నౌకా విజయాలు .. విన్యాసాలు ..

Dec 3,2023 11:45 #Sneha

కాగితపు పడవలను వర్షపునీటిలో వదిలి, అవి ఎంతదూరం వెళతాయోనని వాటినే అనుసరించిన అనుభవం చాలామందికి ఉండే ఉంటుంది. డాబాపై చేరిన వాననీటిలో రంగురంగుల కాగితపు పడవలను వదిలి ఇతర పిల్లలతో పోటీపడే పిల్లలు.. చేతితో చేసిన చిన్న పడవలకే సంబరపడిపోతుంటారు. అదే పెద్దపెద్ద నౌకలను చూస్తే ఎలా ఉంటుంది..! అవి ఎంత పరిమాణంలో ఉంటాయి..! నౌకలు సముద్రంపైనే కాదు నీటిలోపల కూడా పయనిస్తాయా..! నేవీ డే సందర్భంగా ఆ విశేషాలు మీ కోసం..!

చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమెంతో తెలియాలంటే నౌకలే సాక్ష్యం. పెద్ద మొత్తంలో సరుకులను ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించేందుకు సముద్ర రవాణాలో నౌకలదే కీలకపాత్ర. ద్వీపకల్ప భారత భూభాగానికి తీరప్రాంతం భద్రత ఎంతో ప్రధానమైనది. ఈ సాగర జలాలగుండా శత్రుసైన్యాలను, ఉగ్రవాద చొరబాటుదారులను అడ్డుకునేందుకు రక్షణవ్యవస్థకు ముఖ్య సాధనాలు కూడా నౌకలే. మనదేశ రక్షణశాఖ అమ్ములపొదిలో ప్రస్తుతం 159 నౌకలున్నాయి. సాగర జలాల్లో అన్వేషణ, సహాయక చర్యల బాధ్యతల్ని నావికాదళం వీటి ద్వారా నిర్వహిస్తాయి. చేపలు పట్టడం, స్మగ్లింగ్‌, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధిస్తుంది. వరదలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించిన మానవతా సహాయ కార్యకలాపాలను చేపడుతుంది. ప్రమాదాల బారిన పడినప్పుడు పడవల నుంచి మత్స్యకారులను, సిబ్బందిని కాపాడటానికి నౌకలను వినియోగిస్తుంటారు.

సొర చేపల్లా..

నీటి లోపల సంచరిస్తూ శత్రువుల కదలికలను పసిగట్టే నావలను జలాంతర్గాములు అంటారు. ఈ నావలు డీజిల్‌, ఎలక్ట్రిక్‌ ఇంధనాలతో పనిచేస్తాయి. డీజిల్‌ జలాంతర్గాములు విద్యుత్తు తయారీకి అవసరమైన ఆక్సిజన్‌ కోసం సొరచేపల్లా తరచూ నీటిపైకి వస్తుంటాయి. ఆకారంలోనూ ఇవి సొరచేపల్లా కనిపిస్తాయి. వీటిలో దాదాపు 40 నుంచి 50 మంది రక్షణ సిబ్బంది ఉంటారు. వారికి అవసరమయ్యే ఆహారం, నీరు, ఆక్సిజన్‌ వంటివి ముందుగానే సిద్ధపరుచుకుంటారు.

మన జలాంతర్గాములు..

మనదేశంలో ప్రస్తుతం 16 జలాంతర్గాములు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 500 సబ్‌మెరైన్స్‌ సాగరగర్భంలో గస్తీ కాస్తున్నాయి. భారత నావికాదళానికి చెందిన మొదటి నాలుగు జలాంతర్గాములు ఐఎన్‌ఎస్‌ కల్వరి (ఎస్‌23), ఐఎన్‌ఎస్‌ ఖండేరీ (ఎస్‌22), ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ (ఎస్‌21), ఐఎన్‌ఎస్‌ కుర్సుర (ఎస్‌20) విశాఖపట్నంలో ఉన్నాయి. బంగాళాఖాతం దిగువన.. తీరానికి దగ్గరగా రెండు జలాంతర్గామి శిథిలాలు ఉన్న ఏకైక తీరం విశాఖపట్నం. మొదటిది జపాన్‌కు చెందిన ఆర్‌ఓ 110 జలాంతర్గామి. దీనిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖపట్నం హార్బర్‌కు కొన్ని నాటికన్‌ మైళ్ల దూరంలో బ్రిటీష్‌ రాయల్‌ నేవీ ముంచేసింది. రెండోది పాకిస్తాన్‌కు చెందిన పిఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామి. భారత ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ నావికాదళం 1971 డిసెంబర్‌ 4న అదే తీరంలో పాక్‌ ఘాజీని ముంచి వేసింది. భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధ విజయానికి గుర్తుగా ప్రతి యేటా డిసెంబర్‌ 4వ తేదీన నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

నౌకా విజయాలు
నౌకా విజయాలు

తొలి సబ్‌మెరైన్‌..

భారత నావికాదళంలో సబ్‌మెరైన్‌ల అవసరం ఉందని 1959లో ప్రతిపాదించారు. 1961లో తొలిసారిగా (యుఎస్‌ఎస్‌ఆర్‌) రష్యా సబ్‌మెరైన్‌ స్థావరంలో భారత సిబ్బంది శిక్షణ పొందారు. భారత తొలి ఐఎన్‌ఎస్‌ కల్వరి జలాంతర్గామి కమాండింగ్‌ ఆఫీసర్‌ కె.ఎస్‌.సుబ్రమణియణ్‌. మనదేశ జలాంతర్గాములు రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల్లో తయారుచేసినవి. ప్రస్తుతం స్వదేశీ తయారీలో అత్యాధునిక సాంకేతిక నౌకలతో పాటు అణు జలాంతర్గాములు రూపొందుతున్నాయి. హిందూ మహాసముద్రంలో భారత్‌ తిరుగులేని శక్తిగా నిలవాలంటే అత్యాధునిక నౌకలు అవసరమని 1999లోనే భారత ప్రభుత్వం గ్రహించింది. నౌకాదళానికి 2030 నాటికి 24 సరికొత్త జలాంతర్గాములను అందించాలని ప్రణాళిక చేసింది. దీనిలో భాగంగా విదేశీ తయారీదారులతో కలిసి ఒక్కో ప్రాజెక్టులో ఆరు చొప్పున ఉత్పత్తి చేసేలా పి-75, పి-75ఐ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది.

నయనానందం నావికా విన్యాసం..

విశాఖ తీరంలో ‘రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష’ లో భాగంగా ప్రదర్శనలు అబ్బురపరిచాయి. యుద్ధనౌక చుట్టూ హాక్‌ యుద్ధ విమానాలు వాయువేగంతో వృత్తాకారంలో తిరగటం, 90 డిగ్రీలకు పైగా వంగి చక్కర్లు కొట్టడం, తెరచాపలతో పడవల పరేడ్‌ ఆఫ్‌ సెయిల్స్‌, పీఎఫ్‌ఆర్‌ యుద్ధనౌకలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మిలాన్‌ 2024 తూర్పు నావికాదళ స్థావరమైన విశాఖపట్నంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. గత ఏడాది మిలాన్‌లో 39 దేశాల నావికాదళాలు పాల్గొన్నాయి, విమానాలు విన్యాసాలు చేసాయి. సముద్రశక్తి-2023 పేరుతో భారత్‌, ఇండోనేషియా ద్వైపాక్షిక విన్యాసాలు మే నెలలో ఇండోనేషి యాలోని బాటమ్‌ తీరంలో ఘనంగా నిర్వహించారు.

మ్యూజియం..

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఉన్న ఐఎన్‌ఎస్‌ కుర్సురా సబ్‌మెరైన్‌ను ప్రజల సందర్శనార్ధం మ్యూజియంలా మార్చారు. సోవియట్‌ యూనియన్‌ కాలంలో తయారుచేసిన ఈ సబ్‌మెరైన్‌ను 1969 డిసెంబర్‌ 18న భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది 91.3 మీటర్ల పొడవు, ఎనిమిది మీటర్ల వెడల్పులో ఉంటుంది. 1945 టన్నుల బరువున్న కుర్సురా 15.5 నాటికన్‌ మైళ్ల వేగంతో 280 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. దీనిలో ఎనిమిది మంది అధికారులు, 69 మంది నావిదళం ఉండేవారు. 33 సంంత్సరాల పాటు సేవలందించిన ఈ యుద్ధ నౌకతో ప్రస్తుతం టూరిజానికీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇలాంటి ప్రదర్శనలు దేశ వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు భావి తరాలు త్రివిధ దళాల్లో చేరేందుకు ఓ ప్రేరణ కలిగిస్తాయి.

నౌకా విజయాలు
నౌకా విజయాలు

మహిళలతోనే…!

సహజంగా నావికాదళంలో పురుషులే ఉండటం చూశాం ఇప్పటి వరకూ. కానీ పూర్తిగా మహిళా సిబ్బందే ఓ నౌకా యాత్రను చేపట్టిన విషయం తెలుసా..! ముంబయికి చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్‌ బెర్త్‌ జెట్టీ నుంచి ‘స్వర్ణకృష్ణ’ అనే నౌకను మహిళా నావికా సిబ్బంది నిర్వహిస్తున్నారు. ప్రపంచ నౌకాయాన చరిత్రలో మహిళలే సారథ్యం వహించడం ఇదే తొలిసారి. ‘స్వర్ణకృష్ణ’ పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్‌ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. ఇది గంటకు 20 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును మోసుకెళ్ళే సామర్ధ్యం ఉంది.

లోపల ఎలా ఉంటుందంటే..!

తొమ్మిది, పది అంతస్తులతో ఉండే భారీ నౌకల లోపలి భాగం అత్యాధునిక నగరాన్ని తలపిస్తుంది. అద్దాల మేడల్లో రకరకాల షాపింగ్‌మాల్స్‌, ఆట స్థలాలు, థియేటర్లు, స్టార్‌హోటళ్లు, సంగీత కచేరీలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్కులు, లిఫ్ట్‌ సౌకర్యాల వంటి ఆధునిక హంగులతో ఎంతో సువిశాలంగా ఉంటుంది. సబ్‌మెరైన్‌ లోపలి భాగం కూడా మనం మామూలుగా నడవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు.. స్లీపర్‌ బెడ్స్‌, క్యాబిన్స్‌, టార్బిడోలు, వంటగది, రేడియో మెసేజింగ్‌ రూమ్‌ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.

నౌకా విజయాలు
నౌకా విజయాలు
  • భారత్‌ నౌకాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న ఐఎన్‌ఎస్‌ కిర్పాన్‌ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు నౌకను కానుకగా ఇవ్వటం ఇదే తొలిసారి. 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. 25 నాట్స్‌ వేగంతో ప్రయాణించగలదు.
  • పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామిని సాగర గర్భంలోనే విడిచిపెట్టేశారు. ప్రస్తుతం ఈ స్పాట్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే 30 మీటర్ల లోతుకు వెళ్లాలంటే సర్టిఫైడ్‌ సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఘాజీని ధ్వంసం చేసిన ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ కమాండర్‌ ఇందర్‌సింగ్‌ 2023 అక్టోబర్‌లో మరణించారు. 2017లోనే రాణా కథానాయకుడిగా ‘ఘాజీ’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. యుద్ధ సమయంలో నావికాదళం చేసిన కృషికి ఈ చిత్రం అద్దం పడుతోంది. కోడే హేమలత9290735678
➡️