అడవిలో ఎన్నికల సందడి

Jun 16,2024 10:23 #Sneha

డవిలో ఎన్నికల సందడి మొదలైంది. గత నాలుగైదు సార్లుగా ఏకగ్రీవంగా రాజుగా ఎన్నికవుతూ వస్తున్న సింహం మరొకసారి అడవికి తానే రాజునని ప్రకటించుకోసాగింది. సింహానికి భయపడి ఇంతవరకు ఎప్పుడూ రాజుగా పోటీ చేయడానికి ఏ జంతువూ ముందుకు రాలేదు. ఈసారి ఎలా ఉంటుందో అని జంతువులన్నీ ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. సింహంపై పోటీచేసే మొనగాడైన మరొక జంతువు ఈ అడవిలో ఉందా లేదా అని అవి చర్చించుకోసాగాయి. సింహం నియంతృత్వ పోకడలను అవి భరించలేకున్నాయి. దాని ఆజ్ఞలను పాటించని జంతువు ఏదైనా సింహానికి బలి కావాల్సిందే. అది చెప్పిందే వేదం.. గీసిందే గీత.. రాసిందే రాత. ఎవరూ ముందుకొచ్చి ఎదురు మాట్లాడే స్వేచ్ఛ లేకుండేది. నామినేషన్ల స్వీకరణకు ఇంకో వారం రోజుల గడువుంది. ముఖ్య ఎన్నికల అధికారిగా సింహం తన మాట జవదాటని ఎలుగుబంటిని నియమించుకున్నది.
ఒకరోజు రాత్రి ఏనుగు, కుందేలు, జింక, ఒంటె రహస్యంగా నది ఒడ్డున సమావేశమయ్యాయి. సింహంపై ఈసారి ఎలాగైనా పోటీకి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నాయి. కానీ తమ నలుగురితోనే ఈ పని సాధ్యం కాదని మిగతా జంతువుల్ని కూడా కలుపుకోవాలని నిర్ణయించాయి. అలా ఒక్కో జంతువు మరికొన్ని జంతువులతో సమావేశం అయ్యాయి. ప్రతి జంతువులోనూ సింహాన్ని ఎలాగైనా ఓడించాలని తపన కనిపిస్తున్నది. కానీ సింహంపై పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
జంతువులన్నీ మరొకమారు రహస్యంగా సమావేశమయ్యాయి. అన్నీ సింహంపై పోటీకి తగిన అభ్యర్థి ఏనుగు మాత్రమేనని అన్నాయి. కానీ పోటీకి ఏనుగు అంగీకరించలేదు. ఏనుగును పోటీకి ఒప్పించే బాధ్యతను దానికి మంచి మిత్రులైన జింక, కుందేలుకు అప్పగించాయి. కిందా మీదా పడి ఎలాగైతేనేమీ ఏనుగును పోటీకి ఒప్పించాయి అవి. రాజుగా ఏనుగు పోటీ చేస్తున్న విషయం అడవిలో దావానలా వ్యాపించింది. ఆ నోట ఈ నోట ఈ విషయం సింహానికి కూడా చేరింది.
సింహం ఏనుగును తన గుహ వద్దకు రమ్మని కబురు పంపింది. సింహం తనను ఎందుకు పిలుస్తుందో ఏనుగుకు అర్థమైంది. అందుకే తనతోపాటు అది మరో పది జంతువులను వెంటేసుకొని వెళ్ళింది. సింహం ఎప్పుడూ లేనివిధంగా ఏనుగుకు రాచమర్యాదలు చేసింది. మిగతా జంతువులకు కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది. ఇక అసలు విషయం చెప్పనే చెప్పింది. ఏనుగును పోటీ నుండి విరమించుకోవాలని అడిగింది. అప్పుడు ఏనుగు ఇది నా నిర్ణయం కాదని అడవిలోని జంతువులన్నీ కలిసి తీసుకున్న నిర్ణయం. అవి వద్దంటే నేను పోటీ చేయను అంది. అప్పుడు సింహం మిగతా జంతువుల వైపు చూసింది. మిగతా జంతువులన్నీ ముక్తకంఠంతో ఈసారి రాజు పదవికి ఏనుగు పోటీ చేయడం తథ్యం అన్నాయి. సింహానికి కోపం నషాళానికి ఎక్కింది. కానీ ఎన్నికల సమయం అయినందున ఎవరినీ ఏమీ అనకుండానే పంపించేసింది.
ఏనుగు భార్య పిల్లలచే చెప్పిస్తే అది పోటీ నుంచి తప్పుకోవచ్చని భావించి వాటిని పిలిపించింది. కానీ ఆ భార్యా పిల్లలు పోటీ నిర్ణయం మా చేతుల్లో లేదని చేతులెత్తేశాయి. అప్పుడు వాటిని బెదిరించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అవి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక సింహం మొదటిసారిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. తన మందీ మార్బలాన్ని సిద్ధం చేసింది.
నామినేషన్ల పర్వం మొదలైంది. మొదట సింహం పెద్ద ఊరేగింపుతో వచ్చి నామినేషన్‌ వేసింది. ఏనుగు మాత్రం హంగు..ఆర్భాటం లేకుండా కేవలం ఐదు జంతువులు తోడు రాగా నామినేషన్‌ వేసింది. ప్రచార పర్వం మొదలైంది. ఎక్కడ చూసినా అడవిలో ఏనుగుకి మొగ్గు కనబడింది. సింహానికి మొదటిసారిగా వెన్నులో వణుకు పుట్టింది. తన ఆంతరంగికులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పులి, తోడేలు, నక్క లాంటి జంతువులన్నీ పాల్గొన్నాయి. సింహం గెలవడానికి వ్యూహాలు పన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాయి. అందులో ప్రధానంగా అడవిలోని జంతువులన్నిటికీ ఉచిత భోజన పథకం, వయసు మళ్ళిన జంతువులకు పెన్షన్‌ పథకం అమలు చేస్తామని సింహం హామీ ఇచ్చింది. ఇంకను ఎన్నికలు అయ్యేంతవరకు జంతువులన్నింటికీ ప్రతిరోజూ తాగినంత సారా, తినేంత మాంసం, శాఖాహార భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలన్నింటిని గతంలో తన ద్వారా వివిధ రకాలుగా అనగా కాంట్రాక్టు పనుల ద్వారా లబ్ది పొందిన జంతువులకు సింహం అప్పగించింది. అవి కూడా సరేనని తలూపాయి. ఎందుకంటే ఎన్నికల తర్వాత మళ్లీ కాంట్రాక్టు పనులన్నీ సింహం ఎలాగూ తమకే అప్పగిస్తుందని ఇప్పుడు పెట్టిన ఖర్చులన్నీ సరి చేసుకోవచ్చని వాటి నమ్మకం. మరుసటి రోజు నుంచి సింహం ప్రచారం కూడా ఊపందుకుంది. ఉచితంగా సారా, మాంసం దొరకడంతో చాలా జంతువులు మద్యం మత్తులో తూలుతున్నాయి.


మరొకవైపు ఏనుగు కూడా తన ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటివరకు తన వెనకాల ఉన్న కొన్ని జంతువులు సింహం ప్రలోభాలకు లొంగి దాని వైపుకు మళ్ళినాయి. అయినా ఏనుగు ప్రచారానికి వెనకాడ లేదు. తాను కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. అందులో ప్రధానంగా అడవిలోని జంతువులన్నింటికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తానని తెలిపింది. పిల్లలందరికీ కిలోమీటరులోపు ఒక బడిని తెరుస్తానని, ప్రతి 100 జంతువులకు ఒక ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చింది. కానీ ఓటర్లకు మద్యం మాంసం పంచలేదు. గడపగడపకు తిరుగుతూ జంతువులను ఓట్లు అభ్యర్థించింది. సింహం మరొక్కసారి గెలిస్తే పరిస్థితులు ఎలా విషమించే అవకాశం ఉందో జంతువులకు విడమర్చి చెప్పింది. ఇప్పుడు సింహం ఎన్నికలలో చేస్తున్న ఖర్చు అంతా గత ప్రభుత్వ హయాంలో అది అవినీతికి పాల్పడి సంపాదించిందే. మళ్లీ గెలిస్తే సింహం మళ్లీ అవినీతికి పాల్పడుతుంది అని ప్రచారం చేసింది. తాను పరిపాలన నీతివంతంగా, నిజాయితీగా నిర్వహిస్తానని జంతువులకు హామీ ఇచ్చింది. మార్పు కొరకు ఈసారి తనకు ఓటేయాలని జంతువులను ప్రాధేయపడింది. ఏనుగుకు మద్దతుగా జింక, కుందేలు, గుర్రం, గాడిద, ఒంటె, ఆవు లాంటి జంతువులన్నీ ప్రచారం చేశాయి. సింహం నియంతృత్వం నుండి అడవిని కాపాడుకోవడానికి ఓటును ఆయుధంగా ఉపయోగించమని అవి ప్రచారం చేశాయి.


సింహం, ఏనుగుల ప్రచారంతో అడవి అడవంతా దద్దరిల్లింది. జంతువుల మొగ్గు ఎటువైపు ఉందో ఎన్నికల విశ్లేషకులైన జిరాఫీ, హిప్పొపొటామస్‌లు కూడా చెప్పలేకపోతున్నాయి. పోటా పోటీగా సాగిన ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది. అంతవరకు సింహం తరపున ప్రచారం చేసిన చాలా జంతువులు ఏనుగుకు ఓటేయమని రహస్యంగా చెప్పాయి. ఎందుకంటే అవి సింహం అరాచకాలను చూసి చూసి విసుగు చెందాయి. కానీ ధైర్యంగా సింహానికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేక రహస్యంగా ఏనుగుకు మద్దతు ప్రకటించాయి. దీనితో ఏనుగు బలం మరింత పెరిగింది. అడవిలోని జంతువులకు ఏనుగు ప్రచార తీరు నచ్చడంతోపాటు దాని స్వభావం, అది ఇచ్చిన ఉచిత విద్య, వైద్యం హామీలు కూడా చాలా నచ్చాయి.
ఎన్నికల రోజు రానే వచ్చింది. జంతువులు తండోపతండాలుగా వచ్చి పోలింగ్‌ బూతుల వద్ద పెద్ద పెద్ద వరుసల్లో క్యూ కట్టి మరీ ఓట్లేసాయి. ఈ మధ్యలో సింహం దాని అనుచరగణం ఓటర్లను బెదిరించింది. పోలింగ్‌ బూత్‌ల వద్ద గందరగోళం సృష్టించాయి. దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశాయి. కానీ ఓటర్లైన జంతువులు తిరగబడడంతో సింహం మూక తోక ముడిచింది. తొంభై శాతం జంతువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. సాయంత్రం ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు హిప్పోపొటామస్‌, జిరాఫీలు విడివిడిగా ప్రకటించాయి. పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉండడంతో ఎన్నికల ఫలితాలు ప్రస్తుత రాజుగా ఉన్న సింహానికి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉందని తెలిపాయి. రెండు సర్వేల ఫలితాలు కూడా ఏనుగు వైపే మొగ్గు చూపాయి. కానీ సింహం ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను అభూత కల్పనలని కొట్టిపారేసింది. గెలుపు తనదేనని ఓట్ల లెక్కింపు రోజు ఇది నిజమవుతుందని ప్రకటించింది.


ఓట్ల లెక్కింపు రోజు సింహం నియమించిన ఎన్నికల అధికారులు ఏమైనా అవకతవకలకు పాల్పడి సింహం గెలిచినట్టు ప్రకటించే అవకాశం ఉందని ఏనుగుతో సహా మిగతా జంతువులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఓట్ల లెక్కింపు దగ్గర జాగరూకతతో వ్యవహరించాలని ఏజెంట్లకు చెప్పింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండు నుండి ప్రారంభమైన ఏనుగు ఆధిక్యం చివరి వరకు అలాగే కొనసాగింది. భారీ మెజారిటీతో రాజుగా ఏనుగు ఎన్నికయింది. బహిరంగ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసింది. తన మంత్రివర్గంలో నిజాయితీపరులైన కుందేలు, జింక, కోతి లాంటి జంతువులనే మంత్రులుగా ఎంపిక చేసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అడవిలోని జంతువులకు ఏనుగు సుపరిపాలన అందించింది. జంతువులన్నీ హాయిగా జీవించాయి.
పోరెడ్డి అశోక్‌,
8374916403.

➡️