ఇవ్వబడుతాయని తెలియజేశారు. నాటకోత్సవాల చీఫ్‌ కన్వీనర్‌, నాటకోత్సవాలలో ఏర్పాటు చేస్తున్న మహాప్రాంగణకర్త సుప్రసిద్ధ రంగ స్థల, సినీ నటులు, స్వర్గీయ కుప్పిలి వెంకటేశ్వరరావు రోజువారి ప్రాంగణకర్తల వివరాలు అందజేశారు. చీఫ్‌ అడ్వైజర్‌ ఆచార్య బాబివర్ధన్‌ మాట్లాడుతూ … ఈ నాటకోత్సవాల విజయంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనదని, ఈ ఉత్సవాల సమాచారాన్ని రెండు తెలుగు రాష్ట్రంలోని అన్ని పాంతాలవారికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్‌ కన్వీనర్స్‌ బడ్డేటి జగర్రావు, వి.నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు, పాల్గన్నారు.

➡️