ఏం కొంటాం.. ఏమి తింటాం…!!

Jan 10,2024 09:11 #sahityam

కొత్త బియ్యం రెక్కలు వచ్చి ఎగిరే

కందిపప్పు కనకంలా కనబడే

పప్పులు నిప్పులాగా తోస్తున్నాయి

పేదవారి బతుకులు రోట్లో రోకలి పోటులా ఉంది.

అల్లము నుంచి బెల్లం వరకు పరుగులే

కొండెక్కి కూర్చున్న కూరగాయలు

ఉప్పు పప్పు నూనెలు మండుతుంటే

అరకడుపులతో జీవితాలు సాగుతున్నాయి.

ఉల్లిగడ్డ తెల్లగడ్డ మార్కెట్లో మాయాజాలంతో

కూరగాయ సంచిలో బరువు తగ్గిపోయే

ఉత్పత్తి కొరతల్లో దళారుల దౌర్జన్యంతో

బడుగు జీవి బతుకుల్లో నిరాశ కమ్ముకొనే.

కూరగాయ దొరక్క ఊరగాయతో తింటూ

నోటి రుచికి తాళం వేసి బిగించారు

ధరల రాకెట్‌ను అందుకొనలేక పోతూ

నవ్వుల మొహాల్లో దు:ఖపు ఛాయలు కనిపించే.

ప్రకృతి అతివృష్టి అనావృష్టి చేస్తుంటే

అరకొర పంటలు పండుతుంటే

ప్రభుత్వాల కార్పొరేట్‌ విధానాలు ధరలు

సృష్టిస్తుంటే

సామాన్యుడి జేబులు చిల్లులు పడుతుండె.

సగట జీవి సంసారపు చదరంగంలో

పెరుగుతున్న ఇంటి బడ్జెట్‌ పద్దుల చిట్టాలు

ఆదాయ వ్యయాల వ్యత్యాసాల బ్రతుకుల్లో

మధ్యతరగతి కుటుంబంలో వైకుంఠపాళి ఆటలే.

– కొప్పుల ప్రసాద్‌,సెల్‌ : 9885066235

➡️