జిపిటికి పోటీగా జెమిని..!

Feb 25,2024 12:49 #Gemini GPT..!, #Sneha

గూగుల్‌ ఎ1 చాట్‌ జిపిటికి పోటీగా గూగుల్‌ జెమినీ అల్ట్రా మోడల్‌ వచ్చింది. ఇది మరింత అధునాతన ఎ1 టెక్నాలజీ సేవలను అందిస్తుందని ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ కంపెనీ గూగుల్‌ ప్రకటించింది. ఈ చాట్‌ బాట్‌లో ఎ1 సేవలు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్‌ బటన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ”ఓకే గూగుల్‌” అని చెప్పడం ద్వారా ”జెమిని ఎ1” అసిస్టెంటుగా మొదలుపెట్టొచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల స్క్రీన్లపై ఓవర్‌ లేగా పనిచేస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అంటే ”గూగుల్‌ జెమిని” యూజర్లు ప్రస్తుతం ఫోన్లో ఏయే పనులు చేయొచ్చు.. ఏ యాప్స్‌ రన్‌ అవుతున్నాయి.. లేదా వారు ఏ కథనాలను చదువుతున్నారు.. వేటిని చూస్తున్నారనే విషయాలను ”ట్రాక్‌” చేయొచ్చు. కాబట్టి మీకు ఏదైనా విషయంపై సందేహాలు ఉంటే వెంటనే ”జెమిని”ని అడగొచ్చు. అంతేకాదు మీ ఇంట్లో ఉండే ఏదైనా మొక్కను ఫోటో తీసి, అది ఎలాంటి మొక్క, దాన్ని ఎలా పెంచాలి.. ఏవిధంగా దాన్ని సంరక్షించాలనే వివరాలను ”గూగుల్‌ జెమిని” ని అడగొచ్చు. ఈ మొక్కకు సంబంధించి నిర్వహణ, పోషణ, నీటిపారుదల షెడ్యూల్‌, ఉత్తమ కాంతి కోసం మొక్కను ఎక్కడ ఉంచాలి.. తదితర వివరాలతో పాటు, దాన్ని పెంచే క్రమంలో అవసరమైన ఎరువులను సైతం మీకు ”జెమిని” తెలియజేస్తుంది.

రాబోయే రోజుల్లో..

యాపిల్‌ యూజర్ల కోసం రాబోయే రోజుల్లో ”జెమిని ఎ1” గూగుల్‌ యాప్‌కి సపోర్ట్‌ చేయనుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లు యుఎస్‌ లోని ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనదేశంతో సహా ఇతర దేశాలకు ఎప్పుడు వస్తుందనే వివరాలను గూగుల్‌ ఇంకా వెల్లడించలేదు.

వీటి మధ్య తేడా

ఈ చాట్‌బాట్‌లో ఉపయోగించిన ఉచిత, జెమినీ ప్రో మోడల్‌ ”గూగుల్‌ బార్డ్‌” ఎ1 సేవలు అనేకం ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక నుంచి అవి అందుబాటులో ఉండవు. ఎందుకంటే ”గూగుల్‌ జెమిని” ఒక అధునాతన ఉత్పాదక ఎ1 టూల్‌. దీన్ని వినియోగించుకోవడానికి యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఎన్నికల వేళ నో పొలిటికల్‌ కంటెంట్‌!

సోషల్‌ మీడియా ప్రస్తుతం రాజకీయ నాయకులకు ప్రధాన బలంగా మారింది. మెయిన్‌ మీడియా కంటే సోషల్‌ మీడియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా రాజకీయ నేతలకు షాకిచ్చింది. పొలిటికల్‌ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో అనుమతించబోమని ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో కూడా అవాంఛిత పొలిటికల్‌ కంటెంట్‌కి త్వరలో కళ్లెం వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్‌ కంటెంట్‌ను రెకమెండ్‌ చేయబోమని సంచలన ప్రకటన చేసింది.

అనుసరించాలంటే..అడ్డురాము..

ఇదే క్రమంలో.. రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్‌ను పోస్ట్‌ చేసే ఖాతాలను అనుసరించాలనుకుంటే తాము ఏమాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. యాప్‌లలో రాజకీయ కంటెంట్‌ సిఫార్సులను చూడాలా? వద్దా? అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టం. ఈ మేరకు ఎంపిక చేసుకోవడానికి అనుమతించే సెట్టింగ్‌లను మెటా తీసుకురాబోతోంది. ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్‌బుక్‌లో కూడా అమలు కానుందని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి థ్రెడ్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని.. అందుకే ఫాలో కాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా ప్రమోట్‌ చేయబోమని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు సోషల్‌ మీడియా బలమైన వేదికగా మారింది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మెయిన్‌ మీడియా కంటే సోషల్‌ మీడియానే బాగా ఉపయోగపడుతోంది. అయితే మెటా తాజా నిర్ణయంతో ఇకపై పొలిటికల్‌ కంటెంట్‌ అందరికీ చేరదు. పొలిటికల్‌ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్‌ చేరుతుంది.

➡️