ప్రజాస్వామ్య రక్షణకై కవితాస్త్రాలు

May 13,2024 05:30 #aksharam

ఎప్పుడో చూసిన పాత సినిమాలోని ఒక డైలాగు గుర్తుకొస్తోంది.. ”దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది..” అనేది ఆ డైలాగ్‌. నూతన్‌ ప్రసాద్‌కి అదొక ఊతపదం ఆ సినిమాలో. హాస్యం కోసమే ఆ మాటని ఆ నటుని చేత దర్శకుడు పలికించినా ఇప్పుడా మాట వాస్తవం అని ప్రతివారూ ఒప్పుకుంటారు. నిజంగానే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. భయమేస్తుంది కూడా. ‘ఇలాగే కొనసాగితే …’ అనే ఆలోచనే ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే సందేహం. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందా అనిపిస్తోంది వర్తమాన పరిస్థితులను గమనిస్తుంటే. ప్రశ్నించే గొంతుల్ని అణచివేయడానికి, లేదా కటకటాల వెనక్కి పంపించడానికి ఏమాత్రమూ వెనకాడని పాలకుల తీరు ప్రజాస్వామ్య ప్రేమికులకు మింగుడు పడటం లేదు. సిబిఐ, ఇడి వంటి సంస్థలు పాలకుల చేతిలో అస్త్రాలుగా మారిపోతున్న సంఘటనలు మేథావులను కలవరపరుస్తున్నాయి. ఎన్నికల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చెయ్యడం, బడా పెట్టుబడిదారుల నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పొందిన లబ్ది వంటి చర్యలు కేంద్ర పాలకుల నిరంకుశ విధానాలను స్పష్టం చేస్తున్నాయి.
”నమో” అంటూ శరణుజొచ్చిన ఆర్థిక నేరస్తులూ, దోపిడీదార్లూ పరిశుద్ధులైపోయి పదవులు వెలగబెడుతుంటారు. కటకటాల్లో శిక్షలనుభవించే దుష్టులు విడుదలై సన్మానాలు పొందుతుంటారు. ధర్మపరిరక్షకులమని చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారి దౌర్జన్యాలకు అంతూ దరీ ఉండదు.
కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజాశ్రేణుల శాంతికి విఘాతం కలిగిస్తూ, మీడియాను గుప్పెట్లో పెట్టుకుని, చీకటి చట్టాలతో ప్రజాస్వామ్యా న్ని మంటగలిపి, బలిసిన బడా వ్యాపారులకు జాతి సంపదలను కట్టబెట్టే దుర్మార్గ పాలనకు చరమగీతం పాడకపోతే ‘మణిపూర్‌’ వంటి ఘటనలు ఇంకెన్ని పునరావృతమౌతాయో! ఇలా చెప్పు కుంటూ పోతే అప్పుడే ముగింపు దొరకదని నా భయం.
ఈ విపత్కర పరిస్థితులను అర్థం చేయిస్తూ పాఠకుల అవగాహనను పెంచేందుకు అజ శర్మ గారు చేసిన ప్రయత్నం బాగుంది. ”ప్రజాస్వామ్యానికే ఓటు” పేరిట ఇటీవల చిన్న కవితల సంకలనం వెలువరించారు. చిన్న చిన్న పదాలతో, సూటిగా, స్పష్టంగా, సరళ సుందరంగా, కొండొకచో వ్యంగ్యంగా సూదిమొనల వంటి కవితల్ని అస్త్రాలుగా ప్రయోగించడం సరైన సమయంలో సరైన సమర వ్యూహం. పెద్ద పెద్ద బరువైన, లోతైన వ్యాసాల్లో చర్చించాల్సిన సమస్యల్ని క్లుప్తంగా అందించి అర్థం చేయించే ప్రయత్నం అభినందనీయం.
ప్రశ్నించడమూ, అవగాహనను పెంచడమూ, ఆలోచింపజేయడమూ సాహిత్య ప్రయోజనం అనుకుంటే ఆ పనే చేస్తుందీ పుస్తకం. శైలీ, శిల్పం ఇంకా ఏవేవో తూకపురాళ్ళతో తూచే కన్నా వీటిని పాఠకలోకానికి అందించడం ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతాను. చూడండి, ఈ చిన్ని అస్త్రం ఎంత పదునుగా ఉందో …
సంపద
కార్పోరేట్లకు అంకితం
విగ్రహాలు
జాతికి అంకితం
వనరులు
అదానీకి అంకితం
మాటలు
ప్రజలకు అంకితం
చేతలు
అస్మదీయులకు అంకితం
భక్తి
దేశానికి అంకితం
పదవి
తమకే అంకితం.
మచ్చుకొకటిమాత్రమే ఇది. ఇలాటి అస్త్రాలతో నిండిన అమ్ములపొది ఈ పుస్తకం. అస్త్రాలు చిన్నవే గానీ లక్ష్యాన్ని ఛేదించడంలో గురి తప్పవని నా నమ్మకం. రోజుకొక అస్త్రంగా అరవై ఒక్క అస్త్రాలు అరాచక చక్రవర్తిపై ప్రయోగించిన అజశర్మ గారు నిజంగా అభినందనీయులు. ఇవి చదివేక ‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది’ అని ఆ సినిమా డైలాగు గుర్తు చేసుకోకుండా ఉండగలమా? మళ్ళీ ఇదే పాలన రాకూడదనీ, రాకుండా చెయ్యాలనీ ప్రతిజ్ఞ తీసుకోకుండా ఉండగలమా?

– గంటేడ గౌరునాయుడు

➡️