ప్రశ్నలు లేవనెత్తే పదునైన కవిత్వం

Jan 15,2024 08:41 #sahityam

”రాజ్యం, చట్టం ఏ వ్యక్తికీ సమానత్వాన్నినిరాకరించదు లేదా భారత భూభాగంలో ఎక్కడైనా చట్టంలో సమాన రక్షణను కల్పిస్తుంది.”- భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 14

        వర్తమాన భారతదేశం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రయాణం చేస్తోంది. లౌకిక ప్రజాస్వామిక భావనలకు మతోన్మాద పాలకులు పాతర వేయడం పరిపాటిగా మారింది. దీనికి తార్కాణమే మణిపూర్‌ మారణహౌమం. కవి చౌశా తన కవిత్వానికి బి.ఫయినోమ్‌ అని శీర్షిక నిర్ణయించడంతోనే తాను దేని గురించి రాశాడో అర్థమవుతుంది. మణిపూర్‌లో గల బి.ఫయినోమ్‌ గ్రామంలో మహిళల్ని అత్యాచారం చేసి చంపేసిన ఘటన జరిగింది. ఈ అకృత్యాలపై హెచ్‌డీ ఫోటోగ్రఫీ కవిత్వమే ఈ బి.ఫయినోమ్‌.

మణిపూర్‌ ఇప్పటికీ కులాల కుమ్ములాటలో కొట్టుమిట్టాడుతోంది. ఒక తెగవారు మాకు ఎస్టీలో చోటు కల్పించాలని కోరితే మరో రెండు తెగల వారు అస్సలు కేటాయించవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఇందుకు మరింత చిచ్చు రగిలిస్తోంది. అందుకే కవి చౌశా ఒక కవితలో ఇలా అంటాడు..:

”డబుల్‌ ఇంజన్‌ సర్కారు../ ప్రజల పాణాలతో చెలగాటం ఆడుతూ/ గోడమీద పిల్లిలా చోద్యం చూస్తోంది”. కవి చౌశా చాలా స్పష్టతతో అవగాహనతో ఈ వర్తమాన ప్రపంచంలో ఏం జరుగుతున్నదో దానికే అక్షరరూపం ఇచ్చాడు. ఈ కవి నిరంతరం వర్తమాన సమాజంలోని సంక్లిష్టతల్ని కవిత్వంగా రాస్తున్నాడు. అమానవీయ ఘటనలు ఏవి కనబడ్డా ఆవేదన చెంది, కవిత్వంగా వెలువరిస్తున్నాడు. ‘అమానవీయ రాజకీయాలను ఎండగడుతూ అబద్ధాన్ని చీలుస్తూ అక్రమాలను దౌర్జన్యాలను స్వ పర బేధం లేకుండా శస్త్ర చికిత్స చేసే అక్షరాయుధాల సముదాయమే కవిత్వమని నిఖిలేశ్వర్‌ అంటారు. అలా సాగిస్తున్నాడు చౌశా. అందుకే మణిపూర్‌ కన్నీరు చూసి కలత చెందుతున్నాడు.

”ఏడ్చే కళ్లు/ కార్చే కన్నీటి ద్ణుఖమంతా/ కాల్వ కట్టి నదిలా మారింది!/ కొండలు, బండల మీదుగా/ లోయలో ప్రయాణించి… రాష్ట్రం దాటి/ బిగ్గరగా ఏడుస్తూ../ దేశమంతా ప్రవహిస్తోంది!/ ఢిల్లీ వీధుల్లో/ పార్లమెంటు భవనం ముందు/ ప్రధాని ఇంటి ముందు / ఆగి ఆగి పారుతోంది!/ ఎవరైనా/ తన బాధను చూస్తారేమోనని/ తన అశక్తతను వింటారేమోనని/ కనీసం ఓదారుస్తారని కిటికీ/ సందుల్లోంచి/ తొంగి తొంగి చూస్తోంది!/ ఎవ్వరికీ ఆ నదీ ప్రవాహం/ వినబడదు! కనబడదు!/ ఎందుకంటే…/ కాపలాదారుడు/ ఆయన పరివారం…/ కొన్ని నెలలుగా/ కుంభకర్ణుడిలా/ గాఢనిద్రలో ఉన్నారు!/ అక్కడక్కడా/ ఎక్కడో…/ ఒకరో ఇద్దరో…/ మనుషులు/మాత్రమే/ ద్ణుఖనదిని చూసి జాలిపడుతున్నారు/ చలిస్తున్నారు!/ ఐకమత్యంతోనే/ఒక్కటిగానే కన్నీటిని ఆపగలం (దు:ఖనది)

ఈ ఒక్క కవితలో మణిపూర్‌లో ఏం జరుగుతుందో ఆవిష్కరించాడు కవి. నిజంగా ఇప్పుడది దు:ఖనది. మోడీ పాలనలో మహిళలకు రక్షణ లేదనే సత్యాన్ని మణిపూర్‌ ఘటన తేటతెల్లం చేసింది. మోదీ పాలనలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో గణాంకాలే చెబుతాయి. ఈ కవిత చూడండి మన దేశంలోని మహిళల రక్షణ ఎంత బాగుందో కనబడ్తుందో..

”నా దేశంలో/ పైశాచికత్వం పరిఢవిల్లుతోంది! / రాక్షసత్వం రాజ్యమేలుతోంది!/ క్రూరత్వం పెచ్చుమీరుతోంది! మానవత్వం మంటగలిసింది!/ విద్వేషం విలయతాండవం చేస్తోంది!/ ఉన్మాదం రెచ్చిపోయింది!/ నేటి ఆటవిక అంధ యుగంలో పోలీసులు దిష్టిబొమ్మలు! స్టేషన్లు పాడుబడిన కొంపలు!/ ప్రజల రక్షణ గాలిలో దీపం! మహిళల మానానికే తీరని అవమానం!/ ఆడబిడ్డలను అవమానించి/ వివస్త్రలుగా ఊరేగించి/ సామూహిక అత్యాచారం చేసిన/ మేకిన్‌ ఇండియాను చూసి/ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది!/ నిస్సిగ్గుగా/ తల ఎత్తుకుని రాజకీయ వ్యభిచారం చేస్తున్న/ పాలక హంతకులను ఏం చేద్దాం/ సమాధానం చెప్పాలని నిలదీద్దాం!

దేశంలో విద్వేష విజబీజాలను నాటిందెవ్వరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ”యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత్ణా” అని వాళ్లు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారనేది దీని అర్థం. కానీ, ఈ డబుల్‌ ఇంజను పాలకులు మాత్రం స్త్రీలను అలా చూడరు. మత విభజన చేసి, మారణకాండకు పాల్పడతారు. ఇన్ని దారుణాలు జరిగినా కేంద్ర రాష్ట్ర పాలకులు తగు విధంగా స్పందించటం లేదు. ఎందుకంటే కవి చెప్పినట్లు.. ” వాడు… కపట నాటక సూత్రధారి/ మొసలి కన్నీరు కార్చేవాడు!/ ప్రజా సమస్యలను విస్మరించినవాడు/ చిచ్చు పెట్టి చలికాచుకునేవాడు/ మతాన్ని అడ్డుపెట్టుకున్నవాడు/ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివాడు/ హిట్లర్‌ను మించిన నియంత నరహంతకుడు!/ వాడే నేటి పాలకుడు! (నేటి పాలకుడు)

మరి ఈ పరిస్థితి మారటానికి ఏం చేయాలి? ప్రజలే జాగురూకులై కదలాలి. ‘ఈ బతుకులు మనకొద్దు ఈ విద్వేషం అసలొద్దు!/ ఇప్పుడే మొదలు పెట్టాలి/ నీతి నైతిక విలువల పునాదులపై / సామాజిక, సాంస్కతిక ఉద్యమం!/ ప్రజాతంత్ర ఐక్యత సాధించే/ అద్భుత పోరాటం!/ కులమతాలు లేని/ ప్రాంతం, భాష లేని / ఒకే జాతిగా/ సంఘటిత శక్తిగా ఎదగాలి!/ పట్టుబడిదారుల/ సామ్రాజ్యవాదులను ఓడించే/ వీరులుగా/ ధీరులుగా తయారవ్వాలి!/ కార్మిక రాజ్యం నిర్మించి ఆదర్శంగా నిలవాలి/ ఉన్నత మనిషిగా ఎదగాలి!’ ఇది ఈ కవి అభిలాష. పరిష్కార మార్గం కూడా!అందుకే ప్రగతిశీల కవులు, అభ్యుదయవాదులు ఈ దేశం నలుమూలలా ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా కదం తొక్కుదాం. ప్రగతిశీల సమాజం వైపు అడుగులు వేద్దాం. ఈ దేశాన్ని మతోన్మాదుల నుంచి కాపాడుకుని లౌకికరాజ్యాన్ని కాపాడుకుందాం.

– కెంగార మోహన్‌ 94933 75447

➡️