రథసారధి

Apr 14,2024 13:01 #Sneha, #Translation story

గేట్‌ వే అఫ్‌ ఇండియా రేవు నుంచి ఎలిఫెంటా కేవ్స్‌కి బయలుదేరే మొదట పొగ నావ పొద్దున్న ఏడున్నరకి బయలు దేరుతుంది. అందుకే మారుతి అక్కడ ఆరున్నరకల్లా ఉండాలి. అతని బాధ్యతలు నిర్దిష్టంగా నిర్ణయించబడ్డాయి- నావలో కిందటి రాత్రి ప్రయాణికులు వదిలేసిన చెత్త చెదారం ఊడ్చి శుభ్రం చేయడం, తడిగుడ్డ పెట్టడం. మరో నావలోనూ మళ్ళీ అదే పని. అతను పొద్దున్నే లేచిన దగ్గరనుంచి అతను అక్కడ చేసే పని అదే ప్రతి రోజూ. అదే అతని బాధ్యత.
అతని యజమాని నరసింహారావు. మారుతి పనితో సంతృప్తికరంగా ఉన్నాడు కానీ, అతని నోరు మా చెడ్డ పెంటకుప్ప. నోటికి అడ్డు, అదుపు ఉండదు. ఏ తిట్టయినా తిట్టడానికి, ఏ దేవుడి మీదైనా, ఏ ఒట్లయినా వేయడానికి ఏ మాత్రం వెనుకాడడు. అయితే అతడు తిట్టిన తిట్లు, పెట్టే శాపనార్ధాలు వాస్తవంగా జరగాలని అనుకోడన్నది కూడా నిజమే. అయినప్పటికీ అవన్నీ మారుతి చెవిలో గింగుర్లు తిరుగుతుంటాయి. మనసుని కలచి వేస్తూ, కకావికలం చేస్తుంటాయి. నరసింహారావు లుంగీని తొడల పైకి ఎత్తి కట్టుకుంటాడు. ప్రతి రోజు పొద్దున్నే, నుదుటి పొడువునా తిలకం దిద్దుకుంటాడు. తన దేవుణ్ణి మరీ పొద్దున్నే లేపేస్తాడనుకుంటాను.
మొదటి నావ తుడవడం పూర్తయ్యే సరికి, ప్రయాణించడానికి సిద్ధంగా ప్రయాణికులు క్యూలో నిలుచుని ఉంటారు. అందులో విదేశాల నుంచి వచ్చినవారు, ముఖ్యంగా అమెరికా, జపాన్‌ దేశాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. వాళ్ళ ముందు, వాళ్ళ చేత ప్రయాణం చేయించే ఏజెంట్లు కూడా సిద్ధంగా నిలబడి ఉంటారు. సాధారణంగా మొదటి నావలో ఎక్కేది, రేవు ఎదురుగుండా ఉన్న తాజ్‌ హోటల్‌లో బస చేసిన వారే. తలకు రకరకాల టోపీలు పెట్టుకుని, భుజాలకు రకరకాల వస్తువులతో నిండిన చిన్న చిన్న సంచులు, కెమెరాలు, బైనాక్యులర్‌లు తగిలించుకుని ఎక్కుతుంటారు. మారుతి మొదటి బోట్‌ను తుడిచేటప్పుడున్న ప్రశాంతత రెండో బోటు తుడవడం మొదలెట్టేసరికి మిగలదు. రెండో బోటు ఇంకా శుభ్రం చేయడం పూర్తవక ముందే, మొదటి బోటులో ఎక్కడానికి వీలవని ప్రయాణికులంతా ఇందులోకి దూకుతారు. పైగా ఈ సారి బోటునెక్కే ప్రయాణికుల తీరు కూడా వేరుగా ఉంటుంది.- నిమ్మళంగా, నిరాడంబరంగా ఉండే రకం కాదు, నోరేసుకుని పడిపోయే రకం. మృదువుగా మాట్లాడేవారు, మందలించేవారూ కాదు. అవన్నీ పొద్దుటితో సరి. ఇప్పుడు తిట్ల జోరు పెరుగుతున్న తీరు మారుతి స్పర్శకి ఆనుతూనే ఉంది. భానుడి ప్రతాపంతో పాటుగా తిట్ల జోరు, వాడి కూడా పెరుగుతుంటుంది.
నరసింగరావుకి మూడు పడవలు ఉన్నాయి. అవి గేట్‌వేకి, ఎలిఫెంటా గుహలకి మధ్య తిరుగుతూ ఉంటాయి. ఒక తీరంలో ప్రయాణీకులను నింపుకుని మరో తీరంలో దింపుతుంటాయి. ప్రయాణికులు వాళ్ళ జేబుల్లో నింపుకొచ్చిన రుచికరమైన తినుబండారాలను ఖాళీచేసి, వాటి ప్లాస్టిక్‌ సంచులను బోట్‌లో పారేస్తుంటారు. వేరుశనగ కాయలు వలుచుకుని, బోటంతా ఎక్కడపడితే అక్కడ చిందర వందరగా జల్లుతారు. కమలాపండ్లు వలుచుకు తిన్న తొక్కలు అటు ఇటు వెద చల్లుతారు. చాకోలెట్‌లు తిన్న ముచ్చికలు, పాపిడి, పీచుమిఠాయి తిన్న ప్లేట్లు చుట్టూ వేస్తారు. అంతేకాదు, వాడిన గర్భనిరోధక ప్యాకెట్లు, నెక్లెస్‌ల నుండి తెగి పడ్డ ప్లాస్టిక్‌ పూసలు, టోపీలు, జేబురుమాళ్ళు కూడా బోట్‌ నేలంతా విచ్చలవిడిగా పడి ఉంటాయి. ఈ చెత్తంతా పోగు చేసి చేసి మారుతి చేతులు నొప్పులు పుడుతుంటాయి. అంతేకాదు, కొంతమంది అక్కడ కక్కుకుంటారు కూడా.
ప్రయాణికులు ఏ వస్తువులు సముద్రంలో పారేయకూడదనేది నియమం. కానీ మారుతి మాత్రం ఎవరిని పారేయకుండా ఆపడు. వాళ్ళు తమ బరువు దించుకోడానికి సముద్రంలోకి పారేస్తుంటే, ఆపడానికి మనమెవరమని అనుకుంటాడు. బోటు నేలమీద పడి, ఎండిపోయిన వాంతులు తుడవడం అన్నిటికన్నా నికృష్టమైన పని. మొదటిసారి పడవలో ప్రయాణించేవారు సర్వసాధారణంగా వాంతులు చేసుకుంటారు. అదొక నరకమే. చాలామంది, బోటుకున్న ఇనుప కడ్డీలను ఆనుకుని కూచుంటారు. అలల కుదుపులకి వాంతులైతే, ఆ చువ్వలపై కూడా పడుతుంది మరి. ఒక్కొక్కసారి వాళ్ళ చొక్కాలపై, కూర్చున్న బెంచీలపై కూడా పడుతుంటుంది. సముద్రపు అలలు ఉధృతంగా ఉన్నప్పుడు, వాంతులు మరింత ఎక్కువవుతాయి. తిన్నదంతా బయటికి వస్తుంది. వాంతులు చేసుకున్న వెంటనే నీళ్లు పోసి కడగాలి అని నరసింహారావు ఆదేశం. వరదలా వచ్చిపడే అతిధులు పోసే చెత్త, చేసుకునే వాంతులతో నిండిన బోట్‌ని శుభ్రం చేసి చేసి మారుతి నడుము విరిగి పోతుంటుంది. నొప్పితో విలవిల లాడుతుంటాడు. ఇంత చేసినా, ఒక్కొక్క సారి పైనున్న అధికారులు చివాట్లు పెట్టడమే కాదు, నాలుగు తగిలిస్తుంటారు కూడా. ఈ నావలో అందరికన్నా అత్యధమ స్థాయిలో ఉన్న ఉద్యోగి అతను. అతను అక్కడ కేవలం ఒక ఊడ్చేవాడు మాత్రమే. అందుకే ప్రతివాడు కనబడ్డ ప్రతి పని అతనికి చెపుతుంటారు. ఉదాహరణకి బోట్‌ నడిపే కెప్టెన్‌ని చూడండి. భోజనం క్యారియర్‌లో తెచ్చుకుంటాడు. తినేటప్పుడు మాత్రం దర్జాగా కంచములో పెట్టుకుని, స్పూన్లు, ఫోర్కులు వాడుతూ తింటాడు. ఆ ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు, టిఫిన్‌ డబ్బా అన్నీ కడిగి పెట్టాల్సింది మాత్రం మారుతి. తిరిగి వెళ్లే సమయానికి, అన్నిటినీ సంచిలో కూడా సర్ది, చేతికి అందించాలి.
వరుసగా పది గంటల పాటు పని చేస్తూనే ఉండాలి. సముద్రంలో అలల పైన తేలియాడుతున్న బోట్‌ ఊపులకు డస్సి పోకుండా, సంయమనం పాటిస్తూ ప్రయాణం చేయాలి. దానితో, బోటు తీరం చేరే సరికి ఒళ్ళంతా హూనం అవుతుంది. ఇక బోట్‌ని శుభ్రం చేసే ఓపిక ఏమాత్రం మిగలదు. ఇంటికి బయలు దేరుతున్న మారుతిని నరసింహారావు అసభ్య పదజాలంతో అమ్మనా బూతులు తిడతాడు. ‘ఇప్పుడే ఎందుకు శుభ్రం చేయవు? రేపు పొద్దున్న నువ్వే ఎండిన దంతా గీకి గీకి కడగాల్సి వస్తుంది కదా’ అంటాడు.
అప్పటికిక మారుతికి సమాధానం చెప్పే ఓపిక కూడా ఉండదు. ‘ పొద్దున్న చేస్తాను… ఇప్పుడిక ఊపిరి తీసుకునే ఓపిక కూడా లేదని సైగలు చేస్తాడు.’ అప్పటికే వాడి కాళ్లు, చేతులు మొద్దుబారిపోయి ఉంటాయి.
జనాలందరినీ తోసుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ చర్చ్‌ గేట్‌ స్టేషన్‌ చేరుకుంటాడు. లోకల్‌ ట్రైన్‌ని పట్టుకుంటాడు. భుజాలు జారిపోయి ఉంటాయి. కళ్ళు మూతలు పడుతుంటాయి. జోగేశ్వరి స్టేషన్‌ దగ్గరకు వచ్చేసరికి పెట్టెలోని గుంపే, మారుతిని బయటకు తోసేస్తుంది. మారుతి బయట పడతాడు. ఇది నిత్యం జరిగేదే.
ఎలాగోలా ఉన్న శక్తినంతా కూడదీసుకుని హైవే పక్కన సావంత్‌నగర్‌లో దిబ్బ పైన ఉన్న ఖోలి 109 గుడిసెకి చేరుకుంటాడు. ప్రతిరోజూ, ఇంట్లో అడుగు పెట్టగానే, తులసి బారు కుండలోని చల్లని నీరు మెరుస్తున్న గిన్నెలోకి వంచి చేతికందిస్తుంది, ‘అలిసిపోయావా? తాగు’ అంటుంది.
కనుబమ్మలు పైకెత్తి ఒక సారి ఆమెకేసి చూసి, ఒక్క గుక్కలో నీళ్లన్నీ మింగుతాడు. తులసి వచ్చి, అతని పక్కన మంచంపై కూర్చుంటుంది. నొప్పులు పుట్టిన కాళ్ళు వత్తుతూ, ఆ రోజు జరిగిన సంగతులన్నీ పూస గుచ్చినట్టు చెబుతుంది.
‘లక్ష్మి అత్తగారింటి నుండి వచ్చింది. అత్తగారు నాసిక్‌కి వెళ్లారట.’ మారుతి కళ్ళు మూసుకున్నాడు. ఒక క్షణం గడిచింది. తులసి మళ్ళీ, ‘చోటీ మహా కానిదై పోయింది. నన్ను నాని అని పిలవడం ఊహించగలవా?! నిన్ను కూడా పేరుపెట్టి పిలుస్తోంది. ఎప్పుడు వస్తావని అడుగుతోంది.. దడబిడా మాట్లాడుతోంది…, ‘మాలుతి ఎప్పులత్తాడు? ఎప్పులు ?’ అంటోంది.
కాంతి విహీనంగా ఉన్న మారుతి మొహంలో వెయ్యి మతాబులు ఒక్కసారిగా వెలిగాయి. దరహాసం మెరిసింది,
‘హిందీలో మాట్లాడుతున్నదా !?’
‘అవును, నిజమే.
‘మరాఠీ రాలేదూ ?’
‘వస్తుంది. ఇంకా కాస్త సమయం పడుతుంది.’
‘అలసట కాస్తంత నెమ్మదించింది. మడిచిన అర చేతులలో ముఖం పెట్టుకుని కూచున్నాడు.
‘మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళింది?’
‘ఇంకా వెళ్ళలేదు. సినిమా చూడడానికి వెళ్లారు.’
‘చోటు కూడానా!’
‘ఆ బుజ్జి రాకాసి వాళ్ళమ్మని ఒక్క క్షణం కూడా వదిలింది లేదు. ఏం చేస్తుంది? తీసుకెళ్లింది.’
మారుతి కాస్తంత రుసరుస లాడి, ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు.
‘కార్తీక్‌ ఎక్కడీ’
‘ఈ రోజు కూడా వాడు ఎవడితోనో గొడవ పడ్డాడు.
‘… వాళ్ళ అమ్మ’
మారుతి హఠాత్తుగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
‘వెధవ. రోజు ఎవరో ఒకరితో బడిలో తన్నులు తిని వస్తాడు. పిరికి వెధవ. వాడసలు మరాఠాలకే అవమానం.’
తులసి కూడా లేచింది.
‘లే, కాళ్ళు చేతులు కడుక్కో . పోహా చేశాను. కాస్తంత నోట్లో వేసుకుందువు గాని.’
మారుతి తువ్వాలు కిందికి విడిచి, మోకాళ్ల పై కూర్చుని స్నానం చేయడం మొదలెట్టాడు. ‘నా ధోవతి , కుర్తా ఇటివ్వు’ అన్నాడు. స్టవ్‌ వెలిగింది. దీపం కూడా వెలిగింది. మారుతి ఎదురుగుండా ఉన్న దేవుని పటాలకి మొక్కాడు. ప్రార్ధన చేస్తూ కాసిన్ని వాక్యాలు గొణిగాడు. తులసి ఇచ్చిన ఉతికిన పంచె, కుర్తా వేసుకున్నాడు.
ఈ లోగా కార్తీక్‌ వచ్చాడు.
‘రారా వెధవా ! నాతో కుస్తీ పట్టు !’
కార్తీక్‌కి నవ్వొచ్చింది.
‘రేపటి నుంచి ఒంటికి ఆవ నూనెతో మాలిష్‌ చేయించుకో. అఖాడాకి వెళ్ళు. కుస్తీ పట్లు నేర్చుకో. ఈ పుస్తకాలు చదివి, నువ్వో జ్ఞాన దేవుడివయి ఏం ప్రయోజనం లేదు.’
కార్తీక్‌ ఒకటే నవ్వుతున్నాడు. స్టవ్‌ చేస్తున్న శబ్దంలో కూడా తులసి కార్తీక్‌ , మారుతిల సంభాషణలు వినగలుగుతున్నది.
‘నువ్వెందుకు వాడికి పిచ్చిమాటలన్నీ నేర్పిస్తున్నావు?’
‘నేను వాడికి సరైన మాటలే నేర్పిస్తున్నాను. ఒక మరాఠ వాడి కొడుకు, మంచి మరాఠా వాడు అవ్వాలి.’
మాటల మధ్యలో బాబు వచ్చాడు. మారుతిని గుడిసె బయటికి పిలిచాడు.
‘ఏమిటి?’ అడిగాడు మారుతి లోపలి నుంచి.
‘పాట్కర్‌ సమావేశానికి వస్తావా?’
‘ఈ పిచ్చి పిచ్చి సమావేశాలకు ఎందుకెళ్తారో తెలుసా? ఒకళ్ళనొకళ్ళు రాసుకుపూసుకు తిరగడానికి’ .
వంటింట్లో నుంచి తులసి అరిచింది.
‘ఇద్దరూ నోరు ముయ్యండి. చెత్తవాడుగు కట్టి పెట్టండి .వెధవాయిల్లారా’
మారుతి బయటికి వచ్చాడు.
‘నా భార్య ఏమంటున్నదో విన్నావా?’
ఆ తర్వాత, బాబా అంబేద్కర్‌ నుండి మేధా పాట్కర్‌ వరకు, చవాన్‌ నుంచి పవర్‌ వరకు, తమ చుట్టూ జరుగుతున్న అన్ని విషయాలు కలబోసుకున్నారు. అన్నిటినీ సంక్షిప్తంగా విశ్లేషించుకున్నారు. అర్ధ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఇద్దరు తాగుబోతులు వచ్చారు. తులసి లేచి స్టవ్‌ వెలిగించింది. తిండి మళ్ళీ వేడి చేసింది. మారుతి నవ్వుతూ, లోపలికి అడుగుపెట్టాడు. కార్తీక్‌ బల్ల మీద పడుకుని ఉన్నాడు. లక్ష్మి కూడా పడుకునే ఉంది. నేలపై. బుజ్జిది అమ్మ బజ్జలో దూరి ప్రశాంతంగా నిద్రపోతోంది. మారుతి, చిన్నదాని తలపై చెయ్యి పెట్టి నిమిరి, బుగ్గలు గిల్లాడు సుతారంగా. ఆమె అల్లిబిల్లి కబుర్లు మురిపెంగా మననం చేసుకున్నాడు.
‘మాలుతి,లా.’
తులసి మందలించింది.’ పడుకొనియ్యి. ఇప్పుడు దాన్ని నిద్ర లేపకు.’
లక్మ్షికి మెలుకువ వచ్చింది. లేచి, తండ్రిని కౌగలించుకుంది. చోటీ కూడా నిద్ర లేచింది. కార్తీక్‌ నిద్రలో కలవరించాడు. ‘బాపు,’
అల్లుడు నిద్ర లేచి వచ్చి, వంగి కాళ్ళకి దణ్ణం పెట్టాడు.
‘ఇప్పుడు మారుతి అందరికన్నా అధమ స్థాయిలో లేడు. అతడిప్పుడు కేవలం శుభ్రం చేసే ఒక పనివాడు మాత్రమే కాదు. కుటుంబానికి పెద్ద దిక్కు. ఏడు గుర్రాల కుటుంబాన్ని నడిపే రథసారథి.

మూలం : గుల్జార్‌
అనువాదం : కె. ఉషారాణి,
9492879210

➡️