వలస పక్షి

Apr 15,2024 05:45 #aksharam

స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కింద
వలస పక్షుల సమావేశం!
వలస పక్షులన్నీ ఎప్పుడో పరకాయ ప్రవేశం
నేర్చుకున్నాయి!
జూమ్‌, టీమ్స్‌ భాషలలో సంభాషణ జరుపుతుంటాయి.
కొత్త మోహాలకి రెక్కలు మొలుస్తూ ఉంటాయి!
000
అక్కడ ఎగరడం నేర్చుకున్నాక
భారతదేశపు తల్లి పక్షి గుర్తుకొస్తుందీ!
అందుకే భారత్‌ని విహంగ వీక్షణం చేస్తూంటుంది
వలస దేశంలో కొన్న కొత్త గృహం గురించి
గర్వంగా ప్రస్తావిస్తుందీ!
వలసల విలాసాల గురించి మరీ మరీ
నెమరు వేస్తుంది!
తల్లి పక్షి గూడు పాడయినా
వలస పక్షి పయనం ఆపదు
ఏ ఆపదకూ అభయం ఇవ్వదు.
పాస్‌ పోర్ట్‌, వీసా రెక్కలతో వలస పక్షి
ఎగురుతూ ఉంటుందీ
ఎంత కలిసి పోయినా
కర్ణుడి కుండలాల్లా ఇండియన్‌ ముద్ర
వదిలిపోదు!
దేశాలన్నీ దగ్గరవుతాయి
దగ్గర వాళ్ళ మధ్య దూరానికి
కాంతి సంవత్సరాల కొలత అవసరమవుతుంది!
వేళ్ళు ఇక్కడే ఉన్న భారత్‌ దూరమవుతుంది!
ఏం పొగొట్టుకున్నాడో
ఏం రాబట్టుకున్నాడో
తెలియని స్ధితిలో
జీవితం సందిగ్ధ సంధ్యవుతుంది!
– వీరేశ్వర రావు మూల
94947 46228

➡️