ఒకే ఏడాదిలో 18 సినిమాలు

Jan 7,2024 06:59 #actor, #Profiles, #Sneha
actor vijaykanth profile

విజయకాంతంటే ‘సింధూరపువ్వు, కెప్టెన్‌ ప్రభాకర్‌, పోలీస్‌ అధికారి’ వంటి సంచలనాత్మక సినిమాలతో తెలుగునాట కూడా బ్రహ్మాండంగా విరాజిల్లిన మొదటి తమిళహీరోగానే తెలుసు నిన్నటిదాకా.. కానీ తమిళ మిత్రుల నుంచి ఆయన గొప్పదనం గురించి తెలుసుకున్నాక చాలా గౌరవం కలుగుతుంది. కథ చెప్పడానికొచ్చిన సహాయ దర్శకులకైనా, కబుర్లాడటానికొచ్చిన సన్నిహితులతోనైనా విజయకాంత్‌ది ఒక్కటే మాట.. ‘తిన్నావా లేదా అది చెప్పు ముందు.. లేదంటే చెయ్యి కడుక్కునిరా తిందువుగానీ.. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం..!’ అంటారు. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మరణించిన విజరుకాంత్‌ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.విజయకాంత్‌ అసలు పేరు విజరురాజ్‌ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో జన్మించారు. ఆయన తండ్రి అలగర్‌స్వామి ఒక రైస్‌ మిల్లు యజమాని. చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో విజయకాంత్‌ తరచుగా స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్తుండేవారు. ఎంజీఆర్‌ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఎంజీఆర్‌ సినిమాల్లోని ప్రతీ సీన్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత చెన్నైకి వెళ్లి, సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నైకి మారేంత వరకూ తమిళ సినిమాల్లో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల్లో నటించేందుకు ఎక్కడికెళ్లినా శరీరం రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయని ఆయన వివిధ సందర్భాలలో చెప్పారు. నిరంతర ప్రయత్నాల తర్వాత 1979లో ఎంఏ కాజా దర్శకత్వంలో ‘ఇనిక్కమ్‌ ఇళమై’ సినిమాతో ఆయన చిత్రసీమలో ఆరంగేట్రం చేశారు. కాజాకు విజరురాజ్‌ పేరు నచ్చలేదు. ఆ సమయంలో రజనీకాంత్‌ హవా బాగా నడుస్తుండటంతో ఆయన పేరులో నుంచి కాంత్‌ అనే పదాన్ని తీసుకొని విజరురాజ్‌ పేరును విజయకాంత్‌గా మార్చారు.

  • ఏడాదిలోనే..

కేవలం తమిళ చిత్రపరిశ్రమకు మాత్రమే పరిమితమైన అతి కొద్దిమంది హీరోల్లో విజయకాంత్‌ ఒకరు. ఈయన 1979లో వచ్చిన ‘ఇనిక్కుమ్‌ ఇళమై’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తమిళ సినిమాలోని పెద్దనటుల్లో ఒకరిగా విజయకాంత్‌ పేరు సంపాదించారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు డబ్‌ చేసేవారు. విజయకాంత్‌ కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు. ఒకే ఏడాది (1984)లో ఏకంగా 18 సినిమాల్లో నటించి, రికార్డు నెలకొల్పారు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌, రామ నారాయణన్‌ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. కొత్త నటులను, దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు. 54 మంది దర్శకులను ఇండిస్టీకి పరిచయం చేశారు. ఎంతో మంది కొత్త నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు విజయకాంత్‌ అవకాశం కల్పించారు.డూప్‌ లేకుండా..’నలై ఉనాదు నాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో తనకు డూప్‌గా పెట్టిన ఆర్టిస్ట్‌ ప్రమాదవశాత్తూ చనిపోయారు. అప్పటి నుంచి డూప్‌ లేకుండా తనే స్టంట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన ఫైటింగ్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. అలా చాలా సినిమాల్లో డూప్‌ లేకుండానే నటించడంతో, అనేకసార్లు భుజం గాయంతో బాధపడ్డారు కూడా. ఆయన మనస్తత్వం తెలిసి, చాలామంది అభిమానించారు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరచుకున్నారు. ఎంత పెద్ద ఎమోషనల్‌ డైలాగ్‌లు అయినా తన స్టైల్‌లో సింగిల్‌ టేక్‌లో చెప్పేవారు. విజయకాంత్‌ సినిమా రిలీజ్‌ రోజు పండుగ వాతావరణం ఉండేది. గ్రామాల నుంచి బండ్లు కట్టుకుని, పండుగకు వెళ్తున్నట్లు కుటుంబంతో కలిసి సినిమాకు తరలి వచ్చేవారు అభిమానులు. ఎన్నో విజయవంతమైన అవార్డులు వరించాయి.విజరుకాంత్‌ సెట్‌లో ఉన్నారంటే అందరికీ భోజనం పెట్టేవారు. ఆ రోజుల్లో చాలా మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు, లైటింగ్‌ బార్సు, సౌండ్‌ యూనిట్‌.. ఇలా అందరికీ ఒకే భోజనం పెట్టించేవారు. ఎలాంటి భేషజం లేకుండా అందరితో కలిసి ఆయనా భోజనం చేసేవారు.

  • రాజకీయాల్లోకి..

విజయకాంత్‌ 2005లో దేశీయ ముర్కోపు ద్రవిడ కలగం (డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్ష నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాతి ఏడాది నుంచి, ఆయన పుట్టిన రోజును ‘పేదరిక నిర్మూలన దినోత్సవం’గా నిర్వహించేవారు.

 

పుట్టిన తేది : 25, ఆగష్టు 1952.

మరణం : 28, డిసెంబర్‌ 2023

భార్య : ప్రేమలత

పిల్లలు : ఇద్దరు

➡️