అబ్బురం..విశాఖ బాలోత్సవం

Dec 24,2023 11:23 #chirumuvallu, #Sneha

విశాఖ నగరంలోని సెయింట్‌ ఆంథోనీ తెలుగు మీడియం పాఠశాలలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో తలపెట్టిన విశాఖ బాలోత్సవం ఆద్యంతం చిన్నారుల్లో ఉత్సాహం నింపింది. వారిలోని సృజనాత్మకతను వెలికితీసింది. శాస్త్రీయ ఆలోచనలు పంచుకునేందుకు వేదికైంది. విశాఖ నగరానికి చెందిన 130 పాఠశాలల నుంచి సుమారు ఆరు వేల మంది విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొని సందడి చేశారు. మట్టి బొమ్మలతో సరికొత్త సందేశాలిచ్చారు. బాలికా రక్షణ, మొక్కల పరిరక్షణ, పర్యావరణ ప్రాధాన్యత అంశాలపై చిట్టి చేతులతో ఆకృతులను తీర్చిదిద్దారు. నాలుగు వేదికలపై సాగిన సాంస్క ృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రూపు డ్యాన్సులకు వీక్షకులు చప్పట్ల వర్షం కురిపించారు. క్లాసికల్‌, సోలో, ఫోక్‌ డ్యాన్స్‌లతో చిన్నారులు అదరగొట్టారు. జానపద కళారూపాలు కట్టిపడేశాయి. అకడమిక్‌ ఈవెంట్స్‌లో క్విజ్‌, తెలుగులో మాట్లాడటం, బెస్ట్‌ అవుట్‌ ఆఫ్‌ వేస్ట్‌, ఫైర్‌ లెస్‌ కుకింగ్‌ అంశాలపై సాగిన పోటీలు బాలల్లోని నిగూఢమైన ప్రతిభను వెలికితీశాయి. వార్త, కథ, కవిత రచన, వ్యాసరచన, డిబేట్‌, మెమొరీ టెస్ట్‌, కథ చెబుతాను అంశాలపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. కళారూపాల ప్రదర్శనకు హాజరైన వారు కాస్ట్యూమ్స్‌ ధరించి నేరుగా ఉత్సవ వేదికల వద్దకే వచ్చారు. దీంతో వారు ఈ బాలల ఉత్సవం పట్ల ఎంతటి ఆసక్తి కనబరిచారో ఇట్టే అర్థమవుతోంది. పౌరాణిక ప్రదర్శనలు ఈ మెగా చిల్డ్రన్స్‌ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టు, ఇతర వృక్షాల కింద ప్రకృతి సహజ సిద్ధ వాతావరణంలో ఈ ఉత్సవం సాగింది. వైవిధ్యభరితమైన అంశాలను ఎంచుకొని ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ఈ బాలోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. 84 ఈవెంట్స్‌కి 65 మంది న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి బుల్లి విజేతలను నిర్ణయించారు. వారికి అతిథులు బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవ నిర్వహణలో వాలంటీర్ల పాత్ర, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం మరువలేనివి.

– కోడూరు అప్పలనాయుడు,

9491570765

➡️