కళ్ళలో వత్తులు..
మొరాయించాయి కన్నీరు నిండుకుని ..
నింగిలోని మేఘాలు.. కళ్ల కింద చేరాయి
పొయ్యిలో కరకర మండాల్సిన
ఎండుకట్టెలు జాలిగా చూస్తున్నాయి
నా బతుకు చిత్రం
బహుముఖ చిత్రాలయ్యాయి..!
ఏటిలోన నా చిత్రం
సూరీడు చెరిపేశాడు
చింత చెట్టు నా నీడను
రాకాసిలా మింగేసింది
వర్షానికి తడిసి ముద్దైన
నా ప్రాణంలో..
కొత్త మొలకలొస్తాయన్న ఆశ..
ఆకాశాన్ని తాకక ముందే..
కుండపోతలో కొట్టుకుపోయింది
ప్రకృతికీ నా బతుకు భారమైందేమో..
కాళ్ళ కింద మట్టి
బీటలు వారకముందే ..
గుండెజారి ఏటిలో పడ్డాను!
ఎందరికో కూడు పెట్టిన
నా చేతులు ఇప్పుడూ
ఏవేవో జలరాశులకు కూడుగా..
ఆపన్నహస్తం కోసం అలసిన నా కళ్ళు
నిశ్చింతగా శాశ్వత ఒడిలోకి చేరుతూ
పైకి చూశాయి.. చందమామ పైనున్న
ధ్యాస ఇసుమంతైనా.. నేలమీదుంటే..
ఆధునికత ప్రకాశించే..యువత
వ్యవసాయంలో వికసించదా..
నిరంతర సేద్యం
పైరగాలయి ముందుకు సాగదా ?
జై భారత్! జై కిసాన్ !
న్యాలకంటి నారాయణ 9550833490