చెద పురుగులు

Jan 21,2024 08:24 #Sneha, #Stories
cheda purugulu story sneha

ప్రత్యూషపు వేళ! రామబ్రహ్మం ఆ సమయంలో మార్నింగ్‌వాక్‌ని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ముప్పై సంవత్సరాల క్రితం అతను జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నాడు. రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశాడు. అతని ఇద్దరి పిల్లలు హైదరాబాదులో సెటిల్‌ అయ్యారు. అతను మాత్రం పిల్లల దగ్గరకు వెళ్ళకుండా, పదవీ విరమణకి ముందే పట్నంలో ఇల్లు కట్టుకొని భార్య మాధవి, తను ఉంటున్నారు. ఉద్యోగంలో చేరిన దగ్గర్నుంచీ ఉదయాన్నే నడవటం అతనికి అలవాటు. దాన్ని క్రమం తప్పకుండా ఇన్నాళ్ళూ ఆచరిస్తూ వస్తున్నాడు.

ప్రభాత సమయంలో, ప్రత్యూషపు వేళ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలా రావాలను ఆలకిస్తూ అందమైన నీలాకాశం, పచ్చని చెట్లు, ఏటి కెరటాల సవ్వడి, కోకిల కులకూజితాలతో నిండిన ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవటం అతనికి చాలా ఇష్టం. ఆ తరువాత ఇంటికి వచ్చి దిన పత్రికను చదువుతాడు.

ఆ రోజు అతను పేపరు చదువుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు జోగారావు వచ్చాడు. అతను క్రితం సంవత్సరం లెక్కల మాస్టారుగా అదే స్కూల్లో పదవీ విరమణ చేశాడు. అతన్ని చూడగానే రామబ్రహ్మం ముఖం వికసించింది.

‘రా జోగారావ్‌! ఈ మధ్యన రావడం మానేశావు. ఏమైనా విశేషమా?’ అని కుర్చీ చూపిస్తూ అడిగాడు రామబ్రహ్మం.

‘మొన్న మా అబ్బాయి దగ్గరికి హైదరాబాద్‌ వెళ్ళాము. వాడు ఇల్లు కొనుక్కున్నాడు. దాని గృహ ప్రవేశం కోసం వెళ్ళ వలసి వచ్చింది. అందుకే రాలేదు’ అన్నాడు జోగారావు.

‘సంతోషం! మనకు పదవీ విరమణ తరువాత ఏం కోరికలుంటాయి చెప్పు. పిల్లల చదువులు పూరై వాళ్ళకు ఉద్యోగాలొచ్చి పెళ్ళిళ్ళైపోతే అంతే చాలు. ఆ విషయంలో మనం అదృష్టవంతులమనీ చెప్పవచ్చు. వాళ్ళ సమస్యలు మనకేమీ లేవు. మనకొచ్చే ఫించనుతో హాయిగా బతకొచ్చు’ అన్నాడు రామబ్రహ్మం.

‘ఫించను అంటే గుర్తుకు వచ్చింది. నువ్వు పదవీ విరమణ చేసి ఆర్నెల్లు అయింది కదా! నీ ఫించను మంజూరైందా? అందుకు సంబంధించిన పేపర్లన్నీ డిఈఓ ఆఫీసులో ఇచ్చావా?’ అని అడిగాడు జోగారావు.

‘అన్ని పేపర్లూ, ఫొటోలు, ఆధార్‌ కార్డులు జిరాక్స్‌లతో సహా పదవీ విరమణ చేసిన పదిహేను రోజుల తరువాత డిఈవో ఆఫీసుకి ఇచ్చేశాను. పింఛను మంజూరుకు రెండు నెలలు పడుతుందనీ చెప్పాడు డీలింగ్‌ క్లర్క్‌. రెండు నెలల తరువాత వెళితే నా ఫైలును రాజధానిలో ఏజీ ఆఫీసుకి మంజూరు కోసం పంపించామని, అదింకా రాలేదని చెప్పాడు. మళ్ళీ మొన్న ఇరవై రోజుల క్రితం వెళ్ళి వాకబు చేస్తే ఫైలు ఇంకా రాలేదని చెప్పాడు. ఏమిటో ఇంత ఆలస్యం? పదవీ విరమణ తరువాత ఇలా ఆలస్యం చేస్తే ఉద్యోగులు ఎలా బతుకుతారన్న ఆలోచన కూడా అధికారులకు లేనట్లున్నది. మళ్ళీ మా ప్రభుత్వంలో అన్నీ త్వరగా జరిగిపోతాయని ముఖ్యమంత్రితో సహా అందరూ ఊదర గొడుతుంటారు. కానీ జరగవలసిన ఆలస్యం జరుగుతూనే ఉంది. కంచే చేను మేస్తే ఎలా! ఐఏయస్‌ అధికారుల పనితీరే ఇలా ఉంటే ఇక మామూలు కింద తరగతి ఉద్యోగుల తీరు ఎలా ఉంటుంది చెప్పు! యథా రాజా తథా ప్రజా’ అన్నాడు రామబ్రహ్మం సెటైరికల్‌గా.

‘మేస్టారు గారూ! ఇదంతా ఆ డీలరు రాఘవరావు ఆడుతున్న నాటకం. వాడు చాలా అవినీతి పరుడు. లంచాలు బాగా మేస్తాడు. నా పదవీ విరమణప్పుడు కూడా వాడు డబ్బుల కోసం సంవత్సరం పాటు ఫైలుని తొక్కేపట్టేడు. ఆ తరువాత వాడికి పదివేల రూపాయలు లంచం ఇస్తే గానీ పింఛను మంజూరు కాలేదు. ఇప్పుడు కూడా వాడేనా నీ ఫైలు చూస్తున్నది’ అని అడిగాడు జోగారావు.

‘అవును వాడే. వాణ్ణి చూస్తే అవినీతిపరుడిలా కనిపించ లేదు. మనిషి నెమ్మదిగా కనిపిస్తున్నాడు. అయితే ఇదంతా వాడు ఆడుతున్న నాటకం అంటావా?’ అని అడిగాడు రామ బ్రహ్మం.

‘ముమ్మాటికీ వాడి పనే. వాడు ప్రతి పింఛను ఫైలుని డబ్బుకోసం తొక్కి పడుతుంటాడు. వాడే కాదు ఆ డీఈఓ ఆఫీసంతా అవినీతి మయం. ఈ లంచాల్లో అందరికీ వాటా ఉంది. అందరూ పంచుకుంటారు. ఇంకో ముఖ్య విషయం మాస్టారూ! సంవత్సరం క్రితం కొత్త డిఈవోగా ఈశ్వర్‌ వచ్చాడు. వాడెవరనుకుంటున్నారు. మీ శిష్యుడు. పదిహేనేళ్ళ క్రితం మీ దగ్గరే పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇప్పుడు వాడు గ్రూప్‌-2 పరీక్ష రాసి డిఈవో అయ్యాడు. వాడు వీళ్ళందర్నీ మించిపోయాడు. డబ్బులు ఇవ్వకపోతే పెన్ను తియ్యడు. డబ్బులు ఇచ్చేదాకా ఆ ఫైలు వాడి టేబుల్‌ మీదే ఉంటుంది. ఈ విషయాలన్నీ మన పక్క ఊరి లెక్కల మాస్టారు గారు చెప్పారు. అతను ఎనిమిది నెలల నుండి కాళ్ళు అరిగిపోయినట్లు తిరుగుతున్నా పాతిక వేలిస్తే కానీ మంజూరు చెయ్యనని భీష్మించుకు కూర్చున్నాడట మీ శిష్యుడు ఈశ్వర్‌’ అని వివరంగా చెప్పాడు జోగారావు.

‘జోగారావ్‌! ఏంటి నువ్వు చెప్పేది నిజమా? మొన్న డిఈఓ ఆఫీసుకి వెళ్ళినపుడు ఈశ్వరరావు అంటే ఎవరో అనుకున్నాను. నా శిష్యుడు ఈశ్వరేనా? కానీ వాడు కూడా లంచాలు తీసుకుంటున్నాడంటే ఆశ్చర్యమేస్తోంది. ఇంత చిన్న వయస్సులో ఆఫీసర్‌ అయినందుకు ఎంత నిజాయితీగా పని చెయ్యాలి చెప్పు! ఇలాంటి వాళ్ళు మన శిష్యులైనందుకు సిగ్గుపడాలి’ అన్నాడు రామబ్రహ్మం.

‘మీ ఫైలే కాదు మాస్టారూ! మీతో బాటు పదవీ విరమణ చేసిన ఎనిమిది మంది పింఛను ఫైళ్ళు కూడా వాడి టేబులు మీద పడున్నాయి. మొన్న ఇద్దరు మేస్టర్లు వాడి బాధ భరించలేక 15,000 ఇస్తే సంతకం పెట్టాడట. కాబట్టి మీరోసారి ఆఫీసుకి వెళ్ళి ఆ డీలరు రాఘవరావుతో మాట్లాడండి. అవసరం అయితే ఆ ఈశ్వర్‌ గాడిని కలవండి. మీరు వాడి గురువు కాబట్టి ఏవైనా తగ్గిస్తాడేమో?’ అన్నాడు జోగారావు.

‘జోగారావు! శిష్యుడు డిఈవో లాంటి పదవి నలంకరించినందుకు సంతోషించాలో లేక అవినీతి పరుడైనందుకు విచారించాలో అర్థం కావటం లేదు. అయినా గురువుకి గురు దక్షిణగా బొటన వేలిచ్చే శిష్యుల గురించి చదివాను కానీ ఇలా గురువునే దక్షిణ అడిగే శిష్యుడి గురించి ఇప్పుడే వింటున్నాను. అయినా ఈ చేతులతో బోర్డు మీద రాస్తూ పాఠం చెప్పిన నేను, ఇప్పుడు ఇదే చేతులతో వాడికి లంచం ఇవ్వడం అన్నది ఊహించుకుంటేనే ఘోరంగా ఉంది. ఇలాంటి బాధ ఏ గురువుకీ ఎదురవ్వకూడదని కోరుకుంటున్నాను. అయినా నువ్వు చెప్పినట్లు రేపే ఆఫీసుకి వెళ్ళి ఫైలు గురించి ఆ రాఘవరావుని కనుక్కుంటాను. అవసరం అయితే ఈశ్వర్‌ని కలుస్తాను. కనీసం చదువు చెప్పిన నన్ను పోలుస్తాడో లేదో చూడాలి’ అన్నాడు రామబ్రహ్మం.

ఆ మర్నాడు రామబ్రహ్మం డి.ఈ.ఓ ఆఫీసుకు వెళ్ళి ఫించను ఫైళ్ళను చూసే రాఘవరావుని కలిసాడు.

‘సార్‌! నేను పదవీ విరమణ చేసి ఆరునెలలైంది. ఇప్పటి వరకు నా పింఛను మంజూరు కాలేదు. మంజూరు కావాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. నేను దాచుకున్న డబ్బంతా ఖర్చై పోయింది. లక్ష రూపాయలు అప్పు చేశాను. ఈ నెలలో గానీ నా డీ.సీ.ఆర్‌ జీ, పింఛను డబ్బులు రాకపోతే ఇంక అప్పిచ్చేవారు కూడా ఎవ్వరూ లేరు’ అన్నాడు రామ బ్రహ్మం.

వెంటనే రాఘవరావు లేచి నిలబడి ‘మాస్టారు గారూ! రండి బయట టీ తాగుతూ మాట్లాడుకుందాము’ అంటూ రామ బ్రహ్మాన్ని బయట రోడ్దు మీద టీ దుకాణానికి తీసికెళ్ళాడు. టీ తాగుతూ ‘మేస్టారూ! మీకు తెలియనిదేముంది. డి.ఈ.ఓ పోస్టింగులకు పదిహేను, ఇరవై లక్షలు ఖర్చవుతుంది. అందుకని పింఛను కేసులను మంజూరు చెయ్యడానికి డి.ఈ.ఓ గారు పాతిక వేలు తీసుకుంటారు. ఇందులో మాకొచ్చేది కొద్దిగానే. కాబట్టి ఆ డబ్బు మీరు సర్దితే ఈ వారంలోనే మీ ఫైలు క్లియర్‌ చేయిస్తాను’ అన్నాడు రాఘవరావు.

‘అయ్యా! ప్రస్తుతానికి నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. మీరడగిన డబ్బు ఇచ్చుకోలేను. మీరు ముందు మంజూరు చేయండి. అప్పుడు చూస్తాను. ఇంకో విషయం. మన డి.ఈ.ఓ ఈశ్వర్‌ నా శిష్యుడే. కాబట్టి నేను తన గురువునని అతనికి చెప్పండి. ఆ విషయం తెలిస్తే వెంటనే సంతకం చేస్తాడు. మీకభ్యంతరం లేకపోతే నేను అతనితో మాట్లాడతాను’ అన్నాడు రామ బ్రహ్మం.

‘మాస్టారూ? శిష్యుడంటున్నారు. మీరే వెళ్ళి అన్ని విషయాలూ అతనితో మాట్లాడి ఫైలు క్లియర్‌ చేయించుకోండి. నాకేం అభ్యంతరం లేదు’ అన్నాడు రాఘవరావు.

పన్నెండు గంటలప్పుడు ప్యూన్‌కి స్లిప్పు ఇచ్చి లోపలికి వెళ్ళాడు రామబ్రహ్మం. డిఈవో ఈశ్వర్‌కి నమస్కారం పెట్టి ‘బాబూ! మీకు నేను గుర్తున్నానో లేదో కాని హైస్కూల్లో చదువుతున్నప్పుడు నేను మీకు ఇంగ్లీషు చెప్పేవాడిని. రామబ్రహ్మ మాస్టారుని’అంటూ తన గురించి చెప్పాడు రామబ్రహ్మం. వెంటనే ఈశ్వర్‌ ‘మీరా మాస్టారు! నమస్కారం. మీరెందుకు గుర్తులేరు. కూర్చోండి’ అంటూ కుర్చీ చూపించాడు. రామబ్రహ్మం ఆనందంతో కుర్చీలో కూర్చోగానే ఈశ్వర్‌ ప్యూన్‌ని పిలిచి కాఫీ తెప్పించాడు.

‘ఈశ్వర్‌! నువ్వే డిఈఓవి అన్న విషయం మొన్ననే తెలిసింది. నా దగ్గర చదువుకున్న నా శిష్యుడు ఇంత మంచి అధికార హోదాలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు కలెక్టర్‌, డిఈఓ ఇద్దరూ నా శిష్యులే. ఇంత కన్నా ఒక ఉపాధ్యాయుడికి ఏం కావాలి చెప్పు?’ అన్నాడు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. అదీ మీ గొప్పతనమే మాస్టారు! మీరు అంత బాగా చదువు చెప్పడం వల్లే మేము ఈ స్థాయికి చేరుకోగలిగాము. ఇంతకీ ఏ పనిమీద వచ్చారు.. అని అడిగాడు ఈశ్వర్‌.

‘బాబూ! నేను ఎనిమిది నెలల క్రితం పదవీ విరమణ చేశాను. నా పింఛను ఫైలు మీ ఆఫీసులో ఉంది. డీలర్ని అడిగితే నువ్వు ఆ ఆర్డర్స్‌పై సంతకాలు చెయ్యాలని చెప్పాడు. కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. దయచేసి నువ్వు సంతకాలు పెడితే నా పింఛను డీసీఆర్‌జీ మంజూరైపోతాయి. అందుకోసమే వచ్చాను’ అన్నాడు రామబ్రహ్మం.

‘తప్పకుండా! ఈ రోజే ఫైలుని తెప్పించుకుని సంతకాలు చేస్తాను. ఇంకా మీరు దాని గురించి మరిచిపోండి. వారం రోజుల్లో మీ ఇంటికి ఆర్డర్స్‌ పంపించేస్తాను’ అన్నాడు ఈశ్వర్‌. అతని మాటలకు రామబ్రహ్మం ఎంతో సంతోషించి బయటకు వచ్చి రాఘవరావుతో జరిగిన విషయాలు చెప్పి ఆ ఫైలు మీద ఈశ్వర్‌ చేత సంతకాలు చేయించి తనకు తెలియజేయమని చెప్పి ఇంటికి వచ్చేసాడు.కానీ పదిరోజులైనా పింఛను మంజూరు ఆర్డర్స్‌ రామబ్రహ్మానికి రాలేదు. వెంటనే ఏం జరిగిందోనన్న గాబరాతో మళ్ళీ డిఈఓ ఆఫీసుకి వచ్చి రాఘవరావుని అడిగాడు.

‘మేస్టారూ! మీరు గురువైనంత మాత్రాన అంత సులభంగా సంతకాలు పెట్టే రకం కాదు మా డీఈఓ గారు. ఆయన మహా ఘటికుడు. మీలాంటి వాళ్ళని ఎందరినో చూశాడు. డబ్బు దగ్గర బాగా నిక్కచ్చి మనిషి. అసలే ఈ పోస్ట్‌ కోసం విద్యాశాఖామంత్రికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడాయే. అవి సంపాదించుకోవద్దా చెప్పండి. మీలాంటి ఫ్రీ కేసులొస్తే ఇక సంపాదించినట్టే. కాబట్టి నా మాట విని ఆ డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోండి. రెండు రోజుల్లో మీ ఫైలు ఆమోదం పొందుతుంది. అతను మీరు గురువు గారు కాబట్టి డబ్బులు అడగటానికి మొహమాటం పడ్డాడు. ఆ విషయం నాకు చెప్పి మీ దగ్గర ఆ డబ్బుని వసూలు చేసి ఫైలుని సంతకాల కోసం పంపమన్నారు. అతను చెప్పింది మీకు చెప్పాను. ఇక ఇవ్వాలో వద్దో మీ ఇష్టం’ అంటూ అసలు విషయాన్ని రామ బ్రహ్మానికి చెప్పాడు రాఘవరావు.

రామ బ్రహ్మానికి అతని మాటలు వినగానే కళ్ళు బైర్లు కమ్మాయి. ఒళ్ళు తూలి పోసాగింది. శిష్యుడై ఉండి ఇంత ఘోరానికి తలపడతున్నాడా..! చదువు చెప్పిన గురువు అన్న గౌరవం లేదు. ఆ ఆలోచన రాగానే అతని శరీరంలో వణుకు మొదలైంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. అతనికేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆలోచనలతో మస్తిష్కం వేడెక్కి పోసాగింది. ఆ సమయంలో అతనికి తన ఇంకో శిష్యుడైన అదే జిల్లా కలెక్టర్‌ రఘురాం గుర్తుకు వచ్చాడు. అతని మనసులో కొత్త ఆలోచన మొదలైంది. వెంటనే లేచి బయటకు వెళ్లాడు.

**********************************************

వారం రోజుల తరువాత టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది. ఏసీబీకి చిక్కిన డిఈఓ ఈశ్వర్‌. పాతిక వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన అవినీతి తిమింగలం! అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలింపు’ అన్న వార్త రాష్ట్రమంతా దావానంలా వ్యాపించింది.

ఆ వార్త చూసి జోగారావు, రామబ్రహ్మం దగ్గరికి వచ్చి ‘ఏంటి మాస్టారు! ఈశ్వర్‌ని ఏసీబీ వాళ్ళు లంచం తీసుకుంటుండగా అరెస్ట్‌ చేసారట, టీవీలో చూసారా ఆ వార్తని? అని అడిగాడు.

‘అది నేనే చేయించాను. ఈశ్వర్‌ని కలిసి నేను మీ గురువుననీ చెప్పినా అతను ఆ ఫైలుని క్లియర్‌ చెయ్యలేదు. అప్పుడు నా మరో శిష్యుడైన కలెక్టర్‌ రఘురాంకి ఈ విషయం చెబితే అతను ఏసీబీ వాళ్ళకి చెప్పాడు. నేను డబ్బుని పట్టికెళ్ళకుండా మా అబ్బాయి చేత వాడి ఛాంబర్లోకి పంపించాను. ముందే ఏసీబీ వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు ఈశ్వర్‌ని రెడ్‌ హేండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేశారు’ అని చెప్పాడు రామబ్రహ్మం.

‘మంచి పనిచేశారు మాస్టారూ! ఇలాంటి అవినీతి చేపల వల్లే ఈ సమాజం పాడైపోతోంది. వాళ్ళని వదలకూడదు’ అన్నాడు జోగారావు.

‘ముందు శిష్యుడని ఆలోచించాను. కానీ ఇటువంటి అవినీతి చెదపురుగుల్ని వదిలేస్తే సమాజాన్ని డొల్లచేసి నాశనం చేస్తారు. వాడికి చదువు చెప్పిన చేతులతోనే పోలీసులకు పట్టించడం బాధాకరమైనా తప్పలేదు. అవినీతిని అంతమొందించే విషయంలో తన.. పర.. భేదం ఉండకూడదు. రాగద్వేషాలు పనికిరావు’ అన్నాడు రామబ్రహ్మం. అతని మాటలు జోగారావుకి ఆనందం కలిగించాయి.

  • గన్నవరపు నరసింహ మూర్తి, 9326735406
➡️