చేదు నిజాల కథల గని ‘మధుపురి’

Jun 17,2024 03:15 #aksharam

రాహుల్‌ సాంకృత్యాయన్‌ పేరు వినగానే ఓల్గా నుంచి గంగకు, దివోదాస్‌ లోక సంచారి, మధురస్వప్నం, ఋగ్వేద ఆర్యులు, సింహసేనాపతి వంటి రచనలు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ చరిత్రను శోధించి అయన రాసిన గ్రంధాలే. ఆయన ప్రత్యేకంగా ఓ ప్రాంతంలో కొంతకాలంగా జరిగిన మార్పులను తీసుకొని కథలు కూడా రాశారని ‘మధుపురి’ పుస్తకం చూసిన తరువాతే నాకు తెలిసింది. దీనిలో మొత్తం 21 కథలున్నాయి. ఈ కథలు మధుపురి అనే ఓ వేసవి విడిది ప్రాంతంలో జరిగిన చారిత్రిక పరిణామ క్రమాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ పుస్తకం తొలుత ‘బహురంగీ మధుపురి’ అనే పేరుతో హిందీలో 1954లో వెలువడింది. దీనిని కవిని ఆలూరి తెలుగులోకి 2016లో అనువదించారు.
‘మధు’ అంటే మద్యం. ‘పురి’ అంటే నిలయం. ‘మధుపురి’ అంటే మద్యానికి నిలయం అని అర్థమని ఈ పుస్తకంలోనే ఓ కథలో రచయిత ప్రస్తావించారు. మధుపురి ఢిల్లీకి నాలుగు గంటల ప్రయాణ దూరంలో ఎత్తైన ప్రాంతంలో బ్రిటిష్‌ వారు ఏర్పాటు చేసుకున్న ఓ వేసవి విడిది కేంద్రం. వేసవిలో ఆ ప్రాంతమంతా బ్రిటిష్‌ వారితో చాలా సందడిగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక బ్రిటిష్‌ వారి స్థానంలో భారతదేశ ఉన్నత వర్గీయలతో ఈ ప్రాంతం కళకళలాడింది. బ్రిటిష్‌, భారత ఉన్నత వర్గీయ సంస్క ృతీ సంప్రాదాయాలు ఇదివరకే అక్కడ వున్న స్థానిక గిరిజన సంప్రాదాయాలను వారి జీవితాలను ఎలా అతలాకుతలం చేశాయి? పై వర్గీయుల కట్టుబాట్లు, అలవాట్లు అక్కడికి వచ్చిన మధ్య తరగతి వర్గీయులను ఎంతలా ప్రభావితం చేశాయి? ఉపాధిని వెతుక్కుంటూ మధుపురికి వచ్చిన దిగువ వర్గపు ప్రజల జీవితాల స్థితిగతులు ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులను ఈ కథలు మనకు చూపిస్తాయి.
ఓ మూడు కథల గురించి ఇక్కడ ముచ్చటించు కుందాం. ‘రూపీ’ అనే కథ పైన పేర్కొన్న మొదటి కేటగిరికి చెందింది. రూపీ పేరుకు తగ్గట్టుగానే లావణ్యవతి. రూపీ వాళ్ళమ్మ మొదట్లో ఓ సైనికుడితో కలిసి జీవిస్తుంది. వారిద్దరికి కలిగిన సంతానమే రూపీ. సైనికుడు చనిపోయిన తరువాత మధుపురిలోనే ఓ బంగళా కాపలాదారున్ని ఈమె మరలా పెళ్లి చేసుకుంటుంది. బతకడానికై సారాయి వ్యాపారం చేస్తుంటుంది. కూతురు రూపీని వాళ్ళ సంస్క ృతిలో భాగంగా ఏ మగాడికైనా పెళ్లి అనే పద్దతిలో ఒక్కసారిగా అమ్ముకుంటే వచ్చే ఆదాయం కన్నా… రోజూ అమ్ముకుంటే బావుంటుందని వేశ్యావృత్తిలోకి దింపుతుంది. ‘బావి, లత, నావ, వేశ్య భేద భావం లేకుండా అందరికీ సేవచేయాలి’ అని శూద్రుకుడు ‘మృచ్ఛకటిక’లో చెప్పినట్టు ఇలా సేవ చేసి చివరికి రూపీ సుఖరోగాల పాలయి తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటుంది ఈ కథలో. ‘లిప్‌ స్టిక్‌’ అనే కథ … పైన నేను చేసిన విభజనలో రెండో కోవకు చెందిన కథ. హిందూ స్త్రీ… బొట్టును ఎంత పవిత్రంగా భావిస్తుందో దొరసానులు లిప్‌స్టిక్‌కు అంతే ప్రాధాన్యతను ఇస్తారు అంటాడు రచయత. ఈ లిప్‌స్టిక్‌ మధ్య తరగతి వ్యాపార వర్గీయుల్లో ఎంతగా ప్రభావం చూపిందో చెబుతుంది ఈ కథ. ఉన్నత వర్గీయ స్త్రీలు వాడే ఖరీదైన లిప్‌స్టిక్‌ వాడలేక చవకైన లిప్‌స్టిక్‌ వాడి మధ్య తరగతి స్త్రీలు తమ అందమైన పెదువులను పాడు చేసుకుంటున్నారని; నిత్య అవసరాలకు ఆడవాళ్లు మగవాడిపై ఆధారపడినన్నాళ్లు ఆడది తన అందంపై ఆధారపడక తప్పదని; ఆడది తన కాళ్లపై తానే సొంతంగా నిలబడే రోజు ఒకటి వస్తుందని; ఆరోజు వచ్చినాక ఇక లిప్‌స్టిక్‌ లతో పని ఉండదని; ఒకవేళ వున్నా లిప్‌ స్టిక్‌లు అన్నీ ఒకేలాంటి ధరకు అందరికీ అందుబాటులోకి వస్తాయని ఈ కథ చెబుతుంది. ‘గోలూ’ అనేది మూడో కోవకు చెందిన కథ. ఉపాధికై మధుపురికి వలసవచ్చిన ఓ కూలివాడి కథ. ఇంటికి పెద్దవాడిగా తండ్రితో సమానంగా ఇంటి బాధ్యతను తన నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది గోలూకు. తల్లి మరణించాక సామాన్లు మోసే కూలీగా పనిచేయడానికై మధుపురికి వస్తాడు. ఇక్కడ కూడా నేపాలీ కూలీలతో పోటీపడలేకపోతాడు. తరువాత రిక్షా లాగే పనిలోకి కుదురుతాడు. రాత్రీ పగలూ తాను సంపాదించిన సొమ్మును ఊరిలోని తండ్రికి పంపితే ఆ డబ్బులతో తండ్రి కొడుకుకు పెళ్ళి చేయాల్సింది పోయి తనే రెండో పెళ్లి చేసుకుంటాడు. కొడుకుకు త్వరగా పెళ్ళి చేస్తే తనకు ఎక్కడ దూరమైపోయి డబ్బులు పంపడం మానేస్తాడోనని పెళ్ళి చేయడు. సవతి తల్లి, ఆవిడ సంతాన భారాన్ని కూడా గోలూయే మోస్తుంటాడు. పెళ్ళిచేయకపోతే తన చేయి ఎక్కడ చేయదాటిపోతాడో అని భావించి పెళ్లి వయసు దాటి చాలా ఏళ్ళు గడిచాక గోలూకు పెళ్లి చేస్తాడు తండ్రి. మధుపురికి తీసుకువస్తే ఎక్కడ తన భార్య బ్రిటిష్‌ సైనికుల చేతిలో అత్యాచారానికి గురవుతుందోననే భయంతో, ఖర్చులు పెరిగి సంపాదన తగ్గిపోతుందనే భయంతో మధుపురికి తీసుకురాడు. కొన్నాళ్లకు కనుచూపు పోవడంతో సొంత ఊరికి వెళ్ళిపోతాడు. అంతవరకు కుటుంబాన్ని తన భుజస్కంధాలపై మోసిన తాను ఇప్పుడు కుటుంబానికి భారంగా మారతాడు. అన్న భార్యను తమ్ముడు స్వీకరించే పద్ధతి తమ జాతిలో వుంది కాబట్టి తన భార్య తన తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది. స్నేహితుడి సహాయంతో మధుపురికి వచ్చి వైద్యం ద్వారా గోలూ కంటి చూపును తిరిగి పొందుతాడు. దొరికినప్పుడు చేతనైన పని చేసుకుంటూ ఖాళీ సమయాల్లో వంటకు అవసరమైన పుల్లలేరుకుంటూ మధుపురిలో కనిపిస్తుంటాడు గోలూ అంటూ కథను ముగిస్తాడు రచయత.
అదేవిధంగా రెండు విభిన్న వర్గాలకు చెందిన పిల్లల మధ్య ఓ స్వచ్ఛంగా చిగురించిన స్నేహం… ఎడబాటుకు గురై దిగువ వర్గానికి చెందిన ‘చంపో’ చావుకు ఎలా కారణమయ్యిందో ‘చంపో’ కథ వివరిస్తుంది. ఉన్నత వర్గానికి చెందిన దొరసానులు మధ్య తరగతి, దిగువ వర్గాల వారికి ఇవ్వాల్సిన డబ్బులెలా ఎగ్గొడుతుంటారో అని ‘అయ్యో ముసలితనం’ అనే కథలో చదివి తెలుసుకోవొచ్చు. ఈ పుస్తకంలో వున్నవి 21 కథలు కాదు; 21 జీవితాలు, మధుపురి చరిత్ర చెప్పిన చేదు నిజాలు. ఒకానొక సంధికాలంలో భారత సమాజంలోకి చొచ్చుకొచ్చిన కొన్ని పతన విలువల స్వరూపాన్ని, మానవ సంబంధాల్లోని కాఠిన్య కోణాలను తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.

– మొయిద శ్రీనివాసరావు
99082 56267

➡️