మియాల వలస దుఃఖాన్ని వినిపించిన స్వరం

Jan 1,2024 10:41 #sahityam

               ముకుంద రామారావు అనగానే ‘అదే నేల’, ‘అదే ఆకాశం’, ‘అదే నీరు’, ‘అదే కాంతి’ పుస్తకాలు గుర్తుకు వస్తాయి. ఈ అనువాద కవిత్వమే కాకుండా ‘వలసపోయిన మందహాసం’, ‘రాత్రి నదిలో ఒంటరిగా’ మొదలైన స్వీయ కవితా సంపుటాలను కూడా ఆయన ప్రచురించారు. ఆయన అనువాదం చేసిన మియా కవిత్వం అస్సాంలో ఆటుపోట్లకు గురవుతున్న మియాల బాధాతప్త స్వరాన్ని వినిపిస్తుంది.

ప్రపంచంలో అన్నిటికన్నా విషాదమేమిటంటే – తాను నిలబడిన నేల తనది కాదని ఇంకెవరో చెబుతూ వేధించటం. కన్నతల్లిని, ఉన్న ఊరిని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ ఉన్న ఊరే ”ఊరు నీది కాదు. నీకు ఇక్కడ స్థానం లేద”ని తిరస్కరించినప్పటి బాధ భరించలేనిది. ఈ ద్ణుఖం గురించి రాసిన కావ్యమే ‘మియా కవిత్వం’. ఇది అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం. అస్సాంలోని నదీతీర ప్రాంతంలో నివసించే 70-75 లక్షల మంది ముస్లిం ప్రజల సమాజం మియా.

అసలు అస్సాం అనేదే వలస దారుల రాష్ట్రం. బెంగాల్‌ నుంచి అస్సాంకు మియాల వలస 19వ శతాబ్దం ఏడవ దశాబ్దం చివరి భాగంలో మొదలైంది. వారు అస్సామీని తమ మాతృభాషగా అంగీకరించారు. తమను తాము అస్సామీలుగా చెప్పుకుంటారు. కానీ, ఈ సమాజం స్వాతంత్య్రం వచ్చాక కూడా నిర్లక్ష్యానికి గురైంది. అక్కడ ఎన్నో మతపరమైన అల్లర్లు జరిగాయి. అయినా ఈ సమాజంలోని ప్రజలను చంపినందుకు, హింసించినందుకు ఏ ప్రభుత్వమూ ఎవరినీ శిక్షించ లేదు. కానీ, పౌరసత్వం పేరుతో ఇప్పుడు వారిని వేధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 27, 2016లో ”రైట్‌ డౌన్‌ ఐ యాం ఏ మియా” అనే కవిత సోషల్‌ మీడియాలో వచ్చింది. దానికి ప్రతిస్పందనగా 15 రోజుల్లోనే 200లకు పైగా కవితలు వెలువడ్డాయి. అస్సాంలోని ఆధిపత్య శక్తులు 10 మంది మియా కవులపై అస్సామీ వ్యతిరేకులుగా ముద్ర వేస్తూ 8 కేసులు పెట్టారు. అయినా సరే, ప్రతిరోజూ కవులు కొత్త కవితలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ మియా కవిత్వం ముద్రణ రూపంలో కంటే, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లోనే విశేష ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రెండవ దశలో యూట్యూబ్‌ని వాడుకున్నారు.

మియా కవిత్వంలోకి వెళితే … మౌలానా బందె 84 పుస్తకాలు రాశాడు. తాను రాసిన ‘ఒక చారువా ప్రతిపాదన’ కవితలో ‘మియా’ అనే పదం వాడకపోయినా, వారి ఉనికిని చెప్పే మొదటి కవితగా మియా కవులు దీనిని భావిస్తారు. ”నా జన్మస్థలం బెంగాల్‌ అంటారు కొందరు/ నేను చారు వా (ఇసుకమేట వాసిని) కాను, వలస వాసినీ కాను / మేము కూడా అస్సాం నేలా గాలి భాషలతో/ అసోమియాలు అయ్యాము/ అస్సాం తల్లి తన రొమ్ముతో మమ్మల్ని పోషిస్తుంది/ ఆమె ఉల్లాసమైన బిడ్డలం మేం” అని, తాము ఈ రాష్ట్రానికి పరాయి వాళ్ళం కాదు, అస్సాం వాసులమే అని చెప్తాడు.

కబీర్‌ అహ్మద్‌ తన ‘వినమ్రంగా నివేదించుకుంటున్నాను ఇది (1985)’లో నేను అస్సామీని అని చెప్తూ ”అప్పటినుండి నేల మీద రాళ్లు పరిచాను, నా శరీరాన్ని కుళ్ళిన మొక్కతో నల్లగా మాడ్చుకున్నాను / రక్తం చెమటతో పంటలు పండించాను / నా తండ్రుల నాగలితో ‘అస్సాం’ అనే భూమిని దున్నాను” అని తన మాతభూమి అస్సాం అని చెప్తున్నాడు. అయినా 1983లో నెల్లీలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఎందరో మియాల ఇళ్లు కాలిపోయాయి. ”1983 మంటల రాత్రి / నెల్లీ నల్లటి పొయ్యి మీద నిల్చుని నా దేశం అరిచింది / సయ డాకా పాఖీ డాకా – మియాల ఇళ్ళు శ్మశానాల్లా కాలాయి/ సంగతి ఏదైనా నా పేరు / ఇస్మాయిల్‌ షేక్‌, రంజాన్‌ ఆలీ లేదా మజీద్‌ మియా / విషయం – నేను అస్సామీ అసోమియాని’ అని తాను అస్సామీ అని ప్రకటించుకున్నాడు.

మియా ఉద్యమ కవి డా.హఫీజ్‌ అహ్మద్‌ ‘నిట్టూర్పు (2016)’లో ‘బ్రహ్మపుత్రా నది కోతకు అంతా కోల్పోయాక/ మాకు లేనిది ఏమిటి?/ పచ్చని వరి పొలాలు / చేపల వర్తకంలో చేప గెంతుళ్ళు/ పిల్లల హాసోల్లాసాలలో పెరిగిన ఇంటి ఆవరణలు/ నిండుగా జనం, ఉత్సాహం, సంబరాలు/ ఈరోజు ఏముంది?/ మా మెడ మీద బానిసత్వపు గొలుసు/ జయించడానికి సమస్త ప్రపంచమూనూ” అని ఒకప్పుడు సకల వైభవాల మధ్య పెరిగిన కవి మెడపై ఇప్పుడు బానిసత్వం గొలుసు వేలాడుతుంది అని బాధపడతాడు. ఈ కవిదే మరో కవిత ‘రాసుకో – నేను మియానని రాసుకో ‘2016)’. ”అర్హులైన జాతీయ పౌరుల జాబితా (చీ=జ)లో నా సంఖ్య 200543/ నాకు ఇద్దరు పిల్లలు/ వచ్చే వేసవిలో/ ఇంకొకడు చేరబోతున్నాడు/ నన్ను అసహ్యించుకుంటున్నట్టే/ వాడిని అసహ్యించుకుంటావా?’ అని వాస్తవ జీవితంలో మియాని తక్కువగా చూడడాన్ని ప్రశ్నించాడు. ”నేను మియానని రాసుకో/ మీ సుఖం కోసం మీ మురుగును శుభ్రం చేస్తాను/ అయినా మీకు సంతప్తి లేదు/ ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యంలో/ ఏ హక్కులు లేని పౌరుడిని/ నా తల్లి ఒక సందేహాస్పద ఓటరు/ ఆమె తల్లిదండ్రులు హిందువులు ఐనా సరే” అని మియాల శ్రమను దోచుకుంటూనే వాళ్లనెలా అణగదొక్కుతున్నారో, వారి హక్కులను ఎలా హరిస్తున్నారో రాశాడు. ”కావాలంటే నన్ను చంపెరు/ ఊరు నుండి తరిమేరు / నా పచ్చటి పొలాలు లాక్కో/ నా మీద తొక్కించడానికి/ బుల్‌డోజర్లు అద్దెకి తెచ్చుకో/ నీ బుల్లెట్లు/ నేరమే లేకుండా/ నా ఎదను చెదరగొట్టొచ్చు” అని అక్షరీకరిస్తారు.అస్సాంలో బ్రహ్మపుత్రా నది చాలా పెద్దది. వర్షాకాలంలో వరదలు వచ్చినపుడు ఇళ్లను ముంచెత్తుతుంది. దీనిపై చాలామంది కవులు స్పందించారు. అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ‘నెల్లీ కాలెండరు మీద ప్రతిరోజూ’లో ”నేను ఇక నిద్ర పోలేనన్న/ విచిత్ర కలతో బతుకుతున్నాను/ నా కాలెండరు ప్రతిరోజూ రక్తం మరకలు అయి ఉంటుంది/ దగ్గరలోని ఫరుల్‌ బాబారు ఆకులా వణికిపోతున్నాడు/ బాబాయికి జ్వరం, రెండు రోజులుగా తిండి లేదు/ కాలెండర్‌ పరిమాణంలో ఉన్న వెదురు పరుపు మీద అతను కూర్చున్నాడు/ పిన్ని కూడా ఆకులా వణుకుతూనే ఉంది/ నీరు ఇంకాస్త పెరిగితే ఎలా అని” మియాలకు సరైన ఇళ్ళు ఉండవు. నది పొంగిన ప్రజలకు కంటిమీద కునుకు ఉండదు. ప్రాణభయంతో ఆకులా అల్లాడి పోతారు. ఈ కవితలో ఈ ద్ణుఖాన్ని కరుణ రసాత్మకంగా చిత్రీకరించారు.

ఆ నేల బిడ్డలైనా తమను పరాయి వారిగా చూస్తున్న వారిపై తమ నిరసనను, క్రోధాన్ని కాజీనీల్‌ బలంగా వ్యక్తీకరిస్తారు. నేల తమదైనా తాము ఆ నేలకు సంబంధించిన వాళ్ళు కాకపోవడానికి పరితపిస్తూ ‘ఆ నేల నాది, ఆ నేల వాడిని కాదు నేను’ కవితలో ”ఆ నేల నా తండ్రిని విదేశీయుణ్ణి చేస్తుంది / నా సోదరుని బుల్లెట్లతో చంపుతుంది/ నా సోదరిని మానభంగం చేస్తుంది/ ఆ నేల, ఎక్కడ నా తల్లి తన హదయంలో కాలుతున్న బొగ్గుల్ని రాజేస్తుందో/ ఆ నేల నాది, ఆ నేల వాడిని కాదు నేను” అంటారు. అక్కడ వారిపై జరిగే హింసను ఎదిరిస్తూ ”ఎక్కడయితే నా కొడుకు శవపేటికతో రాజకీయాలు చేస్తారో/ నా కూతురు మానంతో జూదమాడతారో/ ఏ నెలలో వెర్రెక్కి పశువులాగా గజిబిజిగా నేను సంచరిస్తానో/ ఆ నేల నాది, ఆ నేల వాడిని కాదు నేను” అని ఆ అనంత వేదనకు దశ్యరూపమిస్తాడు.పితస్వామ్య వ్యవస్థలో ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా స్త్రీలకు స్వేచ్ఛ లేదు. నిర్బంధాలు, నిషేధాల పంజరాల్లో ఊపిరాడని ఉనికి వారిది. కవితలు రాయడానికి ఇంట్లోవారి అనుమతులు లేకపోయినా కొందరు స్త్రీలు కవితలు రాస్తున్నారు. కవయిత్రి హీనా ఆల్‌ హారు ‘నేను మరణించిన తరువాత చెట్టులా జీవిస్తాను’ అనే కవితలో ”నా మరణం తరువాత నేను దేశమవుతాను/ ఎక్కడైతే పశువుల కంటే మనిషి ఖరీదు ఎక్కువో/ ఎక్కడైతే నిరసన పదం బుల్లెట్‌ని ఆర్జించదో/ వారసత్వ హక్కు కోసం పోరాడే వారిలో/ నేను మరణించినా జీవిస్తూనే ఉంటాను” అంటుంది. బేగం అస్మా ఖమాన్‌ ‘స్వాతంత్య్ర దినం’లో ”రేపు స్పష్టంగా స్వాతంత్య్ర దినం/ ఫుల్బామా వాళ్ళ అమ్మ ఖాళీ అన్నం కుండలో రోజు స్వాతంత్య్ర దినం పాటలు వినబడతాయి/ ఫుల్బామా వాళ్ళ అమ్మ వంటగదిలోకి ప్రవేశిస్తే/ ఆమె పిల్లలు ఆమెను చుట్టుముట్టి / అమ్మా ఆకలి అంటారు/ ఫుల్బామా వాళ్ల అమ్మ కళ్ల నుండి / స్వాతంత్య్రం కారుతుంది / ఫుల్బామా వాళ్ల నాన్న మూడేళ్లు నిర్బంధ కేంద్రంలో ఉన్నాడు” స్వాతంత్య్రం వచ్చాక కూడా వాళ్ల జీవితాలలో మార్పు లేదని చెప్తుంది. ఈ కవయిత్రుల్లో బలమైన గొంతు రెహనా సుల్తానాది. మియా కవిత్వం రాస్తున్నందుకు ఆమె మీద నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆమెకు ఎన్నో తిట్లూ బెదిరింపులూ ఎదురయ్యాయి. ఐనా ఆమె వాటికి భయపడలేదు. ‘నా తల్లీ (మే 2016)’ కవితలో ”తల్లీ, నీ ఒడిలో నన్ను వదిలారు/ నా తండ్రి, తాత, ముత్తాతల్లానే / అయినా తల్లీ నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు/ ఒక్కసారి కళ్ళు తెరువు తల్లీ/ నీ పెదాలు విప్పు/ ఈ భూమి పుత్రులకు చెప్పు/ మేమంతా సోదరులమని/ నేను కేవలం మరొక బిడ్డని/ నేను మియా మర్మాంగాన్ని కాదు/ బంగ్లాదేశీని కాదు/ మియాని నేను ఒక మియా/ కవిత్వం ద్వారా పదాలు కూర్చలేను/ నా బాధని పాటగా పాడలేను” అంటూ తన బాధాతప్త హదయాన్ని వినిపించింది.

తమను పరాయి వారుగా, శత్రువులులాగా చూడడం పట్ల, నేరస్తులుగా భావించి హింసించడం పట్ల ఎలుగెత్తి చాటుతున్న ఆక్రోశాన్ని మియా కవితల్లో వింటాము. స్వాతంత్య్రం వచ్చినా తమకు స్వాతంత్య్రం లేకపోవడాన్ని గురించి మియా కవులు ఆగ్రహంతో నిరసన హౌరును వినిపించారు. ఇలాంటి కవిత్వాన్ని అనువదించి మనకు అందించారు ముకుంద రామారావు. ఈ కవితలను చదివినప్పుడు ఎక్కడా ఇది అనువాదం అని మనకు అనిపించదు. మూల కవిత్వంలోని పరిమళాన్ని పట్టి తెచ్చి మనకు అందించడంలో ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. తన సాహిత్యరంగ కృషికిగానూ జనవరి 7వ తేదీన విశాఖపట్నంలో అజో విభో పురస్కారం అందుకుంటు న్నారు ముకుంద రామారావు. బహుభాషా కోవిదులైన ముకుంద రామారావు అభ్యుదయవాది. మానవీయ కవిత్వాన్ని వెలువరించిన కవి. సామాన్యులు నిర్మించిన సాంస్క ృతిక వారసత్వంపై అనేక వ్యాసాలు వెలువరించిన ప్రగతిశీలి. వారికి అభినందనలు.               – మందరపు హైమవతి

➡️