ప్రజాస్వామ్యానికే ఓటు

May 11,2024 05:16 #editpage

ఓట్ల పండగ వచ్చేసింది
ప్రపంచంలో అతి పెద్ద ఎన్నికలు
మనదో గొప్ప ప్రజాస్వామ్యం
ఇక్కడో ప్రశ్న?
ఓటేస్తే ప్రజాస్వామ్యమా
ప్రజాస్వామ్యానికి ఓటేయడమా?
నీ ఓటుతో గెలిచినోడు
నీ నోరు నొక్కేస్తున్నడు
నువ్వెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను
కూల్చేస్తున్నడు
గవర్నర్లతో నాటకాలాడుతున్నడు
నీ సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ సంస్థలను
అమ్మేస్తున్నడు
సంపద కార్పొరేట్లకు దోచిపెడుతున్నడు
ఉపాధి గల్లంతు చేస్తున్నడు
విద్య, వైద్యం ప్రియం చేస్తున్నడు
ధరలు పెంచేస్తున్నడు
రాజ్యాంగ హక్కులు కాజేస్తున్నడు
విద్వేషాలు రాజేస్తున్నడు
నీ జీవితం దుర్భరం చేస్తున్నడు
ఇదేనా ప్రజాస్వామ్యం
దీనికేనా నువ్వోటేసేది?
కార్పొరేట్ల నుండి కోట్లు దండుకుని
ఆ డబ్బుతో నీ ఓటును కొంటున్నడు
కులం, మతం మత్తులో ముంచుతున్నడు
దేముడ్ని రాజకీయం చేస్తున్నడు
ఇదేనా ప్రజాస్వామ్యం
దీనికేనా నువ్వోటేసేది?
ఓటేస్తేనే ప్రజాస్వామ్యం కాదు
రాజ్యాంగాన్ని కాపాడితేనే ప్రజాస్వామ్యం
నువ్వే కాపలాదారువి
ఇప్పుడు చెప్పు
నీ ఓటెవరికి
ప్రజాస్వామ్యానికే కదా!
– ఎ. అజ శర్మ

➡️