కన్నీటికి తెలుసు బతుకు నిజమేంటో…!!

Mar 17,2024 07:07 #Kavitha, #Sneha

మనిషి సమాజం నుండి తప్పిపోయాడు
అనవసరంగా అక్షర దారుల్లో ఇరుక్కుపోయాడు
అడవి దారుల్లో గమ్యం తెలియక
చెట్టు నుండి కాయలా రాలిపోతున్నాడు
ఆకాశము నుంచి చినుకులు రాలినట్లు
గాలి వాటానికి కదులుతున్నా.. అంతే!
కన్నీటికి తెలుసు బతుకు నిజమేంటో
కాలానికి తెలుసు తీసుకుపోయే స్థలమేంటో..
నేల కాగితముపైనే వసంతం సంతకం
చిగురించే వృక్షాలకే శిశిరపు భయం
చెట్టుపై వాలే పిట్టలకే ఆనంద సమయం
ఆశల ఆకులు తొడగడమే మనిషి నైజం..
మనసు ఎప్పుడూ ముళ్ళ కంచెలా ఉంటుంది
ఆశల తీగలను ఎదగకుండా చేస్తుంది
అర్థం మోహం కామం క్రోథం చూపిస్తుంటే
వయస్సు కళ్లెం లేక పరిగెడుతూనే ఉంది..
అంతటా మార్పులు అవసరమంటారు
కానీ ఒక్కసారి కూడా మనసు మాట వినరు
మనం సమాజాన్ని మార్చాలంటూ
అనవసర రాద్ధాంతాలతో గీతలు గీస్తున్నారు..
ప్రతి హృదయానికి మరో రూపం ఉంది
జిత్తుల మారి నక్కలాగా ప్రవర్తిస్తుంది
మారుతున్నది నేలే గాని నింగి కాదు
ఎగిసేవి అలలే గాని సముద్రం కాదు కదా..
అవసరాల బుట్టలో దూరి బుసలు కొడితే
చేతిలో కర్రున్నోడు చెంప దెబ్బ లేస్తాడు
పాము సహజ గుణం వదులుతుందా?
మనిషిలోని భయం చంపే వరకు ఊరుకోదు..
మనసు ప్రలోభాలకు లొంగుతుందా
ఆకర్షణల దీపాలకు వెతుకుతుందా
యవ్వనం అంతా వృద్ధాప్యం వైపు చూస్తుంటే
కాలం నిత్యం వైవిధ్యం కోరుకుంటుంది..

కొప్పుల ప్రసాద్‌
9885066235

➡️