ఓ.. అయ్యా…!!

Jun 11,2024 05:10 #edite page, #kavithalu

ఏలిక పగ్గాలు పట్టించాం
పదవి బండినెక్కించినాం
నువ్వు నడిపే తీరులోనే
సమస్తం ఆసీనమై వుంది
ఓ అయ్యా
ఏలుబడికి కాస్త
ముసుగు తీసి నడపండి.

మరమ్మతులన్నీ
గుడ్లప్పగించి చూస్తున్నాయి
వెనుకబడిన బతుకులన్నీ
గుమ్మంకేసి కాచుక్కూర్చున్నాయి
మెతుకంటని కడుపులన్నీ
ఏలికనే కలవరిస్తున్నాయి
పట్టాభిషేకమయ్యాక
కూసింత కన్ను తెరవండి.

ఆగిపోయిన పనులన్నీ
అంగలారుస్తున్నాయి
జరగాల్సిన ముచ్చట్లన్నీ
మూగబోయి కూర్చున్నాయి
విత్తుకునే శక్తి లేదని
విత్తనాలు నవ్వుతున్నాయి
కలవరింతలన్నీ
పథకాల వైపే చూస్తున్నాయి
కాసింత కాలు కదపండి.

ఎగుడు దిగుడు దారులన్నీ
నడుం విరిగి కూలబడ్డాయి
ఊపిరి సలుపని జీవనాలన్నీ
భరోసాల వైపు చూస్తున్నాయి
సర్దుబాట్లు దిద్దుబాట్లు చేశాక
ముద్ద గడవని గూడుకింత
రెక్కలాడే శక్తిని నింపండి.

ఓ అయ్యా
నమ్మి ముద్దరేసిన వేలికి
ఇంకు మరక పోనేలేదు
వాగ్దానాలన్నీ
మస్తిష్కంలో కదులుతున్నాయి
కాసింత నమ్మికకు
గోరంత ఆయువు పోయండి.

– నరెద్దుల రాజారెడ్డి
సెల్‌:9666016636

➡️