చిన్న దేశానికి అతి పెద్ద విపత్తు – 670 మందికి పైగా సజీవ సమాధి

  • పపువా న్యూ గినియాలో భారీగా విరిగిపడ్డ కొండచరియలు

న్యూయార్క్‌ : దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని చిన్న దేశమైన పపువా న్యూ గినియా నేడు అతిపెద్ద విపత్తులోచిక్కుకుంది. రెండు రోజుల క్రితం భారీగా కొండచరియలు విరిగిపడడంతో 670 మందికిపైగా అభాగ్యులు సజీవ సమాధి అయిపోయారు. ఐక్యరాజ్య సమతికి చెందిన వలసవాసుల సహాయ పునరావాస సంస్థ చీఫ్‌ సెర్హాన్‌ అక్టో ప్రాక్‌ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. ఎన్గా ప్రావిన్స్‌లోని యంబల్లి, కొవోకలం గ్రామాలకు చెందిన వందలాది ఇళ్లు విరిగిపడ్డ కొండచరియల కింద పూర్తిగా కప్పబడిపోయాయని అయన తెలిపారు. సమాధి అయినవారంతా యుద్ధాలు, ఘర్షణల్లో నిరాశ్రయులై శరణార్థులుగా ఈ ప్రాంతానికి వచ్చిన వారే. దాదాపు నాలుగు వేల మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎనిమిది మీటర్ల ఎత్తున మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో ప్రాణ నష్టం అంచనాలకు అందడం లేదు. తొలుత 60 ఇళ్లు సమాధి అయ్యాయని అంచనా వేశారు. ఆ ప్రకారం 150 మంది చనిపోయినట్లు అధికారులు అంచనా వేశారు.. కానీ, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే సమాధి అయిన ఇళ్ల సంఖ్య, అలాగే మృతుల సంఖ్య అనేక రెట్లు పెరిగిపోయాయి. ‘ప్రస్తుతం 670 మందికి పైగా జనం శిథిలాల కింద సమాధి అయినట్లు అక్టోప్రాక్‌ మీడియాకు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి కేవలం ఆరుగురు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఇప్పటికీ రాళ్లు పై నుంచి దొర్లుతూనే ఉన్నాయి. 200 కి.మీ పొదవునా రోడ్డు కప్పబడడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టమవుతోందని అక్టో ప్రాక్‌ చెప్పారు.పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో వారంతా నిద్రలోనే మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. పెద్ద విపత్తులో చిక్కుకున్న పపువా న్యూగినియాను ఆదుకునేందుకు భారత్‌ అత్యవసర సహాయం కింద పది లక్షల డాలర్లు ప్రకటించింది.

➡️