డాక్టర్‌ నుండి యాక్టర్‌గా

Dec 3,2023 13:52 #Sneha

కామాక్షి భాస్కర్ల పేరు చాలా తక్కువగా విని ఉంటారు. ‘మా ఊరి పొలిమేర’ సినిమా చూసిన వాళ్లకు ఈ నటి తెలిసే ఉంటుంది. ఈ సినిమానే కాదు.. ‘విరూపాక్ష, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచు లర్‌, రౌడీ బార్సు, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాల్లోనూ ఆమె నటించారు. అయితే ఆ సినిమాల్లో ఆమెకు అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఈ నటి ‘మా ఊరి పొలిమేర -2’ లో కూడా కనిపించి అలరించారు. అయితే ఈ నటి గురించి, ఆమె బ్యాగ్రౌండ్‌ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య మీడియాతో ఇండిస్టీలో తనకు ఎదురైన అనుభవాలను ఆమె పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం.

పేరు : సాయి కామాక్షి భాస్కర్ల

జననం : 18 జూన్‌ 1995

నివాసం : హైదరాబాద్‌

వృత్తి : డాక్టర్‌, నటి

పురస్కారాలు : మిస్‌ తెలంగాణ, మిస్‌ ఇండియా

చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన కామాక్షి భాస్కర్ల అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేశారు. తర్వాత మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ‘మిస్‌ తెలంగాణ’గా కిరీటం గెలుచుకున్నారు. తర్వాత ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌ వరకూ వెళ్ళారు. ఈ విషయాలు ప్రేక్షకులకు అంతగా తెలియదు. అంతేకాదు.. ఆమె ఫ్యామిలీ గురించి కూడా ఎవరికీ తెలియదు. మీడియా అడిగినా చెప్పేందుకు ఆమె ఇష్టపడేవారు కాదు. ఇండిస్టీలో మంచిపేరున్న కెమెరామెన్‌ కూతురే కామాక్షి భాస్కర్ల. అయితే తన ఫ్యామిలీ విషయాలు ఎక్కడా ఆమె ఎప్పుడూ బయటపెట్టలేదు.’చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కె. విశ్వనాథ్‌ గారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. పుస్తకాలూ చదువుతాను. చలం గారి పుస్తకాలు నాపై ప్రభావం చూపాయి. అలా అని చదువు నిర్లక్ష్యం చేయలేదు. డాక్టర్‌ అయ్యాక.. ఈ వైపుగా అడుగులు వేశా. సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ అంటే నాకు ఇష్టం. క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఆర్ట్స్‌లో భాగంగా కొన్ని థియేట్రికల్‌ ఆర్ట్స్‌ చేయడం జరిగింది. అప్పుడు నేను ఇంకో పర్సన్‌లా కూడా చేయగలననే థాట్‌తో యాక్టింగ్‌లోకి వచ్చాను. ‘పొలిమేర 1’ టైమ్‌లో అనిల్‌ గారికి అదే చెప్పాను. ఒక యాక్టర్‌గానే కాకుండా, అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తా. సినిమాపై గౌరవంతో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా భాగమయ్యాను. ఈ మూవీకి కూడా నేను డైలాగ్స్‌ రాశాను. స్క్రిప్ట్‌ విషయంలో కూడా ఇన్వాల్వ్‌ అయ్యాను. కష్టానికి తగ్గట్టుగా ఫలితం కనిపించింది. అందుకే ‘పొలిమేర 2’ లో అవకాశం వచ్చింది.

2018 ‘మిస్‌ ఇండియా’ నుంచి నా జర్నీ మొదలైంది. డాక్టర్‌ వృత్తి పక్కనపెట్టి సినిమాల కోసం ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరిగాను. రామరాజు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రియురాలు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అఖిల్‌ నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌’, ‘రౌడీ బాయ్స్’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాల్లో నటించాను. ‘విరూపాక్ష’ మూవీలో హీరోయిన్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె తల్లిగా నటించాను. ఆ ఊరి జనం తప్పుగా అర్థంచేసుకుని, చెట్టుకు కట్టేసి తగలబెట్టేస్తారు. కానీ ఆ పాత్రలో నటించింది నేనే అని ఎవరికీ తెలియదు. నా పాత్రలకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు. ‘ఆహా’ లో ఝాన్సీ, సైతన్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటించాను. ఇప్పుడిప్పుడే జనం నన్ను గుర్తుపడుతున్నారు. నేను నటించిన పాత సినిమాలో నా పాత్రను గుర్తిస్తున్నారు. ఇదంతా అంత ఈజీగా ఏమీ రాలేదు. నా ఐదేళ్ల కష్టమే ఈ గుర్తింపు. నాకు తెలిసి మా అమ్మే నాకు ఇన్‌స్పిరేషన్‌. తను నాకోసం చాలా చేసింది. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పొలిమేర 2′ సినిమాకు తను కో ప్రొడ్యూసర్‌ కూడా.

నాకు రైటింగ్‌ స్కిల్‌ అంటే ఇష్టం. నాకు ఆ కెపాసిటీ ఉందని నమ్ముతున్నాను. ఇండిస్టీలో ఫీమేల్‌ డైరెక్టర్స్‌ చాలా తక్కువగా ఉన్నారు. ఫ్యూచర్‌లో డైరెక్షన్‌ వైపు ప్రయత్నిస్తా. మా నాన్నగారు డిఓపి. ఆయన ఇండిస్టీలో కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా, సెకండ్‌ యూనిట్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. అలా అని నాకు ఏదో బ్యాక్‌ సపోర్ట్‌ ఉందని అనుకోవద్దు. ఇక్కడ ప్రతి ఒక్కటి నాకు నేనుగా కష్టపడి, క్రియేట్‌ చేసుకుందే. కల్పనారారు, రంభ మాకు బంధువులే. అన్ని విభాగాల్లో మా ఫ్యామిలీకి రిలేటివ్‌ అయినవాళ్లు ఉన్నారు. కానీ, నేను ఏ ఒక్కరి సహాయమూ తీసుకోలేదు. కొన్ని అవమానాలూ ఫేస్‌ చేశాను. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుని, ముందుకు వెళుతున్నా.’ అంటున్న కామాక్షి భాస్కర్ల భవిష్యత్తులో ఓ హాస్పిటల్‌ నిర్మించుకుని, ప్రజలకు వైద్యసేవలు అందించాలని అనుకుంటున్నారు.

➡️