లింగ సమానత్వం సాధించాలి

Dec 10,2023 12:03 #Sneha

దియా మిర్జా బాలీవుడ్‌ నటి. కానీ మోడలింగ్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె ఓ నటిగా కన్నా సమాజ సేవకురాలిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన తను చదువుకునే రోజుల్లోనే సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. మోడలింగ్‌లో ‘మిస్‌ ఆసియా పసిఫిక్‌’ గా అవార్డు సాధించిన దియా మిర్జా. అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనంత వరకూ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మెరుగుకావని మిర్జా అంటారు. ఆమె కెరీర్‌లో, జీవితంలో జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

దియా మీర్జా తండ్రి ఫ్రాంక్‌ హండ్రిచ్‌. ఆయన జర్మనీ గ్రాఫిక్‌, ఇండిస్టియల్‌ ఫైర్‌ డిజైనర్‌.. ఆర్కిటెక్ట్‌, కళాకారుడు, ఇంటీరియర్‌ డిజైనర్‌. ఆమె తల్లి దీప, బెంగాలీ. ఆమె కూడా ఇంటీరియర్‌ డిజైనర్‌. అలాగే మద్యపాన బానిసలకు స్వచ్ఛందంగా సేవచేసే సామాజిక సేవా కార్యకర్త. దియా మిర్జాకు తొమ్మిది సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించారు. ఆ తర్వాత ఆమె తల్లి అహ్మద్‌ మిర్జాను వివాహమాడారు. ఆయన కూడా 2004లో మరణించారు. తన పెంపుడు తండ్రి ఇంటిపేరును తన పేరు పక్కనే చేర్చుకున్నారు మిర్జా. కొంతకాలం తర్వాత కన్నతండ్రి ఇంటిపేరును చేర్చుకుని ‘దియా మిర్జా హండ్రిచ్‌’గా తన పేరును మార్చుకున్నారు.

ఆమె పర్యావరణ పరిరక్షకురాలు. వాతావరణ మార్పులపై ప్రచారం చేయడం ఆమెకు నచ్చిన పని. తీరిక ఉన్నప్పుడల్లా పరిసరాలు-పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటారు. భూమిని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాలను సేకరిస్తుంటారు. దియా మీర్జా 19 ఏళ్ల వయస్సులో మిస్‌ ఏసియా పసిఫిక్‌ బ్యూటీ పెజెంట్‌ అవార్డును గెలుచుకున్నప్పడు.. ఆ వెంటనే ఆమె మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించారు. అందంగా ఉన్నప్పటికీ మోడల్‌గా మారడానికి కావాల్సిన ఎత్తు లేవని నిర్వాహకులు తిరస్కరించేవారని ఓ ఇంటర్వ్యూలో దియా చెప్పారు.

‘నా గురించి ఏమీ తెలియని వారు కూడా నేనేం చేయాలో, ఏం చేయకూడదో నిర్ణయిస్తున్నప్పుడు కలిగినంత బాధ, ఎత్తు లేననే మాటకు కలగలేదు. ఆ మాటలు నాపై పెద్దగా ప్రభావం చూపలేదు. కెరీర్‌ అంతటా స్త్రీ వివక్షను ఎదుర్కొన్నా.. కానీ ఎక్కడా రాజీ పడలేదు’ అని ఆమె అన్నారు.

ఆమె ఖైరతాబాదులోని విద్యారణ్య హైస్కూల్‌లో చదివారు. తర్వాత స్టాన్లీ జూనియర్‌ కాలేజీలో చేరి, ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందారు. దియా మిర్జా కాలేజీలో ఉన్నప్పుడు మీడియా సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. అదే సమయంలో ప్రచార, టి.వీ వాణిజ్య సంస్థల్లో నటించారు. బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘డమ్‌’ (2003), దీవానపన్‌, తుమ్‌కోనా భూల్‌ పాయెగా, తుమ్‌సా నాహిన్‌ దేఖా – ఎ లవ్‌ స్టోరీ, పరినీత, దస్‌, లగె రహో మున్నాబాయి మొదలగు చిత్రాల్లో నటించారు. అయితే ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సమాజ సేవకురాలిగా అధిక గుర్తింపు పొందారు. దాంతో 2017లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ‘గుడ్‌విల్‌ అంబాసిడర్‌’గా నియమితులయ్యారు.

ఆమె హరిత పరిసరాల కోసం చేసిన సేవలకు గాను ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడామీ వారు గ్రీన్‌ అవార్డును అందించారు. ‘భ్రూణ హత్యలు’, ‘హెచ్‌.ఐ.వి’, వంటి ప్రజలను జాగృతపరచే కార్యక్రమాలలో పాల్గొనేవారు. సినిమా రంగమే కాకుండా ఇతర రంగాల్లోనూ లింగ సమానత్వం సాధించాలని కోరుకునే మహిళ ఆమె. అందుకే అమె పెళ్లి కూడా విభిన్నంగా నిలిచింది. ఒక మహిళా పూజారి చేత పెళ్లి జరిపించారు. కన్యాదానం ఆచారాన్ని కూడా ఆమె పక్కనబెట్టారు.

పర్యావరణాన్ని ఏమాత్రం నష్టపరచడం ఇష్టంలేని ఆమె ఇంట్లో జరిగే వేడుకల్లో ప్లాస్టిక్‌ లేకుండా చూస్తారు. ఆమె కొడుకు పుట్టినరోజు వేడుకలను ప్లాస్టిక్‌ లేకుండా, ఏదీ వృథా కాకుండా ప్లాన్‌ చేశారు. అలంకరణలో వాడిన సహజసిద్ధ వస్తువులను భవిష్యత్‌ పార్టీల కోసం మళ్లీ భద్రపరిచారు. ‘ఒక నటిగా, పర్యావరణ కార్యకర్తగా, ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా పోషించిన అన్ని పాత్రల కన్నా ఓ బిడ్డకు తల్లిగా ఉండటం అన్నింటికంటే నాకు బాగా నచ్చుతుంది.. ఎందుకంటే, తల్లిగా భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంటుంది’ అని సగర్వంగా చెబుతున్నారు.

  • జననం : 1981 డిసెంబరు 9, హైదరాబాదు.
  • నివాసం : ముంబయి
  • వృత్తి : నటి, మోడల్‌, చిత్ర నిర్మాత
  • అవార్డులు : ఫెమినా మిస్‌ ఇండియా ఆసియా పసిఫిక్‌ 2000, మిస్‌బ్యూటిఫుల్‌ స్మైల్‌.
➡️