పాపిట్లో సింధూరం మణిబాబు కవిత్వం

Jan 8,2024 09:21 #sahityam

A poem should be wordless As the flight of birds — Archibald MacLeish..

                  మణిబాబు కవిత్వం చదువుతుంటే చాలా సందర్భాల్లో పైన చెప్పిన పంక్తులు గుర్తొచ్చారు. తన ఇరవయ్యో ఏటనుండే కవిత్వ సాధన చేస్తున్న మణిబాబు ఇటు చేయి తిరిగిన కవే కాదు, అటు నోరు తిరిగిన మంచి వక్త కూడా. అందుకు అతను గతంలో ముద్రించిన మూడు కవిత్వ పుస్తకాలు, అయిదు సాహిత్య వ్యాస సంపుటాలు సాక్ష్యమిస్తున్నాయి. శేషేంద్ర, వరవరరావుల తర్వాత ”నేనిలా – తానలా” అంటూ సముద్రంతో సంభాషించాడు, మణిబాబు. సముద్రతీర వాసి కదా! ఇపుడు, నాలుగో కవితా సంపుటి ‘నింగికి దూరంగా … నేలకు దగ్గరగా’ శీర్షికే చెబుతోంది, కవి ఏమిటో. కృష్ణశాస్త్రి గారి కృష్ణ పక్షపు పక్షాలను ఈ వాక్యాలు తిరగేసి తొడుకున్నట్టు లేవూ?.

నేలకు దగ్గరగా … కదా అంటున్నాడు. నేలంటే గురజాడ అన్నట్టు దేశమంటే మట్టి కాదోరు మనుషులు కదా! నేలను ఆవరించివున్న, అంటిపెట్టుకుని వున్న సమస్త ప్రకతి, జంతుజాలమూ, అందులోని మనుషులూ, వారి ఆనందాలు, విషాదాలు అన్నీ అన్నీ ఈ కవితల్లో పొరలు పొరలుగా దర్శనమిస్తాయి. మనం చేయవలసిందల్లా ఆ పొరలను విప్పి చూడడమే!

మణిబాబు కవిత్వంలో వస్తువరణం చాలా విశాలమైనప్పటికీ నన్ను ఆకర్షించిన రెండు ప్రధాన అంశాలు పిల్లలు, స్త్రీలు. వీటికి సంబంధించిన కవితలు చదువుకుంటున్నపుడు మణిబాబు కవిత్వంలో నన్ను నేను చూసుకున్నాను. వైద్యుల్లో పిల్లల వైద్యులు వున్నట్టు కవుల్లో పిల్లల కవులు కూడా వుంటారనుకుంటాను. శ్రీశ్రీ, ఇస్మాయిల్‌, శిఖామణిల తర్వాత పిల్లల మీద మంచి కవితలు రాసిన కవి మణిబాబు ఒక్కడే! తండ్రి-కూతుళ్ళ కేంద్రంగా 2018లో నాన్న- పాప పేరుతో కవితాసంపుటి వెలువరించాడు. సొంత పిల్లలైనా, ఎదుటివారి పిల్లలైనా పిల్లలపై కవిత్వం రాయడానికి కవి ముందు తానూ పిల్లాడైపోవాలి. పిల్లల్లో పరకాయ ప్రవేశం చెయ్యాలి. లేకపోతే వాక్యం పలకదు. మణిబాబు పిల్లల కవి అని ఈ సంపుటిలో ఉన్న అరడజనుకు పైగా వున్న పద్యాలు చెబుతాయి. ‘జ్వరం’ కవితలో మనకు జ్వరం వస్తే మనం చేయాల్సిన పనులు ఇతరులు చేస్తారు. మరి పాపకు జ్వరం వస్తే పాప ఆడుకునే ఆటలు ఎవరు ఆడి పెడతారు? ”కాస్త తగ్గగానే /ఆటలన్నీ ఓపిక చేసుకుని/ ఒక్కత్తే ఆడుకుంది”ఈ మాటలు అనడానికి ఒక తండ్రి తనమే సరిపోదు. మొత్తం బాల్యం మీద ఒక అవ్యాజమైన వాత్సల్యం, అనురాగం వుంటేనే సాధ్యపడుతుంది.

మనకు రెండు రకాల అస్తిత్వాలుంటాయి. మన తాత దండ్రుల అస్తిత్వాలు చెప్పుకోవడం ఒకటి, పిల్లల అస్తిత్వాలను ఆమోదించడం రెండు. మా అమ్మాయి నందిని పుట్టాక, సి.నారాయణరెడ్డి గారిని కలిస్తే, అంతకుముందు అడిగినట్లు యూనివర్సిటీ ఎలా వుంది? నీ ఉద్యోగం ఎలా వుంది? అని కాక, నందిని ఎలా వుంది? ఏం చదువుతోంది, కవిత్వం చదువుతుందా? అని అడిగేవారు. ఇదంతా పిల్లల చుట్టూ అల్లుకున్న సైకాలజీ. మణిబాబు ‘కృతి వాళ్ళ డాడీ’ కవిత రాశాడు. ఇదివరకు ఒక్క పోస్ట్‌ మెన్‌కే తెలిసిన ఆయన ఇపుడు కూతురు కృతి పుట్టడం వలన, ఆమె స్నేహితుల వలన ‘కృతి వాళ్ళ డాడీ ఇల్లు’ అంటే చెబుతారంట. ఎంత గడుసువాడు ఈ కవి! నాకు ఇలాంటి అనుభవమే వుంది. కాకపోతే పాపతో కాదు, చెట్టుతో. ‘నల్లగేటు నందివర్ధనం చెట్టు’ అని ఒక కవిత రాస్తే, మిత్రులు గరికపాటి నరసింహారావు గారు తన విశాఖ ప్రవచనంలో ‘కృష్ణుడు నారదుడికి పారిజాత పువ్వు వుండే చోటు గుర్తులు చెబుతూ, శిఖామణి తన ఇల్లు నందివర్ధనం చెట్టు దగ్గర’ అన్నట్టు చెప్పారట. పాపకైనా, చెట్టుకైనా ఇంతకంటే అస్తిత్వం ఏం కావాలి! అసలు మీకు ఒకటి తెలుసా! తమిళనాడుల్లో పక్కింటివాళ్ళు పిల్లల తల్లులను, వాళ్ళ సొంతపేర్లు పెట్టి పిలవరు. పిల్లల పేర్లకు ‘అమ్మ’ను జోడించి పిలుస్తారు. ఇపుడు కృతి వాళ్ళమ్మను పిలవాలంటే ‘కతమ్మ’ అనే పిలుస్తారు. ఇపుడు ఈ కవిత ‘కృతమ్మ’ అయిపోయింది. ఇలాగే, బహుశా కార్తీక మాసంలో కోనేటిలో వొదిలిన దీపం చుట్టూ పాప తిరుగుతుంటే, పాప వెనకాలే తిరుగుతున్న తండ్రి ‘నా దీపం ఎటు వెళ్తోందో / నేనూ చూసుకోవాలిగా’ అన్నప్పుడు, దీపం కోనేటిలోనే కాదు మన గుండె చెరువులోనే వదిలినట్టవుతుంది.

ఇక, స్త్రీల కవిత్వం. తెలుగు సాహిత్యంలోకి స్త్రీవాదం ప్రవేశించినప్పుడు ‘ఆకాశంలో సగం’ అనే మాట బహుళ ప్రాచుర్యం పొందింది. అలాంటి సగభాగానికి అందవలసిన, చెందవలసిన హక్కులు, స్వేచ్ఛ లభించడం లేదని ఉద్యమ సారాంశం. అయితే, సున్నిత మనస్కుడైన ఈ కవి ‘నువ్వు ఆకాశంలో సగమంటే / నే నొప్పుకోలేను మన్నించు’ అంటాడు. ఆమెలోని అనేక అవస్థలకు ఆకృతిని ఇస్తూ, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం – ఈ పంచభూతాలకు ఆమెను ప్రతినిధిగా చూస్తాడు. ఇది Poetic Justice వరకు బాగానే ఉంటుంది గానీ, ఈ ఉదాత్తభావనను అందుకోడానికి నేలబారు ఆటవిక పితృస్వామ్య సమాజం తనను తాను ఎంతవరకూ సంస్కరించుకోవాలి. ”మనో విస్తృతిని పొందాలి’ అని కవి చేసిన సూచన మగ సమాజం అంతటికీ వర్తిస్తుంది.

అలాగే, ‘మూడు కాలాలు’ కవితలో, అమ్మ ద్వారా గతాన్ని, భార్య ద్వారా వర్తమానాన్ని తెలుసుకుని, పాప ద్వారా భవిష్యత్తును కలగంటున్నాను అనడం వ్యక్తిగతం అనిపించినప్పటికీ – కుటుంబం, సమాజం నిర్మాణంలో వివిధ దశల్లో స్త్రీ పోషించే పరిణామాలకు ఈ వాక్యాలు సాక్ష్యాలు. ఆసుపత్రిలో నర్సుల సేవాత్యాగ నిరతికి అద్దం పట్టే కవిత ‘దయా రూపేణ సంస్థితా’. ఈ కవిత చదువుతుంటే నా ‘ప్రమిద కింద చీకటి’ కవిత లీలగా గోచరించింది.

ఇంత రాసిన కవి కవిత్వం గురించి కవిత్వం రాయకుండా ఎలా ఉండగలడు? ”నేస్తం ఓ కవిత రాయవూ! అని కవి మిత్రుణ్ణి అడుగుతున్నాడు. ఆ తర్వాత ఎలా రాయకూడదో, ఎలా రాయాలో విధి నిషేధాలను విధిస్తున్నాడు.

”ఆఫీసర్‌ ఎదుట మొహమాటంగా కూర్చుని/ భయపడుతూ కాఫీ తాగుతున్నట్టు కాదు/ అర్ధరాత్రి దాహంతో మెలకువ వచ్చి/ గొంతులో గటగటా నీళ్ళు వొంపుకున్నట్టు రాయి’ అంటాడు. కవిత్వం ఒక అసంకల్పిత చర్య అని చెప్పకనే చెబుతున్నాడు. దీన్నే శ్రీశ్రీ ‘కవిత్వమొక తీరని దాహం’ అని మరొకలా చెప్పాడనుకుంటాను. అక్షరం కవితలో అక్షరానికి, సారస్వతానికి వున్న అవినాభావ సంబంధాన్ని అనేక పోలికల్లో చెబుతూ, ఒకచోట ‘అక్షరమొక ఆయుధం/ సారస్వతమొక సైన్యం’ అంటాడు. సాహిత్యం యొక్క అంతస్సూత్రాన్ని, అంతిమ లక్ష్యాన్నీ ఈ వాక్యాలు నిర్దేశిస్తున్నాయి.

కవిత్వ నిర్మాణం, కూర్పు గురించి అనాదిగా ఎన్నో నిర్వచనాలు, వ్యాఖ్యానాలు వచ్చాయి, వస్తున్నాయి. అది నిరంతర ప్రవాహం. ‘భార్య అడిగింది : కళ్ళు ఎర్రగా వున్నాయి, రాత్రంతా మేలుకుని కవిత్వం రాసుకున్నారా!’ అని. భర్త అన్నాడు : ”వేలాది పదాల నుండి నాలుగు కవితా వాక్యాలను ఏరుకోవడం అంత సులువనుకున్నావా?” అని. ఆమె ”మందంగా తొరక కట్టిన పాలగిన్నె నుండి నెమ్మదిగా ఊదుతూ ఊదుతూ ఒక్కో చుక్కా డికాక్షన్‌లో పోస్తూ … ఇలాగే కదూ” అంది. గహనమైన, రహస్యమైన కవితా నిర్మాణాన్ని వంటింటి కాఫీ తయారీతో పోల్చిచెప్పడం … రెండూ తేలిక కాదు. Right words in Right place కూచోకపోయినా, డికాషన్‌, పాలు సమపాళ్ళలో కుదరకపోయినా అటు కవిత్వమూ, ఇటు కాఫీ రెండూ అభాసుపాలవుతాయని చెప్పడమే కదా ఇది! కాసేపు మధ్యాహ్నపు నిద్ర మంచిదనీ, ఉద్యోగస్థులకైతే కొత్త ఉత్తేజాన్నిస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి. మణిబాబు ఈ అంశంపై ‘కునుకు’ కవిత రాసాడు. ‘మధ్యాహ్నపు నిద్రంటే దాటిన దూరానికి, చేరాల్సిన తీరానికి మధ్య విరామం’ అంటాడు. శివారెడ్డి ఈ అంశంపై ‘ఆమె ఎవరైతేనేం’ అనే గొప్ప కవిత రాసాడు.

గ్రామీణ బాల్యం నుంచి వచ్చిన వారెవరికైనా పాలఐస్‌, డ్రింకుల బండి వంటివి మధురమైన జ్ఞాపకాలు. ‘ఇంద్రధనస్సుని సీసాలలో నింపి అతడు బండిని దొర్లించుకు పోతాడు’ అంటాడు డ్రింకుల బండి కవితలో. బడిలో మేస్టార్లు చెప్పే పాఠాల కంటే వేసవి చీమచింత, మామిడి, ముంజెలు, చెరుకుగడ, ఐస్‌ పుల్ల జీవితానికి సరిపడా పాఠాలు చెప్పాయని ‘సెలవు పాఠాలు’ కవితలో విశ్లేషిస్తాడు. ‘పుస్తకాలు సర్దడం’ గురించి ‘గూడు సర్దడం’ అనే మంచి కవిత రాశాడు. ‘దోబూచులాట’ కవిత వెలుగు నీడలతో సంభాషించిన తాత్విక కవిత. వెలుగు నీడలు మాట్లాడ్డం వింటుంటే మనసులో ‘ప్రబోధ చంద్రోదయం’ మెదిలింది.

వీటితోపాటు అద్దేపల్లి రామమోహనరావు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి దంపతులు – వంటి సాహితీవ్యక్తుల, వ్యక్తిత్వాలపై రాసిన కవితలూ మనల్ని పలకరిస్తాయి. వీటన్నిటి కంటే కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి మొదట్లో ‘ఆంధ్రపురాణం’ రాసిన మహావక్షం నేలకొరిగినపుడు రాసిన ‘వంద అడుగుల వ్యాసపీఠం’ కవిత చాలా గొప్పది. ఉస్మానియా ఆసుపత్రిలో చింతచెట్టు, పాలమూరు ‘పిల్లల మర్రి’ వంటి వృక్షాలు చరిత్ర ప్రసిద్ధి చెందినవి. ఆ కోవలోకి చెందినది ఆంధ్రపురాణ సహకార వృక్షం. దాన్ని మణిబాబు ఈ కవితలో మానవీకరించారు (జూవతీరశీఅఱళషa్‌ఱశీఅ). ‘వంద అడుగుల వ్యాసపీఠం’ అనే పదబంధం ఆ చెట్టు విస్తృతిని, వైశాల్యాన్ని దృశ్యమానం చేసింది. ఇన్ని విషయాలు తెలిసిన కవి సంగీతం అంటే చెవి కోసుకోకుండా వుండగలడా! ‘సంగీత యానం’ కవిత చదవండి. కవి లోపల వున్న నారద తుంబురులు, వీణ చిట్టిబాబులు, ఫిడేలు నాయుడు గార్లు కచేరీలు వినిపిస్తారు. ఇవన్నీ చదివాక ఈ కవిత్వం ‘కవితా సతి పాపిట ఎర్రెర్రని సిందూరం’ కదా అని అనుకోకుండా వుండలేం. గురువు గారూ! అని పిలిచే తమ్ముడు మణిబాబుకు ఆశీరభినందన.

– శిఖామణి98482 02526(అవధానుల మణిబాబు కవితా సంపుటి ‘నింగికి దూరంగా నేలకు దగ్గరగా…’కి రాసిన ముందుమాట)

➡️