ప్రముఖ చిత్రకారుడు.. జాతీయ అవార్డు గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత

మిర్యాలగూడ : ప్రముఖ చిత్రకారుడు బాపు నేషనల్‌ అవార్డు గ్రహీత దాసి సుదర్శన్‌ (73) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 1988లో ‘దాసి’ సినిమాకుగాను ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న పిట్టంపల్లి సుదర్శన్‌ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదర్శన్‌ అంత్యక్రియలు మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

దాసి సినిమా వల్ల ‘దాసి’ సుదర్శన్‌గా గుర్తింపు పొందారు. మిర్యాలగూడలో ప్రముఖ ఆర్టిస్ట్‌ గా, సాహితీవేత్తగా సురపరిచితులైన సుదర్శన్‌ నాగార్జునసాగర్‌ జూనియర్‌ కాలేజ్‌ లో డ్రాయింగ్‌ మాస్టర్‌ గా పనిచేస్తూ, ఎంతోమంది విద్యార్థులను కళల వైపు, సాహిత్యం వైపు మళ్లించి నిష్ణాతులను చేశారు. రచయితగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్‌గా, కార్టూనిస్టుగా కూడా ప్రసిద్ధికెక్కారు. వివిధ పత్రికల్లో వ్యాసాలు, వార్తలు రాస్తూ ప్రజ్ఞ పాటవాలను ప్రకటించారు. సినిమా రంగానికి కూడా ఆయన సుపరిచితులే. ప్రముఖ దర్శకులు కళాకారులు బి.నర్సింగరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళాదర్శకుడిగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పనిచేశారు. నర్సింగరావు తీసిన దాసి సినిమాకు అందుకున్న ఐదు జాతీయ అవార్డులలో సుదర్శన్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా జాతీయ అవార్డు అందుకున్నారు. జాతీయ అవార్డుల జ్యూరీలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు. ఆయన అభిమానులకు శిష్యులకి మిగతా సాహితీ మిత్రులందరికీ సుదర్శన్‌ తగిన సేవలను అందించారు. ఆయన బోధనలో అనేకమంది శిష్యులు గా తయారయ్యి ప్రశంసలు అందుకుంటున్నారు.

➡️