కోరని వరం

Dec 10,2023 10:48 #Sneha

ఒక అడవిలో ఒక పాడుపడిన దేవాలయం ఉండేది. అందులో రెండు దేవతల విగ్రహాలు ఉండేవి. ఆ అడవి గుండా అప్పుడప్పుడు కొందరు ప్రయాణం చేసేవారు గానీ ఎవరూ ఆ గుడిని పట్టించుకోలేదు.ఒకరోజు శివయ్య అనే వ్యక్తి ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ ఆ గుడిని చూసి లోనికి వెళ్ళాడు. అందులో ఉన్న పాడుబడ్డ దేవతామూర్తులను చూడగానే అతనికి బాధగా అనిపించింది. శివయ్య తన దగ్గరున్న కండువాతో విగ్రహాలను శుభ్రపరిచి, అడవిలో దొరికిన పూలతో మాలలు కట్టి, ఆ విగ్రహాలకు వేసి, ఇంటిదారి పట్టాడు.అప్పుడు ఆ రెండు మూర్తులలో ఒకరైన అంకమాంబ అనే దేవత ‘వచ్చిన వాడు మంచివాడు. అందుకే మనకు సేవ చేశాడు’ అన్నది.అందుకు రెండో దేవత జగదాంబ ‘అలా ఎందుకు అనుకుంటున్నావు. పనీ, పాటా లేనివాడు కావొచ్చు’ అన్నది. ఆ విషయమై ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. చివరకు నిజం తెలుసుకోవడానికి ఇద్దరు దేవతలు పావురాళ్లుగా మారి, శివయ్య ఇంటికి వెళ్లారు.శివయ్య గొడ్డలి తీసుకొని కట్టెలు కొట్టడానికి చిట్టడవికి బయలు దేరాడు. అతన్ని చూడగానే పావురం రూపంలో ఉన్న అంకమాంబ శోష వచ్చి పడిపోయినట్లు శివయ్య గుడిసె ముందు పడిపోయింది.అది చూసిన శివయ్య చేతిలోని గొడ్డలి పక్కన పడేసి, ఆ పావురాన్ని ఒడిలోకి తీసుకున్నాడు. అది తెప్పరిల్లడానికి దానికి కొన్నినీళ్ళు పోశాడు. అది తేరుకున్నాక గింజలు వేశాడు. అప్పుడు అంకమాంబ ‘ఇప్పుడేం అంటావు?’ అని జగదాంబను అడిగింది. అప్పుడు జగదాంబ ‘నీవు అన్నది నిజం. ఇతను పనీ, పాటా లేనివాడు కాదు. కట్టెలు కొట్టుకొని బతికే కష్టజీవి. ఒక పక్షి కోసం తన పని మానుకొని, సేవ చేసే మంచి మనసున్నవాడు’ అని ఒప్పుకొంది.అప్పుడు ఆ ఇద్దరూ నిజరూపాలు ధరించి, అతనికి ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు అంకమాంబ ‘నాయనా! మేం ఇద్దరం అడవిలోని పాడుబడిన గుడిలోని దేవతలం. నీ మంచి మనసుకు మెచ్చి ఒక వరం ఇవ్వదలిచాం. కోరుకో!’ అన్నారు.అప్పుడు శివయ్య, వాళ్లకు నమస్కరించి ‘తల్లుల్లారా! నేను వరం కోరదలిస్తే నా మనసులో ఆశ రేకెత్తుతుంది. ఆశ, సంతోషాన్ని నాశనం చేస్తుంది. పైగా ప్రతిఫలం కోరి చేసేది నిజమైన సేవ అనిపించుకోదు. నాకు ఏ వరం వద్దు’ అని వినయంగా చెప్పాడు. వాళ్లిద్దరూ అతని మాటలకు మరింత సంతోషించి, ఇంటి ఆవరణ అంతా గంధం చెట్లతో నింపి మాయమై పోయారు. శివయ్య ఆ గంధపు చెట్లు అమ్ముకుంటూ, సాటి వారికి సహాయం చేస్తూ జీవించసాగాడు.

– ఎన్‌. శివనాగేశ్వరరావు

96032 26457

➡️