నాగలిని ఆయుధంగా మార్చిన కవిత్వం

Mar 18,2024 07:56 #book review, #sahityam

”కవిత్వం నా ఆశ, కవిత్వం నా శ్వాస, కవిత్వం నా అనిర్వచనీయమైన ఆనందం, నేను నిజంగా బతుకుతున్నది కవిత్వం నా ఊపిరి అయ్యాకే, కవిత్వాన్ని అవగాహన చేసుకోవటం నేర్చుకున్నాకే, ఈ ప్రపంచం మొత్తం నాకర్థమై పోయింది…” అంటూ ఎన్నో ఆసక్తికరమైన మానవ, సామాజిక అంశాలమీద, గాఢత, సంక్షిప్తత, విలువైన సాహిత్య సంపదలతో ప్రముఖ కవి కొమ్మవరపు విల్సన్‌ రావు వెలువరించిన కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ ఈ కవిత్వం అక్షరాలతో కాదు, మట్టిని నమ్ముకున్న మనుషుల మనోభావాలతో రాసింది. సామాజిక బాధ్యతను తలపాగాలుగా చుట్టుకున్న కవిత్వం ఇది. కవిత్వ తాత్వికతను తారామండలం దాకా తీసికెళ్లిన కవిత్వం ఇది. చెమటపూల పరిమళాలను సంపూర్ణంగా ఆవిష్కరించిన కవిత్వమిది. ”నేను నేనుగా నాలుగు దేహాలై / నాలుగు జీవితాలుగా సంచరిస్తాను…” అంటూ ఈ కవితా సంపుటిలో 69 నాగలి రూపాలకు అక్షరాలతో కవి పదునుపెట్టగా, ధాటిగా, ధీటుగా ప్రవహించిన కవిత్వమిది.
బతుకు బలవంతంగా శిలువ ఎక్కినప్పుడు, కోరికలు చంపుకుని జీవించటం, ఎంతకష్టమో… సంపూర్ణంగా తెలిసిన మనిషి ఈ కవి. ”తన ప్రేమతో గాలి గొంతును, మధురమైన పాటగా మలిచే వాడొక్కడే గొప్పవాడు…” అంటూ ఒక తిరుగు లేని తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాడు. ప్రపంచ మానవ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసిన ఈ కవి రాసిన కవిత్వంలో, చరిత్రలో దారుణంగా అవమానించబడ్డ, అణగారిన జనం తాలూకు ముఖచిత్రాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘భూమి పొరల్ని చీల్చుకుంటూ, దాస్య విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న దళితయోధులు, చిర్రా చిటికెన పుల్లలై, డప్పు వాయిద్యాలై, జనం గుండెల్లో మొలుస్తున్నారు. మాకోసం మేమై, అందరికోసం మేమై…’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపున భూమిబిడ్డలు, భ్రమల లోకం విడిచి, పిడికిళ్లనెత్తి ఆచరణశీలురై, దేశ ముఖచిత్రానికి కంటిపాపలద్దుతున్న దృశ్యాలు ఈ సంపుటిలో జీవం పోసుకున్నాయి. సూర్యుడ్ని కళ్లల్లో వేసుకుని నిష్క్రమించటం తెలిసిన ఈ కవి, ఒక్కసారి రైతు సోదరుల సమూహాల మధ్య నిలబడి, కర్షకుల నుదుటి మీద రాలుతున్న చెమట చుక్కల్ని ముద్దాడుతూ, తన భరోసాను వారి భుజాల మీద కండువాలా కప్పుతూ అక్షరాయుధమై పహారా కాస్తున్నారు. ‘దుక్కి దున్నటమంటే, యుద్ధక్షేత్రంలో పరాక్రమించడం అని తెలిసిన నేలతల్లి బిడ్డడా! అవసరమైనప్పుడు నాగలి కూడా ఆయుధమై శత్రుసంహారం చేస్తుంది కదూ!…’ అంటూ… కర్షకుడి దుఃఖాన్ని పసిగట్టడం తెలియని రాజ్యం మీద, రాచరిక నిరంకుశత్వం మీద వెలిబుచ్చిన కవి ఆగ్రహం, ఒక సామాజిక ప్రయోజనానికి హారతులిస్తూ ఈ కవితా సంపుటిలో విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది.
కవిత్వాన్ని రాయటం జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకుని, రాసింది పదునుగా, ప్రతిభావంతంగా వుండాలని భావించే ఈ కవి, యుద్ధాన్ని నిరశిస్తూ ప్రపంచ ప్రజల పక్షాన చేరి, ”నన్ను నేను నిలువెత్తు జెండాగా ఎగరేసుకుని/ యుద్ధ రహిత ప్రపంచం కోసం/ స్వాగతగీతం పాడుతాను…” అంటూ ప్రపంచ శాంతికోసం తన అక్షరాలను శాంతి కపోతాలుగా మార్చి సాహిత్య గగనాన ఎగురవేస్తున్నాడు. తన సాహిత్యం నిండా నిత్యం పేదలను ప్రేమించే ఈ కవి ”అట్టడుగు పొరల్లో ఇంకిపోతూ / పేదరికంలో మ్రగ్గిపోతూ / నిత్యం మరణానికి చేరువయ్యే / నల్ల మల్లెమొగ్గలకోసం / నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ /కొత్త చిరునామా రాసుకుంటున్నాను…’ అంటూ తన భావాలను ధీటుగా ప్రకటిస్తున్నాడు. ”కవిత్వమంటే దానికి ఒక గుండె కావాలి, ఆ గుండె కన్నీరు కార్చాలి…” అని భావించే ఈ కవి, తూరుపు గాలిని తన గుండెల్లోకి వొంపుకుంటున్నప్పుడు, అతడొక సజీవ జలపాతంగా మారిపోతూ, రేపటి భావిభారత పౌరులను ఉద్దేశించి ”మారకపు విలువ చూడని తల్లి ప్రేమకు నోచుకున్న అదృష్టవంతులు మీరు, ఆదాయ వ్యయాలు చూడని తండ్రి ఆప్యాయతలు పొందిన ధన్యులు మీరు…” అంటూ పిల్లల్ని దీవించి, భవిష్యత్తులో వాళ్ల పాదముద్రలను ఎలా నిలుపుకోవాలో చెప్పుతూ… ”ఒక్క నిజం కోసం, శుద్ధమైన నిజం కోసం.. చెప్పేది, చేసేది ఒకటే కావాలిప్పుడు, దేహాలకు దివిటీలు కట్టి, వెతుకులాటలో మీరంతా పదునెక్కాలి. మీ ఆలోచన కాంతిపుంజమై, చూపు కాగడాలా వెలగాలి,…’ అంటూ భవిష్యత్తులో ఈ బాల్యానికి అవసరమైన పాఠాలను తన కవిత్వం ద్వారా అందిస్తున్నాడు కవి.
కవిత్వంలో సరికొత్త నిర్వచనాలకు ప్రతీకగా నిలిచే ఈ కవికి మహిళలపట్ల విపరీతమైన గౌరవ మరియాదలే కాదు, వాళ్ల కన్నీళ్లకు చలించిపోయే హృదయం కూడా ఉంది. విధివంచితులై, చిన్న వయసులోనే వితంతువులుగా మిగిలిపోయిన వారిని చూస్తూ… ”పసుపు కుంకుమలకు దూరమైన అంచుల్లేని చీరలన్నీ/ ముక్కులు చీదుకుంటూ, గడపలముందే తమను తాము చిదిపేసుకుంటున్నాయి/ ఒంటరిపోరు అనివార్యమై, రెప్పలకింద కన్నీటి కడవల్ని మోస్తున్న మహా సౌందర్యవతులు వారు/ వాళ్ల చీకటిని తరిమేసే వెలుగుకోసం ఎదురుచూస్తున్నాను…’ అంటూ వారిపట్ల ఒక తండ్రి హృదయాన్ని కవి తన కవితలో ఆవిష్కరిస్తున్నాడు. రాగాల రెక్కలపై నిత్యనూతన నిశాగీతాల్ని రచిస్తూ, చూపుల చౌరస్తాలో నిలబడి, నాణ్యమైన మనిషితనాన్ని అన్వేషిస్తూ సాగిపోయే కవి.. తన ప్రాణ స్నేహితుడ్ని పరిచయం చేస్తూ… ”నా ఆత్మలో అతడింకిపోయాడో / అతని ఆత్మలో నేనింకిపోయానో గాని / ఏదో తెలియని ఊహ ఒకటి నాలో ఊపిరి పోసుకొని మౌనినైనప్పుడు / నా మౌనానికి మాటలు కూర్చిన నాయకుడు వాడే / అతను నా పక్కనుంటే చాలు, ఆ దినమంతా నాకు వెలుగుల పండగే…” అంటూ, మిత్రుడ్ని మళ్లీ, మళ్లీ గుర్తుచేసుకుంటూ అద్భుతమైన భావవ్యక్తీకరణతో వెలువరించిన ఆ కవిత, చాలాకాలం పాఠకులకు గుర్తుండిపోతుంది.
”ఇప్పుడు మనిషే / చెట్టులా చరిత్ర సష్టిస్తున్న కాలం కదూ!…” అంటూ ప్రారంభ వాక్యాలతో ఆకట్టుకుంటున్న ‘చివరి రోజుపై సంతకం’ కవిత, పాఠకుల్ని ఎంతగానో ఆలోచింప చేస్తుంది. అన్ని దానాలలోకెల్ల అత్యుత్తమ దానం ”అవయవదానమని” ఈ లోకానికి మరోసారి కవి గుర్తు చేస్తూ… ”నెత్తుటి చమురుతో తడిచిన దేహపు వత్తిని/ మరో జీవితం కోసం ప్రాణవాయువును చేస్తాను…” అంటూ, అవయవదానానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు.
ఉద్ధండులైన కొందరు సాహితీవేత్తలను కీర్తిస్తూ అందించిన కవితలు, వెన్నెల్లో విరబూసిన కలువ రేకుల్లా పాఠకులతో సహవాసం చేస్తున్నాయి. ”నిత్యం నా ఆలోచనలకు చమురైనవాడు ఆయనే… దేహఖడ్గాన్ని ధరించిన సహజ సంతకం ఆయనే…’ అంటూ పచ్చటి వేపచెట్టులా నిలబడి, పసిబిడ్డ నవ్వుతో కనిపించే కె.శివారెడ్డి గారిని పరిచయం చేశాడు. ”కీర్తికోసం ఆరాటపడని పచ్చి పల్లెటూరి పెద్ద మనిషి ఆయన, సామాజిక న్యాయసూత్ర స్పూర్తి ప్రదాత, నిలువెత్తు జీవితంగా నడిచే సజనల మొదటి వరుసలో మొదటి వారు ఆయనే…” అంటూ, బహుముఖీన సాహిత్య సజనకారుడు, కొలకలూరి ఇనాక్‌ని ఉద్దేశించి పలికిన మాటలు పసిడి పలుకుల్లా మిగిలిపోతున్నాయి. ”ఆకాశమంత కనికరపు ఆయుధాన్ని నా దేహక్షేత్రం మీద నిలబెట్టి, కాలంతోపాటు పరుగెత్తే నమ్మకాన్నిచ్చి, నన్ను సచేతనం చేసింది ఆ మహానుభావుడే…” అంటూ, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దాశరథి రంగాచార్యని కీర్తించారు.
ఈ కవితా సంపుటిని పూర్తిగా మనం చదివాక కవి తాలూకు తత్వం మనకు పూర్తిగా బోధపడుతుంది. విశ్రాంతి ఎరుగని హృదయపు కదలికల్ని ఆయనలో మనం గమనించవచ్చు. నాలుగు గోడలమధ్య గాలిని బంధించి శూన్యంలో నఖచిత్రాలను ఆయన గీస్తాడు. నాలుగు మొక్కజొన్న పొత్తులను ముందేసుకొని ఏ పొత్తులో ఎన్నెన్ని గింజలు ఉన్నాయో లెక్కిస్తూ, కాలాన్ని మైనపు బొమ్మలా కరిగిస్తాడు. ఆయనకు జీవితమంటే చెమట చుక్కతో మొలిచిన పాటకు బాణీ, కన్నీటి చెమ్మతో పదునెక్కిన ఓ ఋతుసంగీతం. ఈ సంపుటిలోని కవిత్వ సారం, మన మనసుల మీద ఆరబెట్టుకున్నాక, కవులంటే కణకణమని మండే అగ్నికణాలని, కవితో మాట్లడటమంటే సూర్యుడితో మాట్లాడటమే నని తెలిసిపోతుంది.
కాలంతో పాటు నిలిచిపోయే ఈ కవితా సంపుటిలో మానవలోకానికి, మనుషుల మనస్తత్వానికి సంబంధించిన సమస్త విషయాలు వున్నాయి. మనుషుల బలాలు, బలహీనతలు, సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారాలు, వర్తమానాన్ని తూకంవేసే సత్యాలు, రేపటి భవిష్యత్తు దీపాలు వెలగటానికి అవసరమైన తైలాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో సామాజిక, మానవ జీవిత అంశాలు ఈ సంపుటిలో చోటుచేసుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన కవిత్వ సౌందర్యం ఈ కవితా సంపుటిలో వుంది. మరో మాటలో చెప్పాలంటే నిబద్ధతకు కట్టుబడిన ఒక కవి.. తన భావాలను విత్తనాలుగా చల్లి విస్తారంగా పండించిన కవిత్వపు పంట ఈ కవితా సంపుటిలో వుంది.

– డాక్టర్‌ కె.జి.వేణు
98480 70084

➡️