75వ గణతంత్ర దినోత్సవం.. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం..

75th republic day article constitutional indian constitution
  • ‘రిపబ్లిక్‌’ అంటే ‘గణతంత్రం’.. అంటే ప్రజలు తమను తాము పాలించుకునే పద్ధతి అని అర్థం. మనం మామూలుగా మాట్లాడే ‘పబ్లిక్‌’ అనే పదం నుండి వచ్చిందే ‘రిపబ్లిక్‌’. గ్రీకు భాషలో ‘రీ’ అంటే వ్యవహారాలు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడే రోజుల్లో మనం సంపూర్ణ స్వరాజ్యాన్ని 1930, జనవరి 26న నిర్వహించుకునేవాళ్లం. అయితే, అనుకోని విధంగా ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దాంతో 1950, జనవరి 26వ తేదీని గౌరవార్థంగా రాజ్యాంగ ప్రకటనకు కేటాయించుకున్నాం. 1946లోనే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు సుదీర్ఘ మార్పులతో దానికి తుది రూపం ఇచ్చింది. ఈ ఏడాది 75వ గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే రోజుగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలోని మనువాద పార్టీ రోజురోజుకూ ప్రజాస్వామ్యాన్ని హరించేస్తున్నది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎన్నడూ లేనివిధంగా 142 మంది సభ్యులను సస్పెండ్‌ చేసింది. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. చరిత్రను, చారిత్రక చిహ్నాలను ధ్వంసం చేస్తోంది. మనువాద భావజాలాన్ని రుద్దాలని చూస్తోంది. ఇవన్నీ గణతంత్రం స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలే. అసలు ప్రపంచంలో అతి పెద్ద గణతంత్ర రాజ్యంగా మనదేశం రూపుదాల్చిన జనవరి 26వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అంశంపైనే ఈ వారం ప్రత్యేక కథనం..

అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామంటే.. దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950, జనవరి 26న. అందుకే ఏటా ఆ రోజున రిపబ్లిక్‌ డే జరుపుకుంటాం. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. 1930, జనవరి 26న త్రివర్ణ పతాకం తొలిసారి ఎగిరింది. లాహోర్‌ వేదికగా 1930, జనవరి 26న జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. ఈ కాంగ్రెస్‌ సమావేశంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు తదితరులు పాల్గొన్నారు. వీరంతా సమిష్టిగా స్వరాజ్య సాధనకు కృషి చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి, భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, స్వపరిపాలన (డొమినియన్‌ స్టేటస్‌) వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్‌ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునే నేతల రాజీ వైఖరితో కాంగ్రెస్‌ వ్యవహరిస్తూ వచ్చింది.

నాడు కమ్యూనిస్టుల కృషితో భారత స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వరాజ్యం నినాదం ముందుకు వచ్చింది. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మహాసభలో ఇద్దరు కమ్యూనిస్టులు మౌలానా హస్రత్‌ మోహానీ, స్వామీ కుమారానంద ‘సంపూర్ణ స్వరాజ్యం’ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సోవియట్‌ విప్లవ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడంతో పాటు దోపిడీ, పీడనలేని కష్టజీవుల రాజ్యమైన సోషలిస్టు సమాజాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకున్నది. దానికోసం ప్రజలను వర్గ, ప్రజా సంఘాల్లో సమీకరించి, అనేక వీరోచిత పోరాటాలు నిర్వహించింది.

స్వాతంత్య్రోద్యమంలో పెరిగిపోతున్న కమ్యూనిస్టుల ప్రాభవాన్ని, వారి భావజాలానికి ప్రజల్లో వస్తున్న ప్రతిస్పందనను చూసి బ్రిటిష్‌ పాలకులు బెదిరిపోయారు. కమ్యూనిస్టు పార్టీని శైశవదశలోనే అంతం చేసేందుకు వరుసగా మూడు కుట్ర కేసులు బనాయించారు. 1922లో పెషావర్‌ కుట్ర కేసు, 1924లో కాన్పూర్‌ కుట్ర కేసు, 1929లో మీరట్‌ కుట్ర కేసులు పెట్టి, అనేక మంది కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేశారు.

కమ్యూనిస్టులతో పాటు సుభాష్‌ చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్‌ పార్టీలో వేడి పుట్టించి, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. దీన్ని ఆమోదిస్తూ 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 1920లో ఎఐటియుసి ఏర్పడ్డాక దాని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికవర్గాన్ని సంఘటితం చేయడమేగాక జాతీయోద్యమం ఆ కార్మికోద్యమాన్ని అనుసంధానం చేసింది కమ్యూనిస్టులు. అఖిలభారత కిసాన్‌సభ, విద్యార్థి ఫెడరేషన్‌, మహిళా సంఘం, ప్రజారచయితల, కళాకారుల వేదిక (ఇప్టా) వంటివి నిర్మించి, సామాన్య ప్రజానీకానికి జాతీయోద్యమం పట్ల చైతన్యాన్ని కల్పించటంలో కమ్యూనిస్టుల పాత్ర అద్వితీయం. ‘అందరికీ తిండి-బట్ట-ఇల్లు’, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ వంటివి జాతీయోద్యమ నినాదాలుగా మారుమోగడం వెనుక కీలకపాత్ర కమ్యూనిస్టులదే.

స్వతంత్ర భారతావని తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్‌ స్వీకరించడంతోపాటు, జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత తెలుసుకుని, దేశ స్వాతంత్రం కోసం అశేష త్యాగాలు చేసిన మహనీయులను ఈ రోజు స్మరించుకోవాలి. నేటి యువతలో ఆ స్ఫూర్తిని నింపాలి.

రాజ్యాంగ రచన నేపథ్యం..

రాజ్యాంగ రచనకు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసిన ఎంతోమంది మేధావులు ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. వారిలో అత్యధికులు న్యాయవాదులు. రాజకీయంగానూ వారు ఉన్నతస్థాయి నేతలే. జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, బి.ఆర్‌.అంబేద్కర్‌, కె.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి న్యాయకోవిదులే. నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో రెండు ప్రధానమైన యూనియన్‌ రాజ్యాంగ, అధికారాల కమిటీలకు అధ్యక్షులు. రాష్ట్రాల రాజ్యాంగ, ప్రాథమిక హక్కులపై సలహా కమిటీలకి సర్దార్‌ పటేల్‌ అధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక మెజార్టీ ఉండేది కనుక నెహ్రూ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పాట్నా బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షులుగా ఎన్నుకుంది. దానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలన్నీ కాంగ్రెస్‌ ముందుగా నిర్ణయించేది. రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్‌ అధ్యక్షులు కాగా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, కె.ఎం.మున్షీ, ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌, టి.టి. కృష్ణమాచారి, మాధవరావు సభ్యులు. వీరంతా బ్రిటిష్‌ పార్లమెంటరీ విధానాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు. అయితే రాజ్యాంగం లోపరహితమని అంబేద్కర్‌ కూడా భావించలేదు. ఆయన 1949, నవంబర్‌ 25న ఇలా చెప్పారు.. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు. దాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు చెడ్డవాళ్ళయితే అది పనిచేయదు. అదే ఎంత చెడ్డ రాజ్యాంగమైనా అమలు జరిపేవారు మంచివారయితే బాగా పనిచేస్తుంది. ఒక క్రియాశీల రాజ్యాంగ పని మొత్తం దాని స్వభావంపైనే ఆధారపడి ఉండదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు వంటి వాటిని సమకూర్చడం మాత్రమే రాజ్యాంగం పని. ఈ యంత్రాంగాలు ఎలా పనిచేస్తాయనేది ప్రజలపైనా, వారు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనా ఆధారపడి ఉంటుంది. అవి ఎలా ప్రవర్తిస్తాయో ఎవరు చెప్పగలరు? భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోతే.. కమ్యూనిజం లాంటిదే ప్రత్యామ్నాయం అవుతుంది. భారత్‌లో అందరికీ భూమి లేదు, వర్షపాతం తక్కువ, ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించకుండా పరిస్థితులను మెరుగుపరచలేం. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని నేను అనుకోవడం లేదు’ అని అంబేద్కర్‌ అన్నారు. ప్రస్తుత పాలకులు రాజ్యాంగంపైనా, దాని వివిధ విభాగాలపైనా చేస్తున్న దాడిని, వ్యవహరిస్తున్న తీరుని చూస్తుంటే.. అంబేద్కర్‌ అన్న మాటలు అక్షరసత్యాలని నిరూపితం.

సవరణలు..

భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండేళ్ల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షల ఖర్చయ్యింది. రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం. అందులోని అనేకాంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి క్రోడీకరించారు. బ్రిటిష్‌ పరిపాలన నుంచి విముక్తి తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. సర్‌ ఐవోర్‌ జెనింగ్స్‌ రాజ్యాంగ పరిషత్‌ను ‘న్యాయవాదుల స్వర్గం’ అన్నారు. జయప్రకాష్‌ నారాయణ ‘స్పందనలేని న్యాయవాదుల తతంగం’ అని మరో కోణంలో వ్యాఖ్యానించారు. ‘దేశం ఎలాంటి కల్లోలిత పరిస్థితుల్లో ఏర్పడిందో వారు చూడలేకపోయారు. మౌలిక సంస్కరణలు చేయకపోతే లాభం లేదు!’ అని ఆయన అన్నారు. ఇప్పటికి రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. ధనికవర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఈ సవరణలలో అత్యధిక ప్రాధాన్యత లభించింది. శ్రామికవర్గ దృక్పథం, ప్రజాస్వామ్య పటిష్టీకరణ కోణం నుంచి చేయాల్సిన ముఖ్య సవరణలు అలాగే మిగిలిపోయాయి. అందులో పని హక్కును కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వాల తొలగింపు అవకాశాన్ని నిరోధించడం తదితరాలున్నాయి.

నయా ఉదారవాద యుగంలో..

రాజ్యాంగం ప్రజలందరికీ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా కల్పించింది. మత స్వేచ్ఛ, నచ్చిన విశ్వాసం కలిగి ఉండటం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానతా సాధన వంటి సూత్రాలను ప్రతిపాదించింది. అందుకు తగ్గట్టే స్వాతంత్య్రం వచ్చాక తొలి రెండు, మూడు దశాబ్దాలలోనూ స్వావలంబన, స్వయం పోషకత్వం, లౌకిక ప్రజాస్వామ్యం, సంక్షేమ రాజ్యం వంటివి విన్నాం. ఇదంతా గతమైపోయింది ఇప్పుడు. మూడు దశాబ్దాలుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు స్వావలంబనను సమాధి చేశాయి. ప్రభుత్వరంగాన్ని పరాధీనం చేసే కార్పొరేటు విధానాలకు పట్టం కట్టాయి. ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యత విస్మరించి, ప్రతిదీ ప్రైవేటీకరించే తీరు పెరిగింది. రాజ్యాంగ ఆదేశ సూత్రాల్లో పేర్కొన్న సార్వత్రిక విద్య అమలులో చాలా వెనకబడే ఉన్నాం. పదేళ్లలోపు అందరికీ ఉచిత విద్య అందించాలని ఆదేశ సూత్రాలు చెప్పాయి. కానీ విద్యాహక్కు చట్టం వచ్చింది 2008లో మాత్రమే. ఇప్పుడు నూతన విద్యావిధానం దాన్ని పూర్తిగా నీరుగార్చేలా ఉంది. పౌష్టికాహారం, అందరికీ ఆరోగ్యం, సాంస్కృతిక అభివృద్ధి, నివాసం, ఉపాధి, స్వావలంబన, ప్రభుత్వ రంగం, ఆహార భద్రత, హరిత విప్లవం తదితరాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇంకా అత్యధికులు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. అసమానతలు ప్రపంచీకరణతో మరింత తీవ్రమై, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం వంటి మాటే లేదు. రాజ్యం తన బాధ్యత నుండి తప్పుకోవాలనేదే ప్రపంచీకరణ ప్రధాన సూత్రం. ప్రతిదీ ప్రైవేటే.. చివరికి బ్యాంకింగ్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ వంటి కీలక రంగాలనూ కార్పొరేట్లకు కట్టబెట్టడమే దాని విధానం.

చరిత్రను చెరిపేసే తప్పిదాలు..

పన్నెండవ తరగతి చరిత్ర పుస్తకాల నుంచి ”మొఘల్‌ సామ్రాజ్యం” అనే పాఠాన్ని తొలగించింది. ఇదొక్కటే కాకుండా సిలబస్‌లో చేసిన ఇతర మార్పులూ వివాదాస్పదమయ్యాయి. ఎన్‌సీఈఆర్‌టీ, 12వ తరగతి చరిత్ర పుస్తకాన్ని ”థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ” అనే పేరుతో మూడు భాగాలుగా ప్రచురించింది. ఇందులో రెండో భాగంలోని తొమ్మిదో అధ్యాయంగా ఉన్న ”కింగ్‌ అండ్‌ హిస్టరీ, మొఘల్‌ దర్బార్‌” అనే పాఠ్యాంశాన్ని పుస్తకం నుంచి తొలగించింది. కొత్త చరిత్ర పుస్తకాల్లో మొఘల్‌ పాలకులకు సంబంధించిన ఈ 28 పేజీల అధ్యాయం ఇప్పుడు లేదు. పాఠ్యపుస్తకాల హేతుబద్ధీకరణలో భాగంగా చరిత్ర పుస్తకంతో పాటు పొలిటికల్‌ సైన్స్‌ నుంచి కూడా పాఠ్యాంశాలను తొలగించారు. పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకంలో నుంచి హిందుత్వవాదుల పట్ల మహాత్మాగాంధీకి ఉన్న అయిష్టత, గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం వంటి వాక్యాలను తీసేశారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే గురించి పుస్తకంలో రాసిన ”ఆయన పుణే బ్రాహ్మణుడు” అనే వాక్యాన్ని కూడా తొలగించారు. అంటే గాంధీ చరిత్ర కన్నా.. దేశద్రోహి గాడ్సే. అలాగే, 11వ తరగతి సోషియాలజీ పుస్తకం నుంచి 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన అంశాలనూ తీసేశారు. ఇలా చేయడం తప్పుడు చరిత్రను బోధించినట్లే. పుస్తకాల్లో ఈ మార్పును భారతదేశం నుంచి మొఘల్‌ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నంగా చాలా మంది చూస్తున్నారు. ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించేందుకే ఎన్‌సీఈఆర్‌టీ ఇలాంటి మార్పులు చేస్తోందన్నది అభివృద్ధికాముకుల అభిప్రాయం.

వ్యవస్థల నిర్వీర్యం..

రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య సమతుల్యతతో కూడిన స్వయంప్రతిపత్తి కల్పించింది. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ కేంద్ర నిరంకుశత్వానికి బలైపోతున్నాయి. ఆఖరికి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఒక సభలో ప్రధాని మోడీపై పూర్తి గౌరవం ఉందని చెప్పుకోవడం.. న్యాయమూర్తుల నియామకాల్లోనూ కేంద్రం జోక్యం చేసుకోవడం పెరిగిపోతున్నది. ఆర్టికల్‌ 350ను రద్దు చేయడం. దేశాన్ని కాపాడే స్వతంత్రత కలిగిన సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. దేశ రక్షణకు సంబంధించినంత వరకూ సైన్యాలు ప్రభుత్వాలకు లోబడే పనిచేస్తాయి. కానీ సైన్యాధికారులు రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం ఇప్పుడే చూశాం. కాశ్మీర్‌ సమస్య, పాక్‌తో, చైనాతో విభేదాల వరకూ సైన్యాన్ని కీర్తించడమే ఇప్పుడు దేశభక్తి. ఈ భావం పెంచడం దేశానికే ప్రమాదకరం. సైన్యాధిపతులు విధానపరమైన వ్యూహాత్మకమైన వ్యాఖ్యలు చేయడం. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం గత ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఇవన్నీ అంబేద్కర్‌ చేసిన హెచ్చరికలను గుర్తుచేస్తున్నాయి.

చెరిపేస్తున్న చిహ్నాలు..

సామ్రాజ్యవాద వ్యతిరేకత స్వాతంత్య్రోద్యమంలో ఒక ముఖ్యమైన భాగం. ఆ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా నేడు మోడీ ప్రభుత్వం అమెరికా ముందు సాగిలపడుతున్నది. ఇది మన స్వాతంత్య్ర సమరయోధులను అవమానించడం కాదా? ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధం విషయంలో.. భారత్‌ చిరకాలంగా పాలస్తీనాకు కొనసాగిస్త వచ్చిన మద్దతు నుంచి పక్కకు తప్పుకుని యూదు దురహంకార ఇజ్రాయిల్‌కు కొమ్ము కాసింది. ఇది అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. గాజాలో ఇజ్రాయిల్‌ వందరోజులుగా సాగిస్తున్న ఊచకోతను ఆపాలని, ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో దక్షిణాఫ్రికాలో పిటిషన్‌ వేసింది. భారత్‌ దీనికి భిన్నమైన వైఖరినవలంభిస్తూ అమెరికా పంచన చేరింది. నల్గురు శంకరాచార్యుల అభ్యంతరాలను సైతం బేఖాతరు చేసింది. అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చిన చోట నిర్మించిన రామమందిరం పూర్తికాకుండానే హడావుడిగా ఈ నెల 19న ప్రారంభోత్సవం చేయడం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఫక్తు రాజకీయ ఎజెండాలో భాగమే.

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం..

రాజ్యాంగం మొదటి అధికరణం దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా పేర్కొంటున్నది. కేంద్రం రాష్ట్రాల హక్కులు, విధులు, వనరుల వివరాల గురించి ప్రత్యేకంగా పేర్కొంది. నాడు కాంగ్రెస్‌, నేడు బిజెపి ప్రభుత్వాలు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను నిరంకుశంగా రద్దు చేశాయి. మోడీ ప్రభుత్వం ఏకంగా ప్రణాళికా సంఘాన్నే ఎత్తేసింది. అప్పుడు నీతి అయోగ్‌ పేరిట ప్రధాని కార్యాలయ ఆదేశాలే అమలయ్యాయి. ఇలా హక్కుల్ని హరించడం కేంద్రీకృత విధానానికి పరాకాష్ట. ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల గురించి బిజెపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాష్ట్రాల హక్కుల్ని హరించేలా అన్నింటిలో కేంద్రం పెత్తనం పెరిగిపోయింది. అది నదీజలాల వివాదాలైనా.. మరో వివాదమైనా.. మన రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకుండా.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రాజధాని అనేది నేటికీ సమస్యాత్మకంగా చేసి.. ఆంధ్రుల నోట్లో మట్టికొట్టింది. గతంలోలా రాష్ట్రాలూ ప్రధానంగా ప్రాంతీయపార్టీల పాలిత రాష్ట్రాలు హక్కుల కోసం గట్టిగా పట్టుబట్టడానికి బదులు రాజీపడుతున్నాయి. ప్రజాభ్యున్నతి, నిత్యావసరాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ నేపథ్యంలో అవి బలహీనపడటం ప్రజలకూ నష్టం. రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌తో విలీన ఒప్పందం.. వారి మనోభావాలను పక్కనబెట్టి.. దేశంలో అంతర్భాగం అంటూ అక్కడ భూములపై పెత్తనం చలాయిస్తూ కాశ్మీరీయుల భూములను అన్యాక్రాంతం చేస్తోంది.

పౌరస్వేచ్ఛ.. హత్య..!

ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్‌ పౌరస్వేచ్ఛ.. భావప్రకటనా స్వేచ్ఛ.. రాజ్యాంగంలో 19వ అధికరణంలో వాక్‌, సభా సంఘ, నివాస, సంచార, వృత్తి ఎంపిక స్వేచ్ఛలు కల్పించబడ్డాయి. పౌరుల మధ్య ఎలాంటి వివక్షా చూపించకూడదని 15వ అధికరణంలో పేర్కొన్నారు. మనదేశంలో ఏ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే. అందరికీ ఒకే రక్షణ ఉండాలని 14వ అధికరణంలో చెప్పారు. అయితే, మోడీ హయాంలో పెరిగిన అసహన దాడులు భావప్రకటనా స్వేచ్ఛకు ప్రధాన ప్రతిబంధకాలయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగో స్థంభంగా పేర్కొనే మీడియాపై ఉక్కుపాదం మోపింది. తనను ప్రశ్నించే వ్యక్తులపై, శక్తులపైనే కాకుండా మీడియాపైనా కుట్రపూరిత కేసులు బనాయిస్తోంది. ఈ నేపథ్యంలో అంతకుముందు ఎన్డీటివీ, ది వైర్‌, నేడు న్యూస్‌క్లిక్‌ వంటి ప్రత్యామ్నాయ మీడియా గొంతును నొక్కేస్తుంది. ప్రబీర్‌ పుర్కాయస్థ సహా పలువురు జర్నలిస్టులను, కాలమిస్టులను అరెస్టు చేసింది.

మణిపూర్‌లో మైనార్టీ కుకీలపై మెయితీలను రెచ్చగొడుతూ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది. జమ్మూకాశ్మీర్‌ను ముక్కచెక్కలు చేసి, రాష్ట్ర హోదాను తొలగించి, అక్కడి రాజకీయ నాయకులను ఏడాది పాటు గృహనిర్బంధంలో ఉంచింది. కాశ్మీర్‌ను బహిరంగ జైలుగా మార్చింది. అక్కడ ప్రజల హక్కులన్నింటినీ హరిస్తూ.. ప్రెస్‌క్లబ్‌ మీద సైతం బిజెపి దాడి చేసింది. కల్బుర్గి, గోవింద పన్సారే, గౌరీ లంకేశ్‌ వంటి హేతువాదులను, జర్నలిస్టులను సంఘపరివార్‌ మూకలు హత్య చేశాయి. విశ్వవిద్యాలయాల్లోనూ విద్వేష వాతావరణం వెల్లువెత్తింది. చివరికి సామాజిక మాధ్యమాల్లో తమతో విభేదించే, ప్రశ్నించే వారెవరైనా.. వ్యతిరేకత తెలిపేవారైనా దేశద్రోహులుగా ముద్ర వేసి జైలులో కుక్కతోంది. ఎన్‌ఆర్‌ఎ సిఎఎ పేరుతో ఒక మతం పట్ల వివక్షను చూపించింది.

ఏం తినాలో.. ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఏ సినిమా తీయాలో.. ఏ చిత్రం వేయాలో సంఫ్‌ుపరివారం నిర్దేశిస్తోంది. అత్యాచార కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా.. నేరస్తులకు దన్నుగా నిలుస్తున్నది. మహిళా రెజ్లర్ల పోరాటం ఇందుకొక తిరుగులేని ఉదాహరణ. గుజరాత్‌ అల్లర్లలో అత్యంత పాశవికంగా జరిగిన బిల్కీస్‌ బాను ఉదంతంలో నేరస్థులను నిస్సిగ్గుగా విడుదల చేసి, పూలదండలు వేసి మరీ ఊరేగించింది. దీనిపై ఇటీవల సుప్రీం సంచలనాత్మక తీర్పు చెప్పింది. నేరస్థులను తిరిగి జైలుకు పంపాలని ఆదేశించడం ఆహ్వానించాల్సిన విషయం.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి..

కార్పొరేటీకరణ నేపథ్యంలో మూడు నల్లచట్టాలు చేసి, రైతులను ఏడాది పాటు దేశ రాజధాని నడిరోడ్డుపై ఉంచింది. చివరకు రైతుల పోరాటానికి తలొగ్గక తప్పని పరిస్థితి. ఏదేమైనా కార్పొరేట్లకు కొమ్ముకాసే ధోరణి ఒకవైపు.. మూల హిందూత్వ సిద్ధాంత వ్యాప్తి మరోవైపు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించిన విధానం ఇదే. దళితులు, వెనుకబడిన వారు, మైనార్టీలు, మహిళలు, పిల్లలు అభద్రతలో ఉన్నారు. రిజర్వేషన్ల విషయంలో వారి మధ్యే తంపులు పెట్టి, తమాషా చూస్తోంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెచ్చినట్లే తెచ్చి.. 2029 వరకూ పెండింగ్‌లో పెట్టేలా అతితెలివి ప్రదర్శించింది. మహిళలందరికీ ఉచిత విద్య, ఉపాధి గ్యారంటీ వంటివి.. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, లౌకిక విలువల కోసం పోరాడటంతో బాటు.. రాజ్యాంగ పునాదిని రక్షించుకోవడం కోసం కూడా పోరాడాల్సిన అగత్యమేర్పడింది. ఇదే నిజమైన గణతంత్ర స్ఫూర్తి. ఏడాదిపాటు సాగిన రైతాంగ పోరాటం ఓ చారిత్రక విజయం. దేశవ్యాప్తంగా కార్మిక-కర్షక ఆందోళనలు జరిగాయి. మన రాష్ట్రంలో నేటికీ జరుగుతున్న ఉక్కు పోరాటం, నెలరోజులకు పైగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్‌ తదితర కార్మికోద్యోగుల పోరాటాలు జరిగాయి. ప్రాథమిక హక్కుల్లో పనిహక్కు, ఫెడరలిజాన్ని మరింత దృఢతరం చేసేందుకు కృషి జరగాలి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, లౌకిక సూత్రాల హరణకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరాగాంధీని 1977లో ప్రజలు ఓడించారు. అప్పుడు వచ్చిన జనతా ప్రభుత్వం ఎవరూ అత్యవసర పరిస్థితి విధించే అవకాశం లేకుండా రాజ్యాంగాన్ని సవరించింది. అదే స్ఫూర్తితోఇప్పుడు లౌకికతత్వం, సామాజిక న్యాయం, స్వావలంబన, మానవహక్కులు వంటి వాటికి చేటు తెచ్చే పోకడలను తిప్పికొట్టాలి.

ఈ ఏడాది విశేషాలివే..!

గణతంత్ర దినోత్సవాలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథంలో డ్రెస్‌ రిహార్సల్స్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలకు ఫ్రెంచ్‌ నుంచి ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. వేడుకల్లో మొదటిగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)కు సంబంధించిన ఉమెన్‌ మార్చింగ్‌, బ్రాస్‌ బ్యాండ్‌ కాంటెంజెంట్లు కర్తవ్య మార్గంలో పాల్గొంటాయి. ఒక అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంక్‌ మహిళా అధికారి, ఇద్దరు సబార్డినేట్‌ ఆఫీసర్లు మొత్తం 144 మంది మహిళా బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లకు నాయకత్వం వహిస్తారు. అదే సమయంలో మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 2,274 మంది క్యాడెట్‌లు నెల రోజుల పాటు జరిగే నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) రిపబ్లిక్‌ డే క్యాంప్‌ 2024లో పాల్గొంటారు. డిసెంబరు 30, 2023న సర్వ ధర్మ పూజతో ఢిల్లీ కాంట్‌లోని కరియప్ప పరేడ్‌ గ్రౌండ్‌లో క్యాంప్‌ 2024 ప్రారంభమైంది. ఈ వైవిధ్యమైన భాగస్వామ్యంలో జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌ నుంచి 122 మంది క్యాడెట్‌లు ఉన్నారు. ఈశాన్య ప్రాంతం నుంచి 171 మంది కాకుండా మినీ ఇండియాకు సంబంధించిన సూక్ష్మరూపాన్ని ప్రభావవంతంగా చిత్రీకరిస్తున్నారు.

ముగింపు..

ఈ విధంగా రాజ్యాంగ మౌలిక లక్షణాలైన లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తున్నది. దీనిని తిప్పికొట్టి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రిపబ్లిక్‌ డే స్ఫూర్తితో ఆ దిశగా ఉద్యమిద్దాం.

  • శాంతిశ్రీ, 8333818985
➡️